ఆర్డీఎస్‌పై చిగురిస్తున్న ఆశలు

13 Sep, 2019 12:44 IST|Sakshi
తుంగభద్రనదిపై నిర్మించిన ఆర్డీఎస్‌ (ఫైల్‌)

 కుడి కాలువ నిర్మాణానికి కదలిక

సిద్ధమవుతున్న నిపుణుల కమిటీ నివేదిక  

చొరవ చూపుతున్న మంత్రాలయం ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు: తుంగభద్ర జలాలతో పసిడి పంటలను పండించాలనే ఉద్దేశంతో దాదాపు 69 ఏళ్ల క్రితమే చేపట్టాల్సిన నిర్మాణం ఇది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మరుగున పడిన ప్రతిపాదనకు 2006లో మహానేత వైఎస్‌ఆర్‌ జీవం పోసిన ఆర్డీఎస్‌ కుడి కాలువపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత పాలకులు చేపట్టిన లోపాయికారి టెండర్‌ విధానాలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, సత్వర ప్రాధాన్యత ప్రాజెక్టు నిర్మాణాలపై నిపుణుల కమిటిని నియమించింది. నిపుణుల కమిటీ నివేదికపై ప్రాజెక్టుల ప్రాధాన్యతను బట్టి నిర్మాణాలు త్వరితగతినా చేపట్టేలా చర్యలు మొదలు కానున్నాయి. అందులో భాగంగా ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణంపై రైతాంగం ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను నీటిపారుదలశాఖ మంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. జిల్లాకు చెందిన ఇరిగేషన్‌ ఇంజినీర్లతో కలసి ప్రాజెక్టువల్ల ఒనగూరే ప్రయోజనాలు, ఆయకట్టు సాగు విస్తీర్ణంపై వివరించారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన నాలుగు టీఎంసీల నీటి వాటాను వినియోగించుకొనేందుకు ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదించి నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఐదేళ్లుగా నిర్లక్ష్యం చూపిన అప్పటి ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసం ఆర్డీఎస్‌ పనులకు రూ.1550.99 కోట్లతో టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఒప్పందాలు కుదుర్చుకొంది. అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో  సార్వత్రిక ఎన్నికల నాటికి 25 శాతం కూడా పనులు జరగని ఒప్పందాలన్నింటిపై ఆంక్షలు విధించారు. 

పశ్చిమ పల్లెల్లో నీటి కష్టాలకు చెక్‌
1950లో కోసిగి మండలంలోని అగసనూరు, కర్ణాటకలోని రాజోళి మధ్యన తుంగభద్రనదిపై ఆర్డీఎస్‌ ఆనకట్ట కట్టారు. ఈ ఆనకట్టకు ఇరువైపుల కుడి, ఎడమ కాలువలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే మొదట్లో కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని రైతాంగం కోసం ఆర్డీఎస్‌ ఎడమ కాలువ నిర్మాణం జరిగింది. అనంతరం కుడి కాలువ నిర్మాణాన్ని పాలకులు విస్మరించారు. ప్రాధాన్యత క్రమంలో యూఆర్‌ఆర్‌ (అప్పర్‌ రైపేరియన్‌ రైట్స్‌) ప్రకారం మొదటి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు ఇబ్బందులు ఏర్పడితే అదే ప్రాంతంలో మరో ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాలి. దీంతో దశాబ్దాలుగా కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరగటంతో 2005లో ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణం ప్రస్తావనలోకి వచ్చింది. అందుకు అనుగుణంగానే కృష్ణా ట్రిబ్యునల్‌కు అప్పటికే 12 టీఎంసీల సామర్థ్యంతో  ప్రతిపాదిత ప్రాజెక్టుగా ఉన్న కుడికా>లువ నిర్మాణంను అంతరాష్ట్ర చీఫ్‌ ఇంజినీరు ట్రిబ్యునల్‌ ముందుంచారు. ఫలితంగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆర్డీఎస్‌ కుడికాలువకు తుంగభద్రనది నుంచి 4టీఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. కోసిగి మండలం సాతనూరు నుంచి మంత్రాలయం, నాగలదిన్నె, పోలకల్, గూడూరు, నాగలాపురం మీదుగా పర్ల వరకు కుడికాలువ నిర్మాణం ప్రతిపాదించారు.  ఈ కాలువ ద్వారా సుమారు 35వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనీ నిర్దేశించుకొన్నారు.  

డీపీఆర్‌కు మూడేళ్లు: రూ.3.09 కోట్లతో డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) సర్వేకు మూడేళ్లు పట్టింది. 2019లో ఎన్నికల వేడి ముందే రూ.1550.99 కోట్లతో టెండర్లు పిలిచింది. ఎన్‌సీసీ వారు ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్‌ దక్కించుకొని అగ్రిమెంట్‌ కుదుర్చుకొన్నారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌ రావటం, ఎన్నికల హడావుడిలో కాలం గడిచిపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాల ఒప్పందాలు, ఆవశ్యకతలపై నిపుణుల కమిటీని నియమించింది. అయితే టెండర్‌ దక్కించుకొన్న ఎన్‌సీసీ స్వచ్ఛందంగా ఈ కాంట్రాక్టు ఒప్పందాల నుంచి తప్పుకొనే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారుల్లో చర్చ నడుస్తోంది. నిపుణుల కమిటీ నివేదిక అందగానే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొనేలా చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

కరువు రైతుకు సాగునీటి ఫలాలు చేరాలి
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కృషి వల్లే కృష్ణాట్రిబ్యునల్‌కు 12 ఎంసీలు ప్రతిపాదిస్తే 4 ఎంసీలు కేటాయించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లు గడిచిపోయాయి. ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణం సత్వరమే చేపట్టాలని, అందుకు ఉన్న అడ్డంకులన్నింటిని క్లియర్‌ చేయాలని సాగునీటిశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కలసి అధికారులతో ప్రజెంటేషన్‌ ఇప్పించాం. నిపుణుల కమిటీ నివేదిక అందగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకుపోతామని మంత్రి హామీ ఇచ్చారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా