ఎవరికి.. ఎవరు సొంతము..

26 Feb, 2020 10:25 IST|Sakshi
ఆస్పత్రిలో మృతదేహం(ఇన్‌సెట్‌లో) కమలమ్మ ఫైల్‌

అనారోగ్యంతో ఆస్పత్రికి

పదిరోజులు అనాథలా ఉండి మృతి

కడ చూపునకు రాని కొడుకు

చుట్టుపక్కలవారి చందాలతో అంత్యక్రియలు

చిత్తూరు, పలమనేరు: ‘నవమాసాలు మోశావు పిల్లలను.. బతుకంతా మోశావు బాధలను.. ఇన్ని మోసినా నిన్ను మోసేవాళ్లు లేక వెళుతున్నావు. కడుపు చించుకు పుట్టిందొకరు.. కాటికి నిన్ను చేర్చదొకరు... ఎవరికి ఎవరు సొంతము.. ఎంతవరకీ బంధమూ.’’ అంటూ సినీ రచయిత రాసిన గీతం పచ్చినిజం. ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి.. పెంచి పెద్దచేసి..పెళ్లిళ్లు చేసిన తల్లి అనాథలా కన్నుమూసింది. చివరకు స్థానికులు చందాలేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిచారకర సంఘటన మంగళవారం పలమనేరులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నాగరాజు, స్థానికులు కథనం మేరకు.. పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన లేట్‌ రామచంద్రప్ప భార్య కమలమ్మ(80)కి ముగ్గురు కుమారులు. పట్టణంలో మురుకులు అమ్ముకుంటూ కష్టపడి వారిని పెంచి, పెద్ద చేసి, పెళ్లి చేసింది. వారిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు.

పెద్దకుమారుడి భార్య (కోడలు) వద్ద మొన్నటిదాకా ఉండింది. ఆపై ఏమి జరిగిందో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనారోగ్యం పాలై స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద రాగి చెట్టు కిందకు పదిరోజుల క్రితం చేరింది. అక్కడున్న సిబ్బంది ఆమెను అనాథగా భావించి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మృతదేహాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక ఆస్పత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు విచారించి పెద్దకోడలికి చెప్పారు. తల్లి చనిపోయిందని తిరుపతిలో ఉంటున్న చిన్న కుమారుడికి స్థానికులు ఫోన్‌ చేసినా వారు పట్టించుకోలేదు. ఓవైపు సమయం మించిపోతుండడంతో సొంత మనుషులు తీసుకెళ్లకుంటే మున్సిపల్‌ వారిచే అంతిమసంస్కారాలు చేయిస్తామంటూ పోలీసులు సిద్ధమయ్యారు. ఆపై స్పందించిన ఆమె మనవడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

స్పందించిన స్థానికులు
ఇన్నాళ్లు తమ మధ్యన ఉన్న ముసలావిడ చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు సొంత మనుషులు వెనుకాడడం చూసిన స్థానికులు స్పందించారు. రూ.4 వేల దాకా చందాలేసుకుని కమలమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. శవం దుర్వాసన రావడంతో ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అక్కడే మనవడు తలకొరికి పెట్టగా అంతిమ సంస్కారాలను కానిచ్చారు.  

మరిన్ని వార్తలు