జన్మభూమిలో..సమస్యల జాతర

12 Jan, 2019 12:43 IST|Sakshi
శుక్రవారం కంభంలో జరిగిన సభలో అర్జీలు ఇస్తున్న స్థానికులు

పింఛను.. గూడు.. రేషన్‌కార్డు!

గ్రామ సభల్లో వ్యక్తిగత సమస్యలపై అర్జీలే అధికం

32,233 అర్జీల్లో సరాసరి పరిష్కారం 23 శాతమే

వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటికే 4,049 తిరస్కరణ

అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలా ముగిసిన గ్రామసభలు

తర్లుపాడు మండలం మంగలిపాలెంలో సభ బహిష్కరణ

ఒంగోలు సిటీ:మళ్లీ మళ్లీ అవే సమస్యలు.. మొక్కుబడిగా పరిశీలిస్తున్న అర్జీలు.. ఆర్థికేతర సమస్యలైలే సరి.. లేదంటే అధికారులు ఆ అర్జీలను ముట్టుకోవడం లేదు. ఇదీ జిల్లాలో జరిగిన ఆరోవిడత జన్మభూమి–మాఊరు అర్జీల పరిష్కారం తీరు. మండల కార్యాలయాల్లో, మీకోసంలో, ఇప్పుడు జన్మభూమి గ్రామసభల్లో అవే సమస్యలపై అర్జీలు వచ్చాయి. ఏళ్ల తరబడి ఒకే  సమస్యపై తిరిగిన జనం ప్రభుత్వవిసిగి పోయారు. జన్మభూమి మాఊరు కార్యక్రమంలోనైనా సమస్య తీరుతుందని బావించి భంగపాటుకు గురయ్యారు. జనం దగ్గర అర్జీలను తీసుకోవడం.. వాటిని పక్కన పడేయడం.. ఇది జరిగిన తంతు. ఈనెల 2వ తేదీ నుంచి శుక్రవారం వరకు జిల్లాలో పది రోజుల పాటు జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో ప్రజలకు వనగూరిన ప్రయోజనం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 1028 పంచాయతీలు, 225 వార్డుల్లో ఆరో విడత జన్మభూమి మాఊరు కార్యక్రమం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం గ్రామసభలు పేలవంగా జరిగాయి. ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి అందుతుందని బావించిన బాధితులకు నిరాశ మిగిలింది. అర్జీలను తీసుకొని చూస్తాం.. చేస్తామని అర్జీదారుల్ని పంపించేశారు. అత్యధిక భాగం వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ సభలకు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు. జన్మభూమి–మాఊరు కార్యక్రమం తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల్లో ఐఏఎస్‌ అధికారి ఎం.రామారావు ఎస్‌ఎన్‌పాడు మండలంలోని చండ్రపాలెం గ్రామంలో పాల్గొన్నారు.

చుట్టూ ముసిరిన జనం సమస్యలు..
జన్మభూమి గ్రామసభల్లో జనం సమస్యలు చుట్టూ ముసిరాయి. అన్నీ వ్యక్తిగత సమస్యలే. అత్యధికంగా తమకు ఫించన్లు కావాలని అర్జీలు వచ్చాయి. ఇంటి నివేశన స్థలాలు కావాలని అంతే మోతాదులో అర్జీలు వచ్చాయి. ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మించామని ప్రభుత్వం చెబుతున్నా ఇల్లు కావాలని పెద్ద సంఖ్యలోనే అర్జీలను సమర్పించారు. తర్వాత స్థానంలో తెల్ల రేషన్‌కార్డులు కావాలని కోరారు. ఇక తర్వాత స్థానాల్లో భూమి వివాదాలు, తమ భూములకు కొలతలు వేయడం లేదని, రెవెన్యూ సమస్యలు,అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని, తహసీల్దార్లు అందుబాటులో ఉండం లేదని, వైద్య సేవలు మెరుగ్గా లేవని  రకరకాల సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి.వచ్చిన వాటిలో ఆర్థికపరమైన అంశాలే అధికంగా ఉన్నందున ఇప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుపడదని అధికారులు అర్జీదారులకు తేల్చిచెప్పారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలిస్తే సరే ఇక పదండి అంటూ తిరుగు జవాబు కూడా చెప్పే పరిస్థితి లేకపోవడం గమనార్హం.

23 శాతమే పరిష్కారం..
జిల్లాలో జన్మభూమి మాఊరు కార్యక్రమం చివరి రోజు శుక్రవారం సుమారు 1000 అర్జీలు వచ్చాయి. మిగిలిన రోజుల్లో జరిగిన గ్రామసభలకు 32,233 మంది అర్జీలను ఇచ్చారు. వీటిలో 98 శాతంగా వ్యక్తిగత సమస్యలపైనే జనం అర్జీలిచ్చారు. చేతికి తీసుకున్న అర్జీల్లో పింఛను కావాలని కోరితే నిర్థాక్షిణ్యంగా తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లు మంజూరు లేదు. మీరు పింఛన్‌కు అర్హులు కాదంటూ పక్కన పెట్టేశారు. వచ్చిన అర్జీల్లో 4049 అర్జీలను తిరస్కరించారు. ఇంకా 726 అర్జీలను పరిశీలించకుండానే.. అందులో అర్జీదారుడు ఏం కోరుతున్నాడో చూడకుండా పక్కన పెట్టేశారు. పరిశీలన పూర్తయినా 19661 అర్జీలకు ఎలాంటి మంజూరు ఉత్తర్వులు ఇవ్వలేదు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలే పై అధికారుల నుంచి ఆదేశాలు రాక వాటిని పక్కనపెట్టారు. 1,540 అర్జీలను పరిష్కరించినట్లుగా నమోదు చేశారు. ఈ అర్జీలకు సంబంధించిన ఎలాంటి మంజూరు ఉత్తర్వులు గానీ, ఎండార్సుమెంట్‌లు కాని అర్జీదారునికి ఇవ్వలేదు. మొత్తంగా జన్మభూమి మాఊరు గ్రామసభల్లో వచ్చిన అర్జీల్లో 22 శాతంగా పరిష్కరించినట్లుగా చెబుతున్నారు. అర్జీదారుల్లో ఒక్కరికైనా మంజూరు ఉత్తర్వులు గానీ, ఇతర ప్రొసిడింగ్స్‌ ఉత్తర్వుల ప్రతులను కాని ఇవ్వలేదు. గిద్దలూరు మున్సిపాలిటీ 14 శాతం, మార్కాపురం 22 శాతం, చీమకుర్తి 23 శాతం, ఒంగోలు అర్బన్‌ 6 శాతం, అద్దంకి 17 శాతం, చీరాల అర్బన్‌ 13 శాతం, కనిగిరి 16 శాతం ఈ రకంగా పరిష్కరించినట్లుగా నమోదు చేశారు. అర్జీదారులకు మాత్రం తమ అర్జీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం లేకపోవడం గమనార్హం.

ఎన్నికల ప్రచారంలా ముగిసిన గ్రామసభలు
అధికార పార్టీ ఎన్నికల ప్రచార సభల్లా గ్రామసభలు ముగిశాయన్న విమర్శలు నెలకున్నాయి. రాష్ట్ర స్థాయిలో నియమించిన అధికారులు గ్రామసభలకు జనం వస్తున్న తీరు, వారి నుంచి స్పందనలు, పార్టీ నాయకుల్లో సఖ్యత, గ్రామసభలో వస్తున్న ఫిర్యాదులు వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. గ్రామసభలకు వచ్చిన అధికారులు పాలకుల బలాబలాలను బేరీజు వేసి వివరాలను పైవారికి చెప్పాల్సి ఉంది. ఆ కోణం నుంచే గ్రామసభల నిర్వహణ పరిశీలన జరిగిట్లుగా సమాచారం. అధికారిక నివేదిక ప్రకారం గ్రామసభలకు 1,03,622 మంది హాజరయ్యారు. విద్యార్థులు 3,97,985 మంది, ఫ్యాకల్టీ 34,266 మంది, ఉపాధ్యాయులు 48,990 మంది, గ్రామస్తులు 18 లక్షల మంది హాజరైట్లుగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని పలు చోట్ల గ్రామసభలు పేలవంగా జరిగాయి. ఒంగోలులోనూ అలాగే జరిగాయి. ఎండ్లూరులో తెలుగుదేశం శ్రేణుల్లోనే సమస్యలు వచ్చాయి. పార్టీ పెద్దలు పంచాయితీ చేయాల్సి వచ్చింది. తర్లుపాడు మండలం మంగలిపాలెంలో భూమి సమస్యను అధికారులు పరిష్కరించనందుకు ఆ గ్రామ సభను జనం బహిష్కరించారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినా స్థానికంగా నాయకులు సర్థుబాటు  చేశారు.రానున్నది ఎన్నికల కాలం ఇçప్పుడు విభేదాలు వద్దని నచ్చచెప్పారు. గ్రామసభలు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. కొన్ని చోట్ల జనం లేకుండా అధికారులు, యంత్రాంగంతోనే సభలు ముగిశాయి.

అడుగడుగునా నిర్బంధాలు.. నిలదీతలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :  జన్మభూమి–మావూరు కార్యక్రమంలో అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులకు ్రçపజల నుండి నిలదీతలు, నిర్బంధాలు తప్పలేదు. పలుచోట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, అధికారులను జనం తీవ్ర స్థాయిలో నిలదీశారు. కొన్ని చోట్ల నిర్బంధించారు. మరి కొన్ని చోట్ల సభలను బహిష్కరించారు. మొత్తంగా జన్మభూమి కార్యక్రమం  రసాభాసగా సాగింది. తొలిరోజు యర్రగొండపాలెం ఆమని గుడిపాలెంలో జరిగిన జన్మభూమి–మావూరులో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి జన్మభూమి అధికారులను పంచాయతీ కార్యాలయంలో రెండుగంటల పాటు నిర్బంధించారు.  గ్రామంలో చేపట్టిన 500 ఇంకుడు గుంటలు, 200 మరుగుదొడ్లకు ప్రభుత్వం బిల్లులు ఇచ్చేంత వరకు జన్మభూమిని జరగనివ్వమంటూ గొడవకు దిగారు. అధికారులను పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.  త్రిపురాంతంకం మండలం అన్న సముద్రంలో జరిగిన జన్మభూమిలో తాను పక్కా గృహం ఇస్తామని చెప్పడంతో  ఉన్న గుడిసెను పీకేసుకుని 8 నెలలుగా రోడ్డున పడ్డానని, అయినా పక్కాగృహం మంజూరు కాలేదని వెంకటమ్మ అనే మహిళ ఎమ్మెల్యే డేవిడ్‌ రాజును నిలదీసింది.

గ్రామానికి స్మశాన స్థలం కేటాయిస్తామని ఏళ్ళ తరబడి చెబుతున్నా ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎమ్మెల్యేను, అధికారులను నిలదీశాడు. జిల్లాలోని అద్దంకి, గిద్దలూరు, పర్చూరు, చీరాల, కందుకూరు, కనిగిరి, కొండపి, సంతనూతలపాడు, ఒంగోలు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. చివరకు తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని జనం ధ్వజమెత్తారు. రెవెన్యూ సమస్యలపైనా జనం అధికారులను నిలదీశారు. సమస్యలు పరిష్కరించలేని జన్మభూములు ఎందుకంటూ పలు చోట్ల సభలను బహిష్కరించారు. ఈ జన్మభూమిలో సమస్యలు పరిష్కరిస్తారని ఇబ్బడి ముబ్బడిగా రేషన్‌ కార్డులు, పించన్లు ఇస్తారని అందరూ ఆశించినా ప్రభుత్వం మాత్రం జన వినతులను పరిష్కరించక ఈ జన్మభూమిని కూడా ప్రచారానికే వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  6వ విడత జన్మభూమిలో వచ్చిన అన్ని వినతులను పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి సభల్లో చెప్పినా క్షేత్ర స్థాయిలో అది జరగలేదు. గత 5 విడతల జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన వినతులు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఇక కొత్త వినతులకు ఎప్పటికీ మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి. ఏమి చేయకుండానే ఎంతో చేశామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకునేందుకే జన్మభూమిని ఉపయోగించుకున్నట్లు కనపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు