పునరావాస పోరాటంలో.. ఓటుకు నోటు వద్దు

9 Apr, 2019 16:13 IST|Sakshi

ప్రభుత్వంతో పోరాడుతున్న  శ్రీపురంధరపురవాసులు

జీఓ 1024 ఉత్తర్వులు  అమలు చేయాలని డిమాండ్‌

2012 ఉప ఎన్నికలను బహిష్కరించిన  గ్రామస్తులు

దేశం కోసం సర్వం వదులుకున్నారు. ఉన్న ఇంటిని, తిండి పెట్టే భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పిస్తానన్న ప్రభుత్వ హామీని నమ్మారు. వంద కిలోమీటర్లకు దూరంగా వచ్చేశారు. అన్నం ముద్దకోసం, గుక్కెడు నీటికోసం అలమటించారు. ప్రభుత్వం పునరావాసానికి ఇచ్చిన జీఓ 1024 అమలు కోసం 49 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. వదిలివచ్చిన నివాసాలు, భూముల్లో షార్‌ ఏర్పాటై దేశం గర్వించేస్థాయిలో ఓ వైపు ఆనందంపడుతూనే తమ జీవితాలు బాగుపడలేదని దుఃఖిస్తున్నారు. ఓటుకు నోటును తిరస్కరిస్తూ ప్రతి ఎన్నికల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సారి కూడా ఓటుకు నోటును తిరస్కరించారు. తమ సమస్యను పరిష్కరించిన వారికే పట్టం కడుతామంటున్నారు శ్రీపురంధరపురం గ్రామస్తులు.

బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలోని శ్రీహరికోట పరిసరప్రాంతాల్లోని భూమధ్యరేఖ వద్ద ప్రభుత్వం షార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాని పరిధిలోని  భూములను సేకరించాలని భావించింది. ఈ క్రమంలో అక్కడి వారి భూములను, నివాస స్థలాలను ఇవ్వాలని కోరింది. అందుకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారికి పునరావాసం ఇస్తానని ప్రకటించింది.

పునరావాసంపై 1024 పేరిట జీఓ విడుదల
శ్రీహరికోట ప్రాంతంలో నివాసాలు, భూములను ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయంగా పునరావాసం, వసతులు కల్పిస్తామని 1970వ సంవత్సరం నవంబరు రెండో తేదీన జీఓ 1024ను విడుదల చేసింది. జిల్లాలోని తాండూరు, రేగడిచెలిక, నెలబల్లి, నెమలిమిట్ట ప్రాంతాల్లో పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంది. అక్కడి నుంచి రవాణా చేసేందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చింది.

ఆయా ప్రాంతాల్లో నివాసాలకు ఐదు సెంట్ల స్థలం కేటాయిస్తానని తెలిపింది. సేకరించిన భూముల ప్రకారం డ్రైల్యాండ్‌ అయితే ఐదు ఎకరాలు, వెట్‌ ల్యాండ్‌ అయితే రెండు ఎకరాలు ఇస్తానని తెలిపింది. దీంతో పాటుగా ఆయా ప్రాంతాల్లోని భూమిని వారికే తాగునీటి వసతి, దేవాలయాలు, పాఠశాలలు, శ్మశాన భూమి, పశువులకు ఆవాసం తదితరాలకు ఉపయోగిస్తామని పేర్కొంది.

శ్రీపురంధరపురంలో జీఓ1024 అమలుపై పోరాటం
పునరావాసంలో భాగంగా శ్రీహరికోట నుంచి శ్రీపురంధరపురానికి 200 కుటుంబాలు వచ్చాయి. వీరికి తొలినుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీపురంధరపురం ప్రాంతం తొలుత పూర్తిగా అటవీప్రాంతం. ఫారెస్ట్‌ భూములను ప్రభుత్వం డీ–ఫారెస్ట్‌గా మార్చి పునరావాసులకు అందించింది. అయితే జీఓలో పేర్కొన్న విధంగా ఐదు ఎకరాల మెట్ట భూమిని ప్రజలకు ఇవ్వలేదు. నేటికీ ఎకరా భూమి ఇంకా పునరావాసులకు ఇవ్వాల్సి ఉంది.

దీంతో పాటుగా దాదాపు వేయి పశువులు పైగా ఉన్న ఈ ప్రాంతంలో ఆవాసం లేకుండా పోయింది. శ్మశాన భూమి కరువైంది. తాగునీటి వసతి నామ మాత్రంగా మారింది. దీంతో పాటుగా గ్రామంలోని భూమిని బయటప్రాంతాల వారు ఆక్రమించుకున్నారు. వారిపై పాస్‌పుస్తకాలు పొందారు. పునరావాస గ్రామంలో బయటప్రాంతాల వారి ఆక్రమణపై అక్కడి ప్రజలు పోరాడినా రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం ఆక్రమణదారులకు ఉండడంతో పలు ఇబ్బందులు తప్పలేదు. 

ఓటుకు నోటు వద్దు

శ్రీపురంధరపురంలో శాసనసభ ఎన్నికల సమయంలో గ్రామంలోని అందరూ ఒకేమాటపై ఉంటారు. ఓటుకు నోటు వద్దని మూకుమ్మడిగా చెబుతారు. ప్రభుత్వ విడుదల చేసిన జీఓను అమలు చేయాలని కోరుతారు. ఇందులో భాగంగా 2012 ఉప ఎన్నికలను సైతం అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. ఎన్నికలు తమకు వద్దని బాయ్‌కాట్‌ చేశారు. చివరకు రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ హామీని అమలుచేయలేదు. అందుకే ఈ సారి కూడా అక్కడి ప్రజలు తమ సమస్యను పరిష్కరించిన వారికే మద్దతిస్తామని చెబుతున్నారు. 


దేశం కోసం అన్నీ వదులుకుని వచ్చాం 
దేశం కోసం అన్నీ వదులుకుని శ్రీపురంధరపురం వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం. పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదు.      – బిడ్డారెడ్డి జర్రారెడ్డి, శ్రీపురంధరపురం

ఎకరా భూమిని కేటాయించాలి 
పునరావాసం కింద ఇవ్వాల్సిన మిగతా ఎకరా భూమి కేటాయించాలి. ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాం. అయినా పట్టించుకోలేదు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. మాకు న్యాయం చేసిన వారికే ఈ సారి ఎన్నికల్లో మద్దతు ఇస్తాం.    – కాను బోగిశయనరెడ్డి, శ్రీపురంధరపురం

మరిన్ని వార్తలు