హమ్మయ్య... ముగిసింది

12 Jan, 2019 13:52 IST|Sakshi
తామరఖండిలో ఇళ్ల బిల్లులకోసం నిలదీస్తున్న లబ్ధిదారులు

ఊపిరిపీల్చుకున్న అధికారులు

ముగిసిన జన్మభూమి మాఊరు కార్యక్రమం

అన్ని చోట్లా జనం లేక వెలవెలబోయిన గ్రామసభలు బహిష్కరణ... నిలదీతలు...అడ్డుకున్న జనం

కంగుతిన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు

విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముగిసింది. గడచిన ఐదు విడతల కంటే ఈ సారి కార్యక్రమం రసాభాసగానే సాగింది. జనవరి 2వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారంతో ముగిసింది. తక్కువ గ్రామపంచాయతీలు, వార్డులు ఉన్న పురపాలకసంఘాల్లో ఒకటి, రెండురోజులు ముందే గ్రామసభలు ముగియగా మిగతా చోట్ల శుక్రవారంతోపూర్తయ్యాయి. మొత్తం 920 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాల్టీల్లో 149 వార్డుల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది.

బహిష్కరణతో నిరసన
ఐదు విడతల్లో లేని విధంగా ఈ సారి జన్మభూమి గ్రామసభలను జనం బహిష్కరించారు. అధికారులు అన్ని సభలు జరిగాయని చెబుతున్నా కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో సభలను జనం బహిష్కరించారు. సభలు జరిపేందుకు అధికారుల బృందాలు గ్రామానికి రాకుండా ఆయా మండలాలతోపాటు మైదాన ప్రాంత మండలాల్లో కూడా అడ్డుకున్నారు. ఇలా 50వరకు సభల్లో జరగ్గా అధికారం అండ, పోలీసు బందోబస్తు మధ్య సభలు సాగించారు. అయినా జిల్లాలో సుమారు 10 గ్రామాల్లో సభలు అసలు జరగలేదు.

నిరసనలు... నిలదీతలు
నిరసన, నిలదీతలతో జిల్లాలో మరో 200కు పైగా సభలు అసంపూర్తిగా ముగించినట్లు సమాచారం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిపోయింది. అయినా అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. గత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన వినతులు పరిష్కరించలేదని, చేస్తామన్న పనులు కూడా చేయలేదని పలుచోట్ల ప్రజలు అధికారపార్టీ నాయకులు, అధికారులను నిలదీశారు. జిల్లాలో 10 రోజుల్లో మొత్తం సభలు చూస్తే జిల్లాలో ఉన్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుతోపాటు జెడ్పీ ఛైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఆరుగురు ఎమ్మెల్యేలను, ఇతర అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ఏదో సందర్భంలో ఏదో ఒక గ్రామసభలో నిలదీయడం చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వివక్ష చూపుతున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో అధికారపార్టీ వారికే పెన్షన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు, రుణాలు మంజూరు చేస్తున్నారని కడిగేశారు. ప్రభుత్వ పథకాల మంజూరులో రాజకీయాలేమిటని ప్రశ్నించారు. ఇతర సమస్యలు ఏమి పరిష్కరించారని మండిపడ్డారు. ఇక అధికారులకు ఎక్కడికక్కడ నిరసనలు, నిలదీతలు తప్పలేదు. దాదాపు 70శాతం సభల్లో అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించడం, నిలదీయడం, నిరసన వ్యక్తం చేయడం విశేషం.

జనం లేక వెలవెల
ఇక గ్రామసభలకు జనం హాజరు కూడా తక్కువగానే ఉంది. జన్మభూమి కార్యక్రమం విజయవంతమైందని అధికారులు చెబుతున్నా వాస్తవానికి పది, పదిహేనుశాతం మినహా మిగతా సభలకు చెప్పుకోదగ్గ జనం లేరు. అధికారపార్టీ కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు ఈ విషయాన్ని చెప్పుకోవడం విశేషం. తొలిరోజు నుంచి చివరి రోజు వరకు చూస్తే 10శాతం సభలకు జ నం కాస్తా వచ్చారు. 70శాతం సభలకు 30 నుంచి 80 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. మరో 10 శాతం గ్రామసభలు అధికారులు, అధికారపార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయనడంలో అతిశయోక్తి లేదు. 

నెరవేరని లక్ష్యం
జన్మభూమి కార్యక్రమం ద్వారా నాలుగున్నరేళ్లలో ఎంతో చేశామని ప్రచారం చేసుకుందామనుకున్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు, వాల్‌ పోస్టర్లు వృథా అయ్యాయి. జనం రాకపోవడం, వచ్చిన చోట వినే కంటే తిరిగి ప్రశ్నించడం, నిలదీయడంతో అధికారులు ఏమీ చెప్పలేకపోయారు. అధికారులు కూడా తమకెందుకు వచ్చిన గొడవ అంటూ నామమాత్రంగా కార్యక్రమం చేసి ముగించారు. నిలదీతలు, నిరసనలు, అడ్డుకోవడంతో వ్యతిరేకత మరింత పెరిగిందన్న వాదన వినిపిస్తోంది.సీతానగరం మండలం

మరిన్ని వార్తలు