నిరసనల మధ్య కిరణ్‌బేడీ యానాం పర్యటన

7 Feb, 2020 13:11 IST|Sakshi
యానాంలో ఎల్జీ కిరణ్‌బేడీకి స్వాగతం పలికిన అధికారులు, తదితరులు

సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ నినాదాలు

పేదవర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు: మంత్రి మల్లాడి ఆరోపణ

తూర్పుగోదావరి, యానాం: యానాం విచ్చేసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ పర్యటన గురువారం ప్రజల నిరసనల మధ్య ప్రారంభమైంది. స్ధానిక ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకున్న నియోజకవర్గ పరిధిలోని వందలాదిమంది ప్రజలు నల్లజెండాలు, బెలూన్లు, ధస్తులు ధరించి ఆమె పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారని, యానాం అభివృద్ధికి సంబంధించిన ఫైల్స్‌ను ఆమోదించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.  ఉచితబియ్యం పథకానికి సంబంధించి బియ్యం ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు నిలిపి వేశారని వారు ఆరోపించారు.

పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ వైఖరి
పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ కిరణ్‌బేడీ వ్యవహరిస్తున్నారని యానాం పర్యటన వల్ల ప్రజాసమస్యలు పరిష్కారం కాకపోగా, వేలాది రూపాయిల ప్రజాధనం ఆమె పర్యటకు, ఏర్పాట్లకు ఖర్చవుతున్నాయని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. గురువారం ఆయన çస్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహనిర్మాణాలు ఉన్నాయ ని చెబుతూ ఫ్రాన్స్‌తిప్ప, వెంకటరత్నం నగర్, అ య్యన్ననగర్, కురసాంపేట తదితర ప్రాంతాల్లోని భవనాలను తీసివేయాలని అన్యాయంగా ఎల్జీ ఆదేశాలు జారీ చేశారని వారికి విద్యుత్తు, తాగునీరు నిలుపుదల చేశారన్నారు. 2018లో యానాంకు ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరైతే నిర్మాణ పనులు చేపట్టకుండా నిలిపివేశారని, రూ.137కో ట్లతో చేపట్టే వరద నియంత్రణ çపనులను నిలిపివేశారని ఆరోపించారు. జీఎస్పీసీ కంపెనీ ఇచ్చిన రూ.19 కోట్లు వేట నష్టపరిహారంలో రూ.10 కోట్లు పంపిణీ చేసి మిగతా రూ.తొమ్మిది కోట్లు ఇవ్వకుండా నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఆమె అనుకూలంగా మీడియాలో ప్రచారానికి 12 మందిని పుదుచ్చేరి నుంచి రప్పించుకున్నారని, ఆమెకు ఆమెతో వచ్చిన వారికి  కాకినాడలో ఒక ఖరీదైన హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.52వేలు ఖర్చయ్యిందని ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు