మంత్రి గంటాకు చేదు అనుభవం..!

6 Jan, 2019 19:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : జన్మభూమి అంటూ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న టీడీపీ నేతలకు నిరసనలు తప్పడం లేదు. సీఎం నుంచి మంత్రులు దాకా, మంత్రులు నుంచి ఎమ్మెల్యేలు వరకూ ప్రజాగ్రహజ్వాలకు గురవుతున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా పొగరి సీఎం చంద్రబాబు సభలో మహిళలు వ్యతిరేక నినాదాలతో మార్మోగించగా.. ఇప్పుడు  విశాఖలో మంత్రి గంటాకు చేదు అనుభవం ఎదురైంది. మధురవాడ సాయిరాం కాలనీలోని జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆయనకు స్థానిక సమస్యలపై నిరసన జ్వాల ఎగసిపడింది. స్థానిక సమస్యలపై ప్రశ్నలవర్షం కురవడంతో అక్కడినుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ మంత్రి గంటాను స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంచేశారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరు జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారులు - కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 15వ వార్డులో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదంటూ అధికారులను నిలదీశారు. కాలనీలో నీరు, రోడ్లు, డ్రైనేజీ లేక అల్లాడుతుంటే పరిష్కారం చూపని జన్మభూమి తమకొద్దూ అంటూ, ఇక్కడినుంచి వెళ్లిపోండని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కాలనీవాసులు - అధికారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులో జరిగిన జన్మభూమి కార్యాక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తిత్లీ  తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామస్తులు అధికారుల్ని, అధికార పార్టీ నేతల్ని నిలదీశారు. దీంతో అధికార పార్టీ నేతలు నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై దాడికి ప్రయత్నించారు. ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. తుపాను కారణంగా తీవ్రం నష్టపోయి రోడ్డున పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని పైగా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు