థ్యాంక్యూ సీఎం వైఎస్‌ జగన్

10 Jun, 2020 04:07 IST|Sakshi

‌వేస్ట్‌ ఎక్స్చేంజ్‌ ప్లాట్‌ఫామ్‌పై ‘పెటా’ ప్రశంసలు 

ప్రభుత్వ వినూత్న చర్య జంతువులకు మేలు చేస్తుందని ట్వీట్‌

సాక్షి, అమరావతి: కాలుష్య రహితంగా వ్యర్థాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వినూత్న విధానాన్ని జంతువుల రక్షణకు పాటుపడే పీపుల్స్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా) భారత విభాగం ప్రశంసించింది. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ప్రథమంగా వ్యర్థాల ఆన్‌లైన్‌ బదలాయింపు వేదిక (వేస్ట్‌ ఎక్స్చేంజ్‌ ప్లాట్‌ఫామ్‌)ను ప్రారంభించారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ నూతన విధానాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు’ అని పెటా అభినందించింది.

వ్యర్థాల సమర్థ నిర్వహణకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం అమలు చేయడం జంతు ప్రపంచానికి ఎంతో ఉపకరిస్తుందని ‘పెటా’ భారత విభాగం ట్విట్టర్‌లో పేర్కొంది. పారిశ్రామిక సంస్థలు తమ వద్ద ఉన్న ఘన, ద్రవ వ్యర్థాల సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్‌ చేసే వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) ఏర్పాటు చేసింది. కాలుష్య రహితంగా వ్యర్థాల నిర్వహణకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని ఏపీఈఎంసీని ఏర్పాటు చేసింది. ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ.. ‘థ్యాంక్యూ వైఎస్‌ జగన్‌’ అంటూ పెటా ఇండియా ట్వీట్‌ చేసింది.

>
మరిన్ని వార్తలు