గుంటూరు గొంతులో గరళం

18 Sep, 2018 14:41 IST|Sakshi
పట్టాభిపురం 4వ లైనులో కుళాయిలో ఎర్రగా వస్తున్న నీరు

నగరంలో కలుషిత     మంచినీరు సరఫరా

తాగునీటి పైపు లైన్లు     లీకులమయం

సోమవారం కుళాయి నుంచి వచ్చిన ఎర్రటి నీరు

పట్టించుకోని         ఇంజినీరింగ్‌ అధికారులు

గుంటూరు నగరం గొంతులో గరళం నింపుకొంది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనులతో రోడ్లను యథేచ్ఛగా తవ్వేశారు. ఈ పనులతో తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా పైపులైన్లలోకి మురుగుచేరి తాగు నీరు కలుషితమవుతోంది. కుళాయిల నుంచి వస్తున్న నీరు భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. సోమవారం పలు ప్రాంతాల్లో పైపులైన్ల నుంచి ఎర్రటి నీరు వచ్చింది. తాగునీటి సరఫరా ఇంత అధ్వానంగా ఉన్నా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చి నెలలో తాగునీరు కలుషితమై అతిసార వ్యాధి ప్రబలి సుమారు 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు అయినా అధికారులు స్పందించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంపాలెం(గుంటూరు): గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో గత మార్చి నెలలో మంచినీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెంది దాదాపు 30 మంది మరణించినా నగరపాలక సంస్థ అధికారులు  మొద్దు నిద్ర వీడటం లేదు. నగరంలో ఇంకా పలు ప్రాంతాల్లో కలుషితనీరు సరఫరా అవుతూనే ఉంది. నీరు దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారు లేరు. కలుషిత నీరు తాగటం వలన చిన్నపిల్లలు, వృద్ధులు తరుచుగా రోగాల బారిన పడుతున్నారు. దీంతో భయాందోళనతో రోజూ రూ.30 నుంచి 40 వెచ్చించి మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేస్తున్నామని నగరవాసులు వాపోతున్నారు. యూజీడీ పైపులైన్ల కోసం తవ్విన గుంతలు నెలల తరబడి పూడ్చకపోవటంతో వాటిల్లో మురుగునీరు చేరి లీకుల ఉన్న పైపుల ద్వారా ఇళ్లలోకి కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నాయి. దీనితో పలు ప్రాంతాల్లో తరుచు కలుషిత నీరు సరఫరా అవుతుంది.

పట్టాభిపురంలో ఎర్రమట్టి నీరు సరఫరా
పట్టాభిపురం ప్రాంతంలో సోమవారం మంచినీటి పైపులైన్లో ఎర్రమట్టి నీరు రావటంతో  స్థానికుల్లో కలకలం రేగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇక్కడ నీరు సరఫరా అవుతుంది. తరుచుగా ఇక్కడ దుర్వాసన, మట్టితో కూడిన నీరు సరఫరా అవుతుండగా సోమవారం మాత్రం పూర్తిగా ఎర్రమట్టితో కూడిన నీరు సరఫరా అయింది. దాదాపు గంటన్నర వరకు పూర్తిగా మట్టినీరు వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేరు. సమీప ప్రాంతంలో ఆదివారం కేబుల్‌ నెట్‌వర్క్‌ పనులు కోసం పైపులు ఏర్పాటు చేస్తుండగా పట్టాభిపురం 4వ లైనుకు మంచినీరు సరఫరా చేస్తున్న 90ఎంఎం డయా పైపులైను అడుగున్నర పైనే పగిలిపోయింది. ఈ విషయం ఇంజినీరింగ్‌ అధికారులు గమనించకుండా నీటిని విడుదల చేయటంతో కుళాయిల్లో ఎర్రమట్టి నీరు సరఫరా అయింది.

నిర్లక్ష్యంగా ఇంజినీరింగ్‌ అధికారులు
నగరంలో నీటిసరఫరాపై ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. నగరంలోని శ్యామలానగర్, ఎస్‌వీఎన్‌ కాలనీ, పట్టాభిపురం, కేవీపీ కాలనీ, పాతగుంటూరు, ఐపీడీ కాలనీ, శివనాగరాజుకాలనీ, రాజీవ్‌గాంధీనగర్, గుంటూరువారితోట, శారదాకాలనీ, ముత్యాలరెడ్డి నగర్‌లోని చాలా వరకు ప్రాంతాల్లో కలుషితనీరు, దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోందని తరుచుగా ఫిర్యాదులు అందుతున్నాయి. గత మార్చిలో డయేరియా సంఘటన జరిగిన తరువాత ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ సైతం నీటి సరఫరా సమయంలో సంబంధిత రిజర్వాయర్‌ ఏఈలతో పాటు, డీఈలు, ఈఈలు, ఇంజనీరింగ్‌ సిబ్బంది వార్డుల్లో పర్యటించి పర్యవేక్షించాలన్నారు.

పైపులైను లీకులు గమనిస్తే వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, మురుగుకాల్వలో నుంచి వెళుతున్న మంచినీటి పైపులైనులు పక్కకు మార్చాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవేమీ అమలుజరగటం లేదు. నామమాత్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పీహెచ్‌ వాల్యూను పరీక్షలు చేసి  చేతులు దులుపుకొంటున్నారు. సంబంధిత ఏఈలు సైతం డివిజన్లలో లీకులు గుర్తించటం, పాడైపోయిన పైపుల స్థానంలో నూతన పైపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయటం వంటివి చేయడం లేదు. ఇక డివిజన్లలో యుజీడీ, సైడుకాల్వల ఏర్పాటుకు, ప్రైవేటు టెలికం సంస్థలు గుంతలు తీస్తున్నప్పుడు వారికి పైపులైన్లపై కనీస సమాచారం కానీ, క్షేత్రస్థాయిలో వారి పనులను పర్యవేక్షించటం కాని జరగటం లేదు. దీనివలనే ఎక్కువ ప్రాంతాల్లో పైపులకు లీకులు, మరమ్మతులు గురవుతున్నాయి. మురుగునీరు సరఫరాపై  స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఇంజినీరింగ్‌ అధికారులు సక్రమంగా స్పందించటం లేదు. పురసేవ, 103 ద్వారా వచ్చే ఫిర్యాదులకు సైతం నూతన పైపులైన్లు ఏర్పాటు చేస్తాం అని, పాత పైపులు కాబట్టి లీకులు అవుతున్నాయని సమాధానం ఇచ్చి ఫిర్యాదులను పరిష్కరించకుండానే క్లోజ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు