అపార్ట్‌మెంట్లపై ఆసక్తి

10 Oct, 2019 11:11 IST|Sakshi
గణపవరం రహదారిలో నిర్మించిన అపార్ట్‌మెంట్లు, గ్రూపు హౌస్‌లు

ఉంగుటూరు మండలం నారాయణపురంలో కొత్త సంస్కృతి

రూపుదిద్దుకున్న గ్రూప్‌ హౌస్‌లు

సాక్షి, ఉంగుటూరు: రెండు దశాబ్దాల క్రితం వరకు పల్లెలు ఉమ్మడి కుటుంబాలు, మండువా పెంకిటిళ్లతో అలరాయాయి. నేడవి కనుమరుగయ్యాయి. నగరాలు, పట్టణాల్లో కనబడే అపార్ట్‌మెంట్లు సంస్కృతి నేడు పల్లెల్లోనూ దర్శనమిస్తోంది. అపార్టుమెంట్లలో నివసించేందుకు గ్రామీణులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు నిదర్శనమే ఉంగుటూరు మండలం నారాయణపురం. ఈ గ్రామ కూడలిలో ఇప్పటికి ఏడు అపార్ట్‌మెంట్లు నిర్మించారు. గ్రూపుహౌసులు కూడా నిర్మించారు. 1 ప్లస్‌ 2 వరకు అనుమతిచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు ఉంది. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులతో అపార్ట్‌మెంట్లు నిర్మితమవుతున్నాయి. ఇందుకు కొల్లేరు మండలాలకు ముఖ ద్వారంగా, జాతీయ రహదారిని ఆనుకుని, జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి నారాయణపురం గ్రామం మధ్య నుంచి వెళుతుండటమే కారణంగా తెలుస్తోంది. సుమారు 60 ఐస్‌ పరిశ్రమలు నారాయణపురంలో ఉన్నాయి. రోజుకి 500 లారీలు చేపలు ఇక్కడి నుంచి కలకత్తా వెళుతున్నాయి.

సిలికా సిరమిక్‌ వంటి అతిపెద్ద పరిశ్రమలు ఇక్కడున్నాయి. భీమవరం వైపు సముద్రతీర ఉప్ప ప్రభావం ఎక్కవుగా ఉండటం, తాగునీరు కలుషితం, ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఉన్నత శ్రేణి ప్రజలు నారాయణపురం సెంటరులో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు రైల్వేస్టేషన్లకు వెళ్లేందుకు అనకూలంగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. ఈ ఏరియాలో సెంటు రూ.5 లక్షలుపైగా పలుకుతోంది. స్థలం కొని బిల్డింగ్‌ నిర్మించాలంటే తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో స్థలం కంటే అపార్టుమెంటులో ప్లాటు కొనుక్కోవడమే మేలని భావిస్తున్నారు. మూడెకరాల స్థంలో అపార్ట్‌మెంట్‌ నిర్మించాలంటే స్థానిక పంచాయతీ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకుని అమరావతి నుంచి అనుమతులు పొందాల్సుంది. అపార్ట్‌మెంట్‌ చుట్టూ పైర్‌ ఇంజిన్‌ తిరిగేలా, చుట్టు గాలి, వెలుతుర వచ్చేలా, పార్కింగ్‌ స్థలం చూపి, గార్డెన్‌ పెంచేందుకు స్థలం చూపించాల్సి ఉంది. అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమలు ఇచ్చే అధికారం తమకు లేదని పంచాయతీ కార్యదర్శి రవిచంద్ర తెలిపారు. జి ప్లస్‌ 2 వరకూ తాము అనుమతులిస్తామని, అపార్ట్‌మెంట్లకు అనుమతులు అమరావతిలో ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాల్సి ఉందని వివరించారు.

స్థానికుల ఇష్ట ప్రకారమే నిర్మాణాలు
వాటర్‌ బాగుండటం, పొల్యూషన్‌ లేకపోవడం, గాలి బాగా వీస్తుండంటతో అపార్ట్‌మెంట్లులో ఉండేందుకు ప్రజలు ఇష్ట పడుతున్నారు. రిజర్వు స్థలం చూపించటం, మూడెకరాలకు పైగా స్థలంలో అపార్టుమెంటు నిర్మాణానికి అమరావతి నుంచి ప్లానింగ్‌ డిపార్టుమెంటు అధికార్లు వచ్చి చూశాక గాని అనుమతులు ఇవ్వడంలేదు. చట్టుపక్కల ప్రజల ఇష్టాలను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇస్తున్నారు.  – పొత్తూరి కృష్ణంరాజు, వెంకటలక్ష్మి దుర్గ డవలపర్సు పార్టనర్‌

కల నెరవేరింది
15 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో నారాయణపురంలోనే  ఉంటున్నాను. సెంటు రూ.5.50 లక్షలు పైనే పలుకుతోంది. ఈ నేపథ్యంలో స్థలం కొని బిల్డింగ్‌ నిర్మించటం సాధ్యంకావడంలేదు. దీంతో రూ.30 లక్షలుతో అపార్టుమెంటులో ప్లాటు తీసుకొన్నాను. వసతులు బాగున్నాయి. కొంత బ్యాంకు రుణం కూడా తీసుకున్నాను. నా ఇంటి కల నెరవేరింది. 
– పెనుమత్స భాస్కరరాజు, అపార్టుమెంటు కొనుగోలు దారుడు 

>
మరిన్ని వార్తలు