కోతల్స్..ఉక్కపోతల్స్..!

25 May, 2014 02:07 IST|Sakshi

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: విద్యుత్ ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రకటించిన సమయాలకంటే రెట్టింపు కోతలు విధిస్తున్నారు. వేసవి తీవ్రతకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలతో జనం విలవిల్లాడుతున్నారు.

ఒంగోలు నగరంలో రోజుకు నాలుగు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నట్లు నాలుగు రోజుల క్రితం ఆ శాఖాధికారులు ప్రకటించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కోత విధిస్తామని చెప్పారు. అయితే అందుకు భిన్నంగా రోజులో 7 గంటల పాటు విద్యుత్ సరఫరా  నిలిపేస్తున్నారు. ఏరియాల వారీగా గంటలకొద్దీ తీసేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు భాగ్యనగర్ ప్రాంతంలో సరఫరా నిలిపేస్తే.. శుక్రవారం రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మరికొన్ని ప్రాంతాల్లో కరెంటు తీసేశారు.

మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో పగటి వేళల్లో ఆరు గంటలు మాత్రమే విద్యుత్ కోత విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కోతలు విధిస్తామన్నారు. అయితే అందుకు విరుద్ధంగా పగటిపూట 10 గంటలపాటు, రాత్రి వేళల్లో కనీసం నాలుగైదు గంటలపాటు రెండు మూడు దఫాలుగా విద్యుత్ లేకుండా చేస్తున్నారు.
 
పరిస్థితి వర్ణనాతీతం. పగలు కనీసం రెండు, మూడు గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదు.  ఒక్కో మండలాన్ని నాలుగు గ్రూపులుగా విభజించి ఒక్కో వారంపాటు ఒక్కో ప్రాంతానికి రోజుకు వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ ఇస్తామని చెప్పారు. కనీసం రెండు నుంచి మూడు గంటలు కూడా  విద్యుత్ ఇవ్వడం లేదు. దీంతో గ్రామాల్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకోవాలన్నా నానా అవస్థలు పడే పరిస్థితి.  ఏ, బీ, సీ, డీలుగా విభజించి పగలు, రాత్రి విద్యుత్‌ను ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం అది అమలు కావడంలేదు.

 నగరాలు, మున్సిపాలిటీల్లో వ్యాపారాలు సున్నా
తీవ్రమైన విద్యుత్ కోతలతో జిల్లాకేంద్రం ఒంగోలు నగరంతోపాటు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో వ్యాపారాలు శూన్యంగా మారాయి. పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడ్డ వ్యాపారస్తులు నెలవారీ ఖర్చులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. పిండి మిల్లులు, రీవైండింగ్, వెల్డింగ్, ఫౌండ్రీల నిర్వాహకుల పరిస్థితి చేతులు కట్టేసినట్లు అయిపోయింది. విద్యుత్ సక్రమంగా లేకపోయినప్పటికీ నెల వచ్చే సరికి బిల్లు మాత్రం కరెంటు షాక్ కొట్టేంత పనిచేస్తుందని వారు వాపోతున్నారు.

 పరిశ్రమల పరిస్థితి మరీ అధ్వానం..
పరిశ్రమలకూ విద్యుత్ కోతల బెడద తప్పలేదు. మే 13న గతంలో ఇచ్చిన పవర్ హాలిడేకు మినహాయింపు ఇస్తూ ఎత్తి వేశారు. దీంతో పారిశ్రామికవేత్తలు వీక్లీ ఆఫ్ పేరుతో ఒక రోజు మాత్రమే విద్యుత్ లేకుండా పోవడం వల్ల కార్మికులకు ఇచ్చే సెలవు రోజు కలిసి వస్తుందని సంబరపడ్డారు. కానీ పేరుకు మాత్రమే పవర్ హాలిడేకు మినహాయింపునిచ్చారు.

విద్యుత్ శాఖాధికారులు మాత్రం అనధికారికంగా రాత్రివేళల్లో పరిశ్రమలు నడుపరాదంటూ పారిశ్రామికవేత్తలకు నోటి మాటగా హుకుం జారీ చేశారు. ఈనెల 18 నుంచి పరిశ్రమలు రాత్రివేళల్లో నడుపరాదంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. వాస్తవానికి పగటి కంటే రాత్రి వేళల్లోనే పరిశ్రమల ఉత్పత్తి సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళల్లో పరిశ్రమలను నడపరాదని విద్యుత్ శాఖాధికారులు చెప్పడంతో వాటిని మూత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మరిన్ని వార్తలు