బొబ్బిలిలో... తిరుగుబావుటా!

30 Oct, 2018 07:38 IST|Sakshi
బొబ్బిలిలో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభకు పోటెత్తిన జనప్రవాహంలోని ఒకభాగం (ఫైల్‌)

రాజులపాలనపై పెరుగుతున్న వ్యతిరేకత

రాజుల అనుచరులపై కలబడుతున్న జనం

బహిరంగంగా బేబీ నాయనను నిలదీసిన వైనం

జగన్‌ పాదయాత్రతో నియోజకవర్గంలో పెనుమార్పు

నాటి సభలో జననేత ప్రసంగంతో పెరిగిన ధైర్యం

బొబ్బిలి రాజులంటే ఎంతో గౌరవం... వారు ఎదురుపడితే ఏదో తెలియని అభిమానం... వారు వస్తున్నారంటే చాలు లెక్కలేనంత ఆనందం. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు వారితీరుపై వ్యతి రేకత వ్యక్తమవుతోంది. స్వప్రయోజనా లకోసం వారు చేస్తున్న మోసాల తో ఆ గౌరవం కోల్పోతున్నారు. వారు చేసే చౌకబారు రాజకీయాలతో  భయం... భక్తి కోల్పోయారు. అంతేనా ఆ స్థానంలో తిరుగుబాటు చోటు చేసుకుంటోం ది. ఇప్పటి వరకూ వారి అనుచరులపైనే ఎదురుతిరిగిన ప్రజలు ఇప్పుడు రాజులపైనే  నేరుగా తిరుగుబాటు చేయడం చర్చనీయాంశమైంది.

సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజల్లో అసంతృప్తి ఒకవైపు... పార్టీ కేడర్‌లో నైరాశ్యం మరోవైపు... భారీగా పెరుగుతుండడంతో పాటు పలు  సందర్భాల్లో రాజులపై అసంతృప్తి బట్టబయలవుతోంది.  తాజాగా మంత్రి సుజయ్‌ తమ్ముడు బేబీనాయనను స్వపార్టీ వారే ఘెరావ్‌ చేసి, అనుచరుల ఆగడాలపై నిలదీయడంతో  బొబ్బిలి రాజుల పరువు మరోసారి వీధిన పడింది. అభివృద్ధి కోసమే పార్టీ మారానని, మంత్రి పదవి రాగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాననీ వైఎస్సార్‌సీపీని వీడిన బొబ్బిలి రాజులపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. మంత్రి పదవి కోసం తల్లిలాంటి పార్టీని వదలి వెళ్లిన ఆర్‌వి సుజయ కృష్ణ రంగారావుపై ప్రజల్లోనమ్మకం సడలుతోంది. అధికార తెలుగుదేశం ప్రభుత్వం, మంత్రి సుజయ్‌ పరిపాలనపై వ్యతిరేకతతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల బొబ్బిలిలో నిర్వహించిన సభలో ప్రసంగానికి ప్రజలు ఆకర్షితులై చైతన్యం పొందారు. ఆ స్ఫూర్తితో రాజులను నిలదీస్తున్నారు.

జగన్‌ సభతో మారుతున్న రాజకీయం
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న కళాభారతి ఎదురుగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన జనసందోహం అక్కడి పరిస్థితిని ప్రతిబింబింపజేసింది. బొబ్బిలి చరిత్రలో నభూతో అన్న రీతిలో వేలాది మంది యువత, కార్మికులు, మహిళలు, వృద్ధులు ఈ సభకు తరలి రావడం... జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగానికి ముగ్ధులై జయజయ ధ్వానాలు చేశారు. నాటి సభలో జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రి అక్రమాలను ఎండగట్టినపుడు ప్రజలు హర్షామోదాలను వ్యక్తం చేస్తూ జేజేలు పలికారు. పట్టణంలోని చెరువులను కూడా మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్న వైనాన్ని, తాగునీటిని కూడా సక్రమంగా ఇవ్వడం లేదనీ, దీనికోసమేనా పార్టీ మారిందని బొబ్బిలి రాజులను విమర్శించడంతో జనానికి వైఎస్సార్‌సీపీపై బలమైన నమ్మకం కలిగింది. విద్యా రంగంపై తాను చేపట్టబోయే కార్యక్రమాలను, పథకాల వివరాలను చెప్పినపుడు మహిళలు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక మంత్రి ఆర్‌.వి.ఎస్‌.కె.రంగారావు పార్టీని వీడటం తదనంతర పరిణామాలు, ప్రజలను మోసగించిన తీరును వివరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని ఇప్పటికీ జనం బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

మాజీ కౌన్సిలర్‌ తీరుపై ప్రజల్లో నిరసన
గొల్లపల్లిలోని మాజీ కౌన్సిలర్‌ కాకల వెంకటరావు మంత్రి రంగారావు, ఆయన తమ్ముడు బేబీనాయనలకు అనుచరుడు. ఆయనపై భూ ఆక్రమణలు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారనే అపవాదులు ఉన్నప్పటికీ  ఇన్నాళ్లూ తాము రాజుల మనుషులమని చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్నాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎస్సీ అట్రాసిటీ కేసుకు సిద్ధం కావాలంటూ బెదిరిస్తారు. అలాగే మరో కౌన్సిలర్‌ భర్త బొబ్బాది తవిటినాయుడు చెరువులను కప్పేస్తూ మంత్రికి చెప్పే చేస్తున్నామని పబ్లిక్‌గా చెబుతున్నారు. గతంలో రాజుల పేరు చెబితే ఊరుకునే జనం ఇప్పుడు రాజుల అనుచరులు చేస్తున్న దురాగతాలపై తిరగబడుతున్నారు. బేబీనాయన వద్ద పంచాయితీ అయినపుడు ఆయన సర్దుబాటు చేసేందుకు చేసే యత్నాన్ని కూడా అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే బొబ్బాది తవిటి నాయుడును కూడా కాకల వెంకటరావు సంఘటనపై స్థానికులు నిలదీశారు. ఇవన్నీ ప్రజల్లో వచ్చిన చైతన్యానికి తార్కారణంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బొబ్బిలి ప్రజల్లో ధైర్యం నింపిందనే వ్యాఖ్యలు బొబ్బిలిలో ప్రతిధ్వనిస్తున్నాయి.

మరిన్ని వార్తలు