గొంతులెండుతున్నాయ్‌.. దప్పిక తీర్చండి

30 Jan, 2019 13:17 IST|Sakshi
కమిషనర్‌తో దేవాంగనగర్‌ వాసుల వాగ్వాదం

తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

కనిగిరి దేవాంగనగర్‌లో ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

నిరసనకారులకు మద్దతు తెలిపిన బుర్రా మధు

కమిషనర్‌ హామీతో సద్దుమణిగిన ఆందోళన

కనిగిరి:  మీరు ప్రజా సేవకులు.. పార్టీల కతీతంగా సమస్యలు పరిష్కరించండి.. రెండు వారాలుగా నీళ్లు కోసం ప్రజలు అల్లాడుతున్నారు.. సమస్య మీకు పట్టాదా.. ఎమ్మెల్యేకు తొత్తుగా పనిచేస్తే.. ప్రజలు ఇలానే రోడ్లక్కుతారంటూ వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అధికారులపై ధ్వజమెత్తారు. నీటి సమస్య పరిష్కరించాలంటూ కనిగిరి పట్టణంలోని దేవాంగనగర్‌వాసులు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డుపై ధర్నా చేశారు. విషయం తెలుసుకుని అక్కడి వచ్చిన కమిషనర్‌ కేవీ పద్మావతిని ప్రజలు నిలదీశారు. మేము కూలీ నాలి చేసుకుని జీవించే వాళ్లం కనీసం తాగటానికి, వాడుక నీరు ఇవ్వడం లేదు.. రెండు వారాలుగా మున్సిపల్‌ నీళ్ల ట్యాంకర్లు మా వార్డుకు రావడం లేదు.. ఆఫీసుకు వచ్చి చెప్తే సమస్య పట్టించుకోరు.. ఇప్పుడు ఎందుకొచ్చారంటూ కమిషనర్‌ను ప్రశ్నించారు. చైర్మన్‌ ఒక్క సారికూడా మా గ్రామానికి రాలేదు.. మేం మనుషులం కాదా అంటూ మండిపడ్డారు. చైర్మన్, ఎమ్మెల్యే ఇద్దరు వచ్చి మా సమస్య పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదలమంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కమిషనర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై డి.ప్రసాద్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చారు.

ప్రజల కోసం పనిచేయండి..
ఇంతలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్, పార్టీ శ్రేణులు ధర్నా ప్రదేశానికి చేరుకున్నారు. ప్రజలు నీటి సమస్యను బుర్రాకు వివరించారు. దీంతో ఆగ్రహించినా బుర్రా.. కమిషనర్‌ గారు.. మీరు ఏడాదికి కోటి రూపాయలు ట్యాంకర్ల ద్వార నీటి రవాణాకు ఖర్చు పెడుతున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు.. మరీ ప్రజలకు నీళ్లేవీ.. మీరు.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అందరు కలిసి నిధులు మింగుతున్నారా..? అధికార పార్టీ నాయకుల ఇళ్లకు రోజు ట్యాంకర్లు.. అధికారపార్టీ వార్డులకు రోజు నీళ్లు.. మరీ పేదల పరిస్థితి ఏంటీ.. వాళ్లు ప్రజలు కాదా..? అని నిలదీశారు. దీనికి కమిషనర్‌ బదులిస్తూ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల తప్పు జరిగిందని.. రోజు ట్యాంకర్ల నీళ్లు సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమకు ట్యాంకర్ల ద్వారా కాకుండా కొళాయిల ద్వారా నీళ్లు ఇవ్వాలని స్థానికులు పట్టుబట్టారు. కాలనీ వాసులంతా చైర్మన్‌కు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. దీంతో కమిషనర్‌ కాలనీలో డీప్‌బోర్‌ వెల్‌ వేసి కుళాయిల ద్వారా నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు స్థల పరిశీలన చేశారు. దీంతో సమస్య తాత్కలికంగా సద్దు మణిగింది. ధర్నా కారణంగా అరగంట సేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

వివక్షత చూపితే ఆందోళన ఉధృతం చేస్తాం: బుర్రా
మున్సిపల్‌ ట్యాంక్‌ల ద్వారా నీటి రవాణాలో అధికారులు వివక్షత చూపితే సహించేది లేదని బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ హెచ్చరించారు. ధర్నా అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలు నీటి సమస్యపై అల్లాడుతుంటే అధికార పార్టీ నాయకులు అభివృద్ధి ఢంకా కొట్టుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో నీటి రవాణా మాటున కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తూ.. ప్రజా సమస్యలను గాలికి వదులుతున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ అధికారులు ఏక పక్షంగా వ్యహరించి.. ఎమ్మెల్యేకు, చైర్మన్‌కు తాబేదారులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దేవాంగనగర్‌లో నీటి సమస్య త్వరగా పరిష్కరించక పోతే.. మున్సిపల్‌ ఆఫీసు వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, న్యాయవాదులు ఎస్‌కే అబ్దుల్‌గఫార్, సీహెచ్‌ సాల్మన్‌రాజు, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కస్తూరిరెడ్డి, మండల అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు