ఓటుకు పోటెత్తిన జనం

12 Apr, 2019 09:53 IST|Sakshi

సాక్షి, ముదినేపల్లి : మండలంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటేసేందుకు జనం పోటెత్తారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓటర్లు గురువారం ఉదయానికే పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రాల వద్ద బారులు తీరారు. సరైన శిక్షణలేని పోలింగ్‌ సిబ్బంది, ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో అనేక పోలింగ్‌ కేంద్రాల్లో ఓటేసేందుకు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది.

బొమ్మినంపాడు శివారు గొల్లగూడెం 98వ పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 7గంటలకు ప్రారంభించాల్సిన ఓటింగ్‌ ప్రక్రియ ఈవీఎం సక్రమంగా పనిచేయనందున గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కేంద్రం వద్ద ఓటర్లు భారీసంఖ్యలో బారులు తీరారు. వైవాక శివారు పెదగరువు 108వ బూత్‌లో ఇదే పరిస్థితి ఏర్పడింది. స్వల్ప సంఘటనల మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో సిబ్బంది, నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

కలిదిండిలో 80 శాతం...
కలిదిండి మండలంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పోలింగ్‌ ప్రారంభంలో పలుగ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభించారు. దీనికి తోడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు తీవ్ర నిరాశ పరిచింది. రెండు భవనాలు ఉన్న గ్రామంలో ఒకే భవనంలో రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రామాల్లో మూడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.

ఎండ తీవ్రతకు కొందరు ఉదయం పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. పనులు ముగించుకుని రెండవ పూట భారీగా హాజరయ్యారు. మండలంలో మూలలంక, పౌలుపేట, తాడినాడ, చిన తాడినాడ గ్రామాల్లో పోలింగ్‌ ఆలస్యంగా జరిగింది. భాస్కరరావుపేట, తాడినాడ, సానారుద్రవరం, కోట కలిదిండి గ్రామాల్లో ఏడుగంటల తరువాత కూడా పోలింగ్‌ నిర్వహించారు. మొత్తానికి 80 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తహసీల్దార్‌ కనకరాజు తెలిపారు. పోలీసులు తగిన భద్రత కల్పించడంతో మొత్తానికి పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

మండవల్లిలో 84శాతం...
మండవల్లి మండలంలో 37,791 ఓటర్లుకు గాను, 84 శాతం పోలింగ్‌ జరిగినట్లు తహసీల్దార్‌ పీవీ  రమణకుమారి తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్‌ పలు బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్‌లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండవల్లి మండలంలో 29 గ్రామాలు ఉండగా సుమారు 11 గంటల వరకు పోలింగ్‌ సక్రమంగా జరగలేదు.

మండల పరిధిలో 49 పోలింగ్‌ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో కొందరు ఓటర్లు ఎక్కువసేపు లైన్‌లో ఉండలేక ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామని అనుకుని వెళ్లి తిరిగి 4గంటలు దాటిన తర్వాత ఓటు వేయడానికి వస్తే ఓటు వేయడానికి బాగా జాప్యం జరిగి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతూనే ఉంది. కొవ్వాడలంక గ్రామంలో స్వల్ప ఘర్షణ చేసుకుంది. తక్కెళ్లపాడు గ్రామంలో 90 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది.

కైకలూరులో...
పోలింగు ఈవీఎంలు ఓటర్లును ఇబ్బందులు పెట్టాయి. సాంకేతికలోపం, అవగాహన రాహిత్యం వెరసి ఓటర్లు గంటల తరబడి మలమలమాడారు.  కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో మొత్తం 234 పోలింగు బూత్‌లలో గురువారం పోలింగు జరిగింది. నియోజకవర్గాన్ని మొత్తం 12 సెక్టర్లు, 24 రూట్లుగా విభజించారు. ఈ ఏడాది ఎవరికి ఓటు వేశామనేది తిలకించే వీవీప్యాడ్‌లు తికమకపెట్టాయి. స్వల్ప సంఘటనల నడుమ పోలింగు ప్రశాతంగా ముగిసింది. 

ఓటు హక్కును ఉపయోగించుకున్న  అభ్యర్థులు..
అసెంబ్లీకి పోటి చేసిన పలు పార్టీల అభ్యర్థులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు కైకలూరులో, టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ కొట్టాడ గ్రామంలో, బీజేపీ అభ్యర్థి కీర్తి వెంకట రామప్రసాద్, స్వతంత్య్ర అభ్యర్థి భూపతిరాజు రమేష్‌ కుమార్‌ రాజులు కైకలూరులో, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ స్వగ్రామమైన వరహాపట్నం గ్రామంలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్, టీడీపీ అభ్యర్థులు ఆయా పోలింగు బూత్‌లలో జరిగే పోలింగు సరళిని పరిశీలించారు.

మరిన్ని వార్తలు