సడలిన సంకల్పం 

24 Mar, 2020 05:14 IST|Sakshi
నెల్లూరు స్టోన్‌హౌస్‌ పేటలో వాహనాల రద్దీ

లాక్‌డౌన్‌ పట్టించుకోకుండా రోడ్లపైకి ప్రజలు 

సాక్షి నెట్‌వర్క్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన లాక్‌డౌన్‌కు తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది. నిత్యావసరాలు, అత్యవసర పనుల కోసం ఇచ్చిన మినహాయింపులను చాలాచోట్ల దుర్వినియోగం చేశారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజానీకం నిత్యావసర వస్తువుల కోసం సోమవారం బయటకు వచ్చారు. బస్సులు, రైళ్లు మినహా మిగిలిన ప్రైవేట్‌ వాహనాలు యథావిధిగా తిరిగాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు మినహా చిన్నాచితకా సంస్థలు తెరుచుకున్నాయి.  ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాపిస్తుందన్న హెచ్చరికలను చాలామంది తేలిగ్గా తీసుకున్నారు. దీంతో పరిస్థితిని పసిగట్టిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. లాక్‌డౌన్‌ను పాటించకపోతే కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.  

అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి
- చిత్తూరు జిల్లా తిరుపతిలో అయితే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష, అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డితో కలిసి నగరంలోని దుకాణాలను మూసివేయించారు.   
- వైఎస్సార్‌ కడప జిల్లాలో పోలీసులు పదేపదే హెచ్చరించినప్పటికీ జనసంచారం ఆగకపోవడం ఆందోళన కలిగించింది.   
- కర్నూలు జిల్లాలోనూ ఉదయం ఆటోలు, ట్యాక్సీలు, టూవీలర్లతో పాటు పలు కాలేజీలు, స్కూళ్ల బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా రోడ్లపైకి వచ్చాయి. మధ్యాహ్నానికి పోలీసులు రంగంలోకి దిగడంతో క్రమంగా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. 
- అనంతపురంలో మధ్యాహ్నం వరకు ప్రజలు ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ఎస్పీ బి. సత్యయేసుబాబు ప్రధాన కూడళ్లతోపాటు జిల్లాలోని వివిధ రహదారులను దిగ్బంధం చేశారు.   
- కృష్ణాజిల్లాలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలో నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.  
- ప్రకాశం జిల్లాలో గుంపులుగా సంచరిస్తున్న వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  
- లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూరగాయల మార్కెట్ల వద్ద రద్దీ కనిపించింది.   
- పశ్చిమ గోదావరి జిల్లాలో బయటకు వచ్చిన వారిని పోలీసులు తిప్పి పంపారు. తెలంగాణా సరిహద్దులను మూసివేశారు.  
- తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు ఒకటి నమోదు కావడం, అనుమానిత కేసులు పెరుగుతుండటంతో మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.  
- విశాఖ జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా.. రైతుబజార్లకు, సూపర్‌ మార్కెట్లకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. మాస్కు లేకుండా బయటికి వచ్చిన వారితో వాగ్వాదాలు జరిగాయి. విజయనగరం జిల్లాలో జనం మార్కెట్లకు క్యూకట్టారు.  
- శ్రీకాకుళం జిల్లాలో లాక్‌డౌన్‌ను ప్రజలు అంతంతమాత్రంగానే పాటించారు. జిల్లా కేంద్రం సహా జిల్లాలో చాలాచోట్ల దుకాణాలు తెరవడంతో పోలీసులు బలవంతంగా మూయించారు.   

మరిన్ని వార్తలు