చూడాలని ఉంది.. చెప్పాలని ఉంది..

4 Jul, 2018 03:07 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లా కుయ్యేరులో అశేష జనవాహినికి అభివాదం చేస్తూ పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌

     జననేత కోసం దారిపొడవునా ఎదురు చూసిన జనం 

     జోరు వర్షంతో పాదయాత్రకు ఒకపూట బ్రేక్‌ 

     వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడకూడదని ఉదయం విరామం 

     జగనన్న రావడం లేదా? అంటూ ప్రజలు నిట్టూర్పు 

     మధ్యాహ్నం ఘన స్వాగతం పలికిన మహిళలు, యువత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోలంక గ్రామ శివారు.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాత్రి బస చేసిన ప్రాంతమది.. అక్కడి నుంచే మంగళవారం 204వ రోజు ప్రజా సంకల్ప యాత్ర మొదలవ్వాలి. కానీ... అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం.. తెల్లారినా తగ్గేట్టు లేదు. ఏం చెయ్యాలనే తర్జన భర్జనలో పార్టీ వర్గాలున్నాయి.. ఆ వర్షంలోనూ చాలా మంది అక్కడికొచ్చారు.. భద్రత సిబ్బంది, పార్టీ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ‘అన్నొస్తాడా? ఈ రోజు పాదయాత్ర ఉంటుందా? ఉంటే ఎప్పుడు?’ అంటూ ఆరా తీశారు. ఇంకొందరైతే... జగన్‌ కోసం గ్రామాల్లో జనం ఎలా ఎదురు చూస్తున్నారో చెప్పారు. అప్పటికే అక్కడకు చాలా మంది ద్విచక్ర వాహనాలలో వచ్చారు. స్కూళ్లు.. కాలేజీలకెళ్లే విద్యార్థులు బ్యాగులతో సహా రావడం కనిపించింది. హోరుగాలి.. జోరువాన సాగుతుండగానే.. మధ్యాహ్నం నుంచి పాదయాత్ర సాగుతుందనే సమాచారం అందింది. టెంట్‌ దగ్గరే ప్రజల్లో ఇంత ఆతృత ఉంటే.. జగన్‌ యాత్ర సాగే పల్లెల్లో వాతావరణమేంటి? అక్కడి ప్రజల్లోంచి వచ్చిన ఈ ప్రశ్నతో ‘సాక్షి’ బృందం పాదయాత్ర సాగే పల్లెలను పరిశీలించేందుకు వెళ్లింది. 

నిరీక్షణ.. నిట్టూర్పు..: ‘ఏంటీ పరిస్థితి.. అన్న బయల్దేరారా?’ అంటూ ఉప్పుమిల్లి గ్రామం దగ్గర కారుకు ఎదురుగా వచ్చి అడిగారు జనం. ‘రావట్లేదా? వర్షం తగ్గితే వస్తానన్నారా?’.. విషయం చెబుతుండగానే ఆత్రంగా ప్రశ్నలేస్తున్నారు వాళ్లు. అక్కడికి కొంత దూరంలో వైఎస్సార్‌సీపీ జెండాలు పట్టుకున్న మరికొంత మంది వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వర్షం కారణంగా పాదయాత్ర మధ్యాహ్నం వరకూ వాయిదా పడిందన్న వార్త విని చాలా మంది నిట్టూర్చారు. అంతలోనే ‘అవునులే.. ఈ వర్షంలో ఎలా సాగుద్ది. ఆపడమే కరెక్ట్‌’ మహిళలు, వృద్ధులు సర్దిచెప్పినట్టు అన్నారు. జగన్‌ వస్తున్నారని ఆ ఊరంతా రాత్రి నుంచే హడావుడిగా ఉందట. మహిళలు గుంపులుగా కూర్చుని చర్చించుకున్నారట.

యువకులు బైకులు అలంకరించుకుంటూ రాత్రంతా గడిపారని అక్కడ చేరిన జనం చెప్పుకున్నారు. కుయ్యేరు జాతరలా మారింది. గుమ్మాల్లో జనం.. గొడుగులేసుకుని జనం.. హోటళ్లు.. బస్‌ షెల్టర్ల దగ్గర జనమే జనం. ఇళ్లల్లోంచి వీధి గుమ్మాల వైపు తొంగి చూస్తున్నారు. బైకులేసుకుని రయ్‌ రయ్‌మంటూ తిరిగే యువకులను అదే పనిగా అడుగుతున్నారు. జగన్‌ వస్తారని, ఆయనకు ఊళ్లో సంగతులన్నీ చెప్పాలని ఊరంతా నిర్ణయించుకుంది. చాలా మంది అర్జీలివ్వాలనుకున్నారు. మహిళలు మంగళహారతులు సిద్ధం చేసుకున్నారు. యువత కేరింతలు కొడుతూ వర్షపు చినుకుల్లోనూ తిరగడం కనిపించింది. ‘ఒకటా.. రెండా.. చంద్రబాబు పాలనలో మా కష్టాలు అన్నీ ఇన్నీ కాదన్నా.. పేదోళ్ల బతుకు మరీ అన్యాయం. వైఎస్‌ స్వర్ణయుగాన్ని చూడాలన్నదే ఊళ్లో అందరి కోరిక. పనులు కూడా మానేసి ఇవాళ జగన్‌ వెంటే నడవాలనుకున్నాం’ అని సరస్వతి, పార్వతి, రమ్యకుమారి, వైష్ణవితో పాటు పలువురు మహిళలు తెలిపారు. వర్షం తెరిపిస్తే తప్పకుండా పాదయాత్ర ఉంటుందనే నమ్మకం వాళ్లలో కనిపించింది. వర్షం ఆగితే మేమే జగనన్న వద్దకు వెళ్తాం అని సుప్రియ, మాలతి, జయలక్ష్మి, నర్సింహరాజు తెలిపారు.  

పల్లె పరుగు.. 
‘జగన్‌ వత్తాడు కదండీ.. ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేసుకున్నాం’ అని వేగమ్మపేటలో పాలమ్మే ముత్యాలనాయుడు అడిగాడు. ఆయనే కాదు.. ఆ ఊళ్లో చాలా మంది జగన్‌ను చూడాలనే ఆరాటంతో ఉన్నారని చెప్పాడు. ‘అదిగో చూడండి.. సీతమ్మగారు ఇంత చలిలోనూ పొద్దున్నే లేచింది. గుడికెళ్లింది. జగన్‌ వస్తే హారతి పట్టాలని ఎదురు చూస్తోంది’ అని ఆ ఊరికే చెందిన రామారావు తెలిపాడు. బాలాంత్రం, వేగంపేట మొదలుకొని ద్రాక్షారామం వరకూ పల్లెల్లో కొత్త సందడి కన్పించింది. పూలతో స్వాగతం పలికేందుకు, హారతులతో ఆహ్వానించేందుకు.. అడుగులో అడుగులేస్తూ కష్టసుఖాలు పంచుకునేందుకు వాళ్లంతా సిద్ధమయ్యారు. యువతులు కొత్త దుస్తులు ధరించి జగన్‌తో సెల్ఫీ దిగాలనే కోరికతో ఉన్నారు. విద్యార్థులు కాలేజీలకెళ్లడానికి, ఉద్యోగస్తులు ఆఫీసులకెళ్లడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ‘ఈ ఒక్కరోజు ఉండాల్సిందే.. జగన్‌ను దగ్గరి నుంచి చూడాల్సిందే’ అని మా ఆయన మొండికేసి కూర్చున్నాడు అని వరలక్ష్మి తెలిపింది. 

జనానికి ఇబ్బంది రాకూడదనే..  
మధ్యాహ్నం సరిగ్గా రెండున్నర గంటలకు పాదయాత్ర మొదలైంది. అప్పటికే భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. కోలంక, ఉప్పుమిల్లి గ్రామాల మీదుగా కుయ్యేరు వరకు అర్జీలతో, ఆత్మీయ పలకరింపులతో జనం.. జగన్‌ అడుగులో అడుగులేశారు. మహిళలు చిన్న పిల్లలను వెంట పెట్టుకొని హారతి పళ్లేలతో రోడ్డు మీదకు వచ్చారు. కాకినాడ కాజా, ఇళ్లలో స్వయంగా తయారు చేసిన పిండి వంటలను జననేతకు రుచి చూపించాలని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవి అనే మహిళ మాట్లాడుతూ.. ‘జననేతను చూడాలని మా కుటుంబ సభ్యులతో కలిసి చొల్లంగి నుంచి వచ్చాను. ఎట్టకేలకు కుయ్యేరులో జగనన్నను కలిశాము’ అని ఆనందంతో చెప్పింది. మరికొందరు తమ సమస్యలు చెప్పుకున్నారు. అప్పటికే వర్షంతో అంతటా బురదే. అయినప్పటికీ మూడు కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.

ఈ పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని జగన్‌మోహన్‌ రెడ్డి వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఆ ప్రాంతం ఇరుకుగా ఉంది. యువతే కాదు.. వయో వృద్ధులూ కష్టాలు చెప్పుకునేందుకు వచ్చారు. బురదగా ఉండటంతో వాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ పరిశీలించాక వర్షం తెరిపిచ్చే వరకు పాదయాత్ర వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించారు. తొలుత జనం నిరాశపడ్డా, ఆ తర్వాత వాళ్లూ ఇదే అభిప్రాయంతో ఏకీభవించారు. కాగా, జగన్‌ రాక సందర్భంగా ద్రాక్షారామం గ్రామానికి చెందిన వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించే పలివెల శీను వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ను, వైఎస్‌ ఫొటోను తన బైక్‌పై అమర్చుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు. న్యాయవాదుల సంక్షేమానికి మీరిచ్చిన హామీలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని రామచంద్రపురానికి చెందిన న్యాయవాది దొమ్మలపాటి సత్యనారాయణ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారంలోకి వచ్చాక జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌ ఇస్తామని చెప్పడం ఎంతో ప్రయోజనకరం అన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు