పరిమళించిన మానవత్వం

27 May, 2019 13:20 IST|Sakshi
అయిభీమవరం రోడ్డు పక్కన వడగాల్పు తగిలిన వృద్ధురాలిని ఆదరించిన స్థానికులు

రెండు రోజులుగా అనాథగా పడి ఉన్న అవ్వ

గుర్తించి ఆశ్రయం ఇచ్చిన స్థానికులు, ఆటోడ్రైవర్లు

పశ్చిమగోదావరి, ఆకివీడు : మానవత్వం పరిమళించింది. మండుటెండలో ఓ అవ్వ అనాథగా రోడు పక్కన ఖాళీ స్థలంలో పడి ఉంది. రెండు రోజులుగా ఆమె అక్కడే ఉండటం ఆ ప్రాంత మహిళలు, ఆటో డ్రైవర్లు గమనించారు. ఆమెను పరామర్శించారు. ఆ వృద్ధురాలి నోటివెంట మాట రావడంలేదు. దీంతో వెంటనే మంచినీళ్లు ఇచ్చి సమీపంలోని వారి ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టారు. రెండు రోజులుగా భోజనం లేకపోవంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయే స్థితిలో స్థానికులు ఆమె ప్రాణాల్ని కాపాడారు. సుమారు 60 ఏళ్లుపైబడి వయసున్న ఆమెను ఇంటి నుంచి నెట్టివేశారా, లేక ఇంట్లో అలిగి బయటకు ఆమె వచ్చేశారో తెలియదు గానీ మండుటెండల్లో ఆమె పడిన అవస్థల్ని చూసి స్థానికుల మనసు కరిగిపోయింది. మానవత్వంతో వృద్ధ మహిళను చెంతన చేర్చుకున్నారు. ఆమె వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తనది రాజోలు దగ్గర శివకోడు గ్రామమని, మన్నే మంగమ్మగా తన పేరును నోటమ్మట మాట రాని పరిస్థితుల్లో ఆమె చెప్పారని స్థానికులు తెలిపారు.

విషయం తెలుసుకున్న ‘సాక్షి’ ఆ ప్రాంతానికి వెళ్లి ఆమె ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని, ఆమె వివరాలు అడిగగా మన్నే మంగమ్మ అని చెప్పారు. ఆమె వద్ద ఉన్న టిక్కెట్టును పరిశీలించగా భీమవర ం నుంచి చెరుకువాడ వరకూ బస్సులో వచ్చారు. చెరుకువాడ నుంచి ఆకివీడు ఎలా వచ్చారో, ఆకివీడులోని అయిభీమవరం రోడ్డులో ఆమె శుక్రవారం రాత్రి నుంచి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె ఇంటి పేరు స్థానిక మాజీ జెడ్పీటీసి మన్నే పోతురాజు ఇంటి పేరు ఒక్కటే కావడంతో ఆయనకు విషయం‘సాక్షి’ తెలియజేసింది. పోతురాజు వెంటనే స్పందించి ఆమెను తన ఇంటికి పంపించాలని సూచించారు. ఆటోలు స్థానిక మహిళ, ఆటోడ్రైవర్లు ఆమెను పోతరాజు ఇంటికి తీసుకువెళ్లారు. తనకు తెలిసిన వ్యక్తులు, తన ఇంటిపేరు ఉన్న వ్యక్తులు శివకోడులో ఉన్నారని, ఫోన్‌ నెంబర్లు కూడా ఉన్నాయని, ఆమె ఆ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు అయితే అక్కడకు పంపించే ఏర్పాట్లు చేస్తానని చెప్పారు.  వృద్ధురాలు మంగమ్మను తన స్వంత ఇంటికి పంపించేందుకు ఆటో డ్రైవర్లు ఆమెకు రూ.600 మేర చందాలు పోగు చేసి అందజేశారు.

>
మరిన్ని వార్తలు