ఆరంభంలోనే ఆగ్రహావేశాలు

3 Jan, 2019 06:11 IST|Sakshi
మెంటాడ మండలం కుంటినవలసలో మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ప్రశ్నిస్తున్న జనాలను అడ్డుకుంటున్న పోలీసులు

రసాభాసగా తొలిరోజు జన్మభూమి గ్రామసభలు

అడుగడుగునా పాలకపక్షంపై ఆగ్రహావేశాలు

సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు... నిలదీతలు

పోలీసుల సాయంతో పలుచోట్ల సభల నిర్వహణ

జనం లేక విద్యార్థులతో సరిపెట్టిన వైనం

ఊహించిందే జరిగింది. తొలిరోజు జన్మభూమి గ్రామసభలు నిరసనలు... నిలదీతలతో సాగాయి. పాలకపక్షనాయకులు, అధికారులను ఎక్కడికక్కడే జనం అడ్డుకుని ప్రశ్నలతో బెంబేలెత్తించారు. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి నిలదీసినవారిని బయటకు నెట్టేశారు. గతంలో ఇచ్చిన అర్జీలను పరిష్కరించనందుకు కొన్నిచోట్ల... కరువు మండలాలుగా ఎందుకు ప్రకటించలేదంటూ మరికొన్ని చోట్ల... ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలు గ్రామాల్లో సభలకు జనం రాకపోవడంతో విద్యార్థులతో మమ అనిపించేశారు.

సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఆరో విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ప్రజల అసంతృప్తుల నడుమ బుధవారం ప్రారంభమైంది. సభల్లో ప్రజాప్రతినిధులు అధికారులను స్థానికులు నిలదీస్తుంటే... మరోవైపు ఈ సభల సాక్షిగా టీడీపీ నేతలు,  అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టమైంది. నాలుగేళ్లుగా తమను పట్టించుకోకపోవడంపై ఎక్కువమంది ప్రజలు అధికారులను ప్రశ్నించా రు. పబ్లిక్‌ కుళాయిల వెంట నీరు రావటం లేదని... పారిశుద్ధ్య నిర్వహణ ఆధ్వానంగా ఉందని... పలువురు మహిళలు వద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం ఎన్ని మార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూ రు చేయటం లేదని వాపోయారు. కొందరైతే ప్రయోజనం లేనప్పుడు ఎందుకివ్వాలంటూ అర్జీలు ఇవ్వడానికి విముఖత ప్రదర్శించారు. ప్రజల కు సమాధానం చెప్పలేని పాలకులు,అధికారులు పోలీసుల సాయంతో తొలిరోజు జన్మభూమి–మాఊరు కార్యక్రమాన్ని మమ అనిపించారు.

సెల్‌టవర్‌ను వ్యతిరేకిస్తూ మహిళల నిరసన
విజయనగరంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. 15వ వార్డు పరిధిలోని దాసన్నపేట ప్రాంతంలో జరిగిన సభలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్‌ టి.వేణుగోపాల్‌ పాల్గొనగా జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు సభను అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు జోక్యం చేసుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు. సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని నిలిపివేస్తామని చైర్మన్‌ ప్రకటించటంతో జనం శాంతించారు. వార్డు పరిధిలోని రామకృష్ణానగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తాగు నీటి కోసం బోరు బావి ఏర్పాటు చేయాలని నాలుగేళ్లుగా వినతిపత్రాలు ఇస్తున్నా స్పందించకపోవటంపై కమిషనర్‌ టి.వేణుగోపాల్‌ను నిలదీశారు.

సంక్షేమం కొందరికేనా...
సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని, కొందరికి మాత్రమే అందివ్వడంలో ఆంతర్యమేమిటని పార్వతీపురం పట్టణంలో నిర్వహించిన జన్మభూమి సభలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు, పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు అధికారులను ప్రశ్నించారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికోసమే ప్రభుత్వం ఉందా అని నిలదీశారు.

మంత్రి వస్తారని...
తెర్లాంలో జరిగే సభకు మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావు హాజరవుతారని తొలుత ప్రకటించడంతో పలువురు అర్జీదారులు వేచి చూశారు. తీరా ఆయన రావడం లేదంటూ తీరికగా చెప్పడంతో ప్రజలంతా ఉసూరంటూ వెనుతిరిగారు. బొబ్బిలిలో వార్డుల వారీగా జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలున్నా ఇక్కడ మూడు వార్డులకు కలిపి ఒకే చోట సభను నిర్వహించి మమ అనిపించేశారు. బాడంగిలో సంక్షేమ పథకాలు అమలుపై వైఎస్సార్‌ సీపీ ప్రచార కార్యదర్శి పెద్దింటి రామారావు అధికారులను నిలదీశారు. కొన్ని చోట్ల ఆర్జీలు ఇచ్చేందుకు ప్రజలు విముఖత ప్రదర్శించారు.

కరువు కనిపించడం లేదా...
కొత్తవలస, వేపాడ మండలాల్లో కరువు కనిపించడం లేదా అంటూ ఆయా మండలాల్లో జరిగిన గ్రామసభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానికులు నిలదీశారు. అసలు పంటపొలాలు పరిశీలించకుండా సభ నిర్వహిస్తే సహించబోమంటూ వేపాడ మండలం ముకుందపురంలో జరిగిన సభను అక్కడివారు అడ్డుకున్నారు. చేసేది లేక అధికారులు పొలాలు పరిశీలించారు. కొత్తవలస మండలం కంటకాపల్లిలో కరువు ప్రకటనపై ఎమ్మెల్యేను నిలదీయగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్‌.కోట మండలం కొట్యాడ, వీరభద్రపేట గ్రామాల్లో జరిగిన సభల్లో పాత అర్జీలు పరిష్కరించకుండా కొత్తగా ఎందుకు సభలని నిలదీశారు. ఎస్‌కోట మండలం ముషిడిపల్లిలో జనం రాకపోవడంతో గురుకుల విద్యార్థినులతో మమ అనిపించారు.

పథకాలున్నా... ప్రయోజనమేదీ?
పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లకు అర్హులైన ఎంతోమంది ఉన్నా వారికి ఎందుకు మంజూరు చేయడం లేదంటూ గజపతినగరం మండలం కెంగువలో జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును గ్రామస్తులు నిలదీశారు. పసుపు–కుంకుమ డబ్బు రాలేదని దత్తిరాజేరు మండలం విజయరామపురం, షికారుగంజి గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి పాండురంగను మహిళలు నిలదీశారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ ఆందోళనలు కొనసాగాయి. డెంకాడ మండలం నాతవలసలో నిర్వహించిన సభలో పంచాయతీ కార్యాలయానికి భవనం మంజూరు చేయాలని ఎన్నాళ్లుగా కోరుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ భర్త బమ్మిడి వెంకటరమణ అధికారులను నిలదీశారు.

మరుగుదొడ్ల బిల్లులివ్వరా...
కురుపాంలో జన్మభూమికి వెళ్తున్న ఎంపీడీవో, సిబ్బంది, అధికారులను వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు చెల్లించలేదంటూ లబ్ధిదారులు అడ్డుకున్నారు. బిల్లుల కోసం ఎన్నాళ్లు కార్యాలయం చుట్టూ తిరగాలని లబ్ధిదారులకు రసూల్, వెంకటరమణ తదితరులు నిలదీశారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం సొలిపి, సోమరాజుపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జన్మభూమి సభలెందుకని అధికారులను స్థానికులు నిలదీశారు.

బిల్లులొచ్చినా చెల్లించరే
ఉపాధి వేతన కార్మికులకు పోస్టాఫీసులో బిల్లులు పడినా తమకు చెల్లించడం లేదని పాచిపెంట మండలం కర్రివలసలో జరిగిన సభలో అర్జీదారులు ఆ‘గ్రహం వ్యక్తం చేశారు. సాలూరు పట్టణం గుమడాం, చిట్టులువీధిలో రేషన్‌ కార్డులు, పింఛన్ల కోసం ప్రశ్నించారు. మక్కువ మండలం కోన పంచాయతీలో ఇళ్ళ బిల్లుల మంజూరులో ఎందుకు జాప్యంచేస్తున్నారని ప్రశ్నించారు. మెంటాడ మండలం పెదచామలాల్లి, కుంటినవలసల్లోనూ ఇళ్ల బిల్లులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అడ్డుకున్నారు. కుంటినవలసలో సమస్యలపై మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను స్థానికులు ప్రశ్నించడంతో వారిని బలవంతగా పోలీసులు బయటకు నెట్టివేశారు.

మరిన్ని వార్తలు