దద్దరిల్లిన కలెక్టరేట్‌...

30 Jun, 2018 10:31 IST|Sakshi
డెంకాడ పోలీస్టేషన్‌ ముందు మాట్లాడుతున్న సీఐటీయూ, మధ్యాహ్న భోజన పథక  నిర్వాహకుల సంఘ ప్రతినిధులు 

సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు\

పోలీసుల ఓవరాక్షన్‌ ఆందోళనకారులను ఈడ్చుకెళ్లిన ఖాకీలు

69 మంది అరెస్ట్‌.. విడుదల

విజయనగరం పూల్‌బాగ్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేటీకరణ చేయవద్దని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఎండీఎం యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి. సుధారాణి మాట్లాడుతూ,  మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేస్తే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.

పథకాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనుకోవడం తగదన్నారు. బిల్లులు ఇవ్వకపోయినా 15 ఏళ్లుగా అనేక కష్టానష్టాలకోర్చి పథకాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే పథకాన్ని ప్రవేటీకరించే ఆలోచనను విరమించుకోవడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు కనీసవేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే మెనూ చార్జీలు పెంచడం.. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, తదతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.

 రెచ్చిపోయిన పోలీసులు

మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పది నుంచి 12 గంటల వరకు కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. అయినప్పటికీ అధికారులు రాకపోయేసరికి రాస్తారోకో చేపట్టేందుకు సిద్ధపడ్డారు. అప్పటికే ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఒక్కసారికి వారిపై విరుచుకుపడ్డారు. అధికారులు వస్తే సమస్యలు చెప్పుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నా పోలీసులు వినకుండా మహిళలు, నాయకులను ఈడ్చుకుంటూ డెంకాడ, గంట్యాడ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, నాయకులు ఎన్‌వై నాయుడు, ఎ. జగన్మోహన్‌రావు,సీహెచ్‌ జగన్, బి.సూర్యనారాయణ, పి. అప్పారావు, ఎం. రమణ, తదితర 69 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రభుత్వం తీరు సరికాదు
డెంకాడ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు అన్నారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న నాయకులు, నిర్వాహకులను పోలీసులు డెంకాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, టీవై నాయుడు, కార్యదర్శి ఎ.జగన్మోహన్, బి.సుధారాణి, మధ్యాహ్న భోజన పథకం సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు తులసి, వరలక్ష్మి, శాంతకుమారి తదితరులు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు, సంస్థలకు అప్పజెప్పరాదన్నారు.

వర్కర్లు, హెల్పర్లకు నెలకు ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ప్రతినెలా ఐదో తేదో లోగా బిల్లులు, వేతనాలు చెల్లించాలన్నారు. ఒక్కో విద్యార్థికి మెనూ చార్జీ పది రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యమాన్ని ఆపలేదన్నారు.  


 

మరిన్ని వార్తలు