ఇ‘స్మార్ట్‌’ ఫోన్లున్నా బేసిక్‌ మోడళ్లే టాప్‌

25 Feb, 2020 04:57 IST|Sakshi

టెక్నాలజీ పెరిగినా ఫీచర్‌ ఫోన్లపైనే మక్కువ

సాక్షి, అమరావతి: రకరకాల ఆకర్షణలతో స్మార్ట్‌ ఫోన్లు వెల్లువలా వస్తున్నా దేశంలో మాత్రం ఫీచర్‌ ఫోన్లు (బేసిక్‌ మోడళ్లు) పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. టెక్నాలజీతో అవసరాలన్నీ తీరిపోయేలా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా ఇప్పటికీ ఫీచర్‌ ఫోన్లనే చాలామంది నమ్ముకుంటున్నారు. దేశంలో 80 కోట్ల మందికిపైగా మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులుండగా 45 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్లే వాడుతున్నట్లు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) విశ్లేషణలో తేలింది. 35 కోట్ల మంది మాత్రమే స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. 

మళ్లీ మొదటికి!
మూడేళ్ల క్రితం స్మార్ట్‌ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే గత ఏడాది నుంచి స్మార్ట్‌ ఫోన్ల వాడకందారులు సైతం మళ్లీ ఫీచర్‌ ఫోన్లు కొంటున్నట్లు గుర్తించారు. 2018, 19లో స్మార్ట్‌ ఫోన్ల వినియోగం తగ్గింది.  గతంలో స్మార్ట్‌ ఫోన్ల పట్ల ఆకర్షితులైన వారు కూడా ఫోన్లు మార్చుకునే సమయంలో ఫీచర్‌ ఫోన్‌ వైపు మళ్లినట్లు గుర్తించారు.

ఎందుకంటే...?
ఇంటర్నెట్‌పై అవగాహన లేకపోవడం, స్మార్ట్‌ ఫోన్లలో ఫీచర్లు వాడడం తెలియక చాలామంది ఫీచర్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. కార్మికులు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫీచర్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. ధరలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఫీచర్‌ ఫోన్లు వాడేవారిలో ఎక్కువ మంది రూ.వెయ్యి లోపు వాటినే కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్ల ధర ఎక్కువగా ఉండటం, నిర్వహణ భారంగా మారడం కూడా వీటిపై విముఖతకు కారణం. 2019 చివరి నాటికి దేశంలో 81 కోట్ల మంది మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తున్నట్లు ఐడీసీ లెక్క తేల్చింది. టెలికాం ఆర్థిక పరిశోధనా విభాగం మాత్రం ఇది 118 కోట్లు దాటినట్లు పేర్కొంటోంది. ఐడీసీ వినియోగదారుల (యూజర్లు) సంఖ్యను లెక్కిస్తుండగా కేంద్ర ప్రభుత్వ విభాగం కనెక్షన్లు లెక్కిస్తుండడం వల్ల  వ్యత్యాసం నెలకొన్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు