వద్దంటే వినరే..?

6 Jun, 2020 07:40 IST|Sakshi

లోపించిన పౌర స్పృహ 

అధికారులు వారిస్తున్నా పట్టించుకోని జనం 

సామాజిక దూరం పాటించకుండా 

విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్న నగర ప్రజలు 

కట్టడి చేసేందుకు పోలీసులు, అధికారుల ప్రయత్నాలు 

ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి 

నియంత్రిస్తున్న పోలీసులు 

కంటికి కనిపించని శత్రువుతో పోరాటం.. కరోనా వైరస్‌ రూపంలో కమ్ముకొస్తున్న భూతం.. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియని భయం.. మానవాళికి సవాలు విసురుతున్న మహమ్మారిని జయించాలంటే సమాజం సమష్టిగా పోరాడాలి. వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటూనే.. జనజీవనానికి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అయితే  కోవిడ్‌–19ను జిల్లాలో పౌర సమాజం  తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ సడలింపులను జిల్లా వాసులు రెండు నెలల నిర్బంధం నుంచి విముక్తిగా భావిస్తూ యథావిధిగా తిరుగుతున్నారు. భవిష్యత్తులో ముంచుకొచ్చే ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రతి ఫేజ్‌లోను పెరుగుతున్న కేసుల సంఖ్య భయపెడుతున్నా.. కొంత మందిలో మార్పు రావడం లేదు. కరోనా పాజిటివ్‌   కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. 

దొండపర్తి (విశాఖ దక్షిణ):  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతోంది. నగరంలోనే కాకుండా జిల్లావాసులను సైతం ఆవహిస్తోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 143 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 84 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 58 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేసినా.. ఎన్‌ఆర్‌ఐ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి సమయంలో ఇళ్లకే పరిమితమవ్వాల్సిన ప్రజలు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

వైరస్‌ తమకు సోకదన్న భావనతో ఇష్టానుసారంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను సైతం పనంగా పెడుతున్నారు. వైద్యులు ఎన్ని సూచనలు చేస్తున్నా.. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ లేదా మందు లేదన్న విషయం తెలిసినప్పటికీ.. సామాజిక స్పృహను మరచి ప్రవర్తిస్తున్నారు. ప్రజలు మేలుకోకపోతే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం అసాధ్యమని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.  

కిక్కిరిసిపోతున్న రోడ్లు 
లాక్‌డౌన్‌–5లో కేంద్ర ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధార ణ కార్యకలాపాలకు అనుమతులిచ్చింది. అయి తే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ని బంధన కూడా విధించింది. సడలింపులు రావడంతో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రెండు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో ప్రధాన జంక్షన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ ప నులు చేసుకోవాలన్న   సూచనలను కొందరు గాలికి వదిలేస్తున్నారు. ఇష్టానుసారంగా, అవ సరం లేకున్నా బయట తిరుగుతున్నారు. కొంత మంది ఏకంగా బీచ్‌రోడ్లలో పారీ్టలు సైతం చేసుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి రెస్టారెంట్లు, భారీ షాపింగ్‌ మాల్స్‌ కూడా ప్రా రంభం కానున్నాయి. దీంతో జన సంచారం మ రింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకుంటూ కా ర్యకలాపాలు నిర్వహించుకుంటే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

కేసుల క్రమం 
జిల్లాలో మార్చి 18వ తేదీన అల్లిపురం ప్రాంతంలో తొలి కరోనా కేసు నమోదైంది. మక్కా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకింది. 
కోవిడ్‌–19 నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేసింది. 
తొలి దశలో ఏప్రిల్‌ 14  వరకు లాక్‌డౌన్‌ అమలవగా.. ఈ సమయంలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, వారి కుటుంబ సభ్యు లకు వైరస్‌ సోకింది. దీంతో తొలి 21 రోజుల్లో 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
ఏప్రిల్‌ 15 నుంచి మే 3వ తేదీ వరకు 19 రోజుల పాటు అమలు చేసిన లాక్‌డౌన్‌–2.0లో మరో 9 కేసులు నమోదయ్యాయి.   
మే 4 నుంచి మే 17 వరకు 14 రోజుల పాటు లాక్‌డౌన్‌–3.0లో 45 మందికి వైరస్‌ సోకింది.   
మే 18 నుంచి 31 వరకు 14 రోజుల పాటు సాగిన లాక్‌డౌన్‌–4లో కూడా 35 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.  
లాక్‌డౌన్‌లో–5లో   తొలి ఆరు రోజుల్లోనే 34 

కరోనా చికిత్సకు అన్ని సౌకర్యాలు 
కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అందరినీ కార్వంటైన్‌కు తరలించి నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే ఏర్పాట్లు చేశాం. మరోవైపు కరోనా బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజలు కూడా కరోనా నియంత్రణకు సహకరించాలి. 
– జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ 

కరోనా నియంత్రణ ప్రజల చేతుల్లోనే  
కరోనా నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉంది. తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. మాస్కు ధరించారు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా వెంటనే వార్డు, గ్రామ వాలంటీర్లకు సమాచారం అందించాలి. వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
– జీవీఎంసీ కమిషనర్‌ సృజన  

మరిన్ని వార్తలు