టీడీపీ తీరుపై నిరసన జ్వాలలు

23 Jan, 2020 19:55 IST|Sakshi

టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

విశాఖలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వినూత్న నిరసన

కర్నూలులో ఎమ్మెల్సీ ఫరూర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాల జేఏసీ

తిరుపతి ఎస్వీయూలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.

విశాఖ జిల్లా: విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వినూత్న నిరసన చేపట్టింది. శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ  అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి ఆధ్వర్యంలో మహిళలు నల్ల చీరలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ’ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్‌, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, మళ్ల విజయప్రసాద్‌, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నంలో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ టౌన్ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలిలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. తన స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబుకు హితవుపలికారు. శాసనమండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుబట్టారు.

విశాఖ నార్త్‌లో: శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ నార్త్‌ కన్వీనర్‌ కేకే రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్‌ నుంచి నల్ల వస్త్రాలు ధరించిన మహిళలు నిరసనలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు అండ్‌ కో పై కేకే రాజు మండిపడ్డారు.

ఎన్‌ఏడీ జంక్షన్‌లో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ ఎన్‌ఏడీ జంక్షన్‌లో విశాఖ వాసులు మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ విశాఖ వెస్ట్‌ కన్వీనర్‌ మళ్ల విజయప్రసాద్‌ సంఘీభావం తెలిపారు. విశాఖ నార్త్‌ కన్వీనర్‌ కేకేరాజు మాట్లాడుతూ.. విశాఖ ప్రజల ఓట్లతో పరువు నిలబెట్టుకున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ద్రోహానికి పాల్పడ్డారన్నారు. విజయప్రసాద్‌ మాట్లాడుతూ.. శాసనమండలి చైర్మన్‌ తీరు రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. పదవులు, బినామీ ఆస్తుల కోసం చంద్రబాబు ఎంతటి మోసానికైనా ఒడిగడతారన్నారు.

పశ్చిమగోదావరిలో: శాసనమండలి టీడీపీ వైఖరికి నిరసనగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు విశాల్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ అభిమానులు,కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు.


కర్నూలు జిల్లా: టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమ ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశాడంటూ న్యాయవాదులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఎమ్మెల్సీ ఫరూక్‌ కార్యాలయం ముట్టడి
మండలిలో టీడీపీ వైఖరికి నిరసనగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నేతలు ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకుని కర్నూలు జ్యూడిషియల్‌ క్యాపిటల్‌కు మద్దతు పలకాలని, లేని పక్షంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. జేఏసీ నేతలు.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు

అనంతపురం జిల్లా: ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా గుత్తిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్‌సీపీ నేతలు దహనం చేశారు.


కల్యాణదుర్గంలో..
వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఆంధ్రుల ద్రోహి చంద్రబాబు అని, శాసనమండలి బిల్లులను అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.

చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా తిరుపతి ఎస్వీయూలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మండలి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. రియల్‌ హీరో వైఎస్‌ జగన్‌ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన నేత ఓబుల్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు