నిన్నెందుకు ఆశీర్వదించాలి?

20 Mar, 2019 08:08 IST|Sakshi

ఐదేళ్ల క్రితం చెప్పినవన్నీ నమ్మాం..

అనుభవం మేలు చేస్తుందనుకున్నాం.. కానీ ముంచేశారు

మేలైన పాలన ఇస్తారనుకున్నాం.. రంగుల కల చూపిస్తే మురిసిపోయాం

ఓటేసిన పాపం ఐదేళ్లుగా శాపమే

అవినీతి, అరాచక పాలనతో ఎన్నో అగచాట్లు

బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంతో సమాజంలో చిచ్చుపెట్టిన వైనం

హోదా తాకట్టు....ఉద్యోగమిస్తే ఒట్టు

40ఏళ్ల అనుభవం.. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌తో సరి

ప్రభుత్వమంటే.. ప్రచారమే అన్నట్టుగా ఐదేళ్ల పాలన

ఇవన్నీ చూసి.. మిమ్మల్ని ఎలా నమ్మేది..

ఎందుకు మళ్లీ ఆశీర్వదించాలి?!

రాష్ట్రంలో సామాన్య ప్రజల మనోగతమిదే!!

నవ్యాంధ్ర  నిర్మిస్తా... నాతో కలిసి రండి..అంటే.. నిజమేనని నమ్మాం..కొత్త రాష్ట్రం– కోటి సమస్యలు.. 40ఏళ్ల అనుభవం ఉంది..ఆంధ్రావనిని స్వర్ణాంధ్రగా మారుస్తానంటే..సరేలే అనుభవముంది కదా అనుకున్నాం..రుణమాఫీ చేస్తా... నాలుగేళ్లలో ఢిల్లీని మించిన అద్భుతరాజధాని నిర్మాస్తా.. అంటే నిజమే కాబోలని ఆశపడ్డాం..ప్రత్యేక హోదా తెస్తా...పోలవరంతో పంట పొలాలకునీళ్లు పారిస్తానని నమ్మబలికితే సంబరపడ్డాం..వేరేవాళ్లు తవ్విన కాలువలో.. పట్టిసీమ పేరిట నీళ్లుఎత్తిపోస్తూ నదుల అనుసంధానం అంటుంటే..నీటి కరువు తీరిపోతుందిలే అని ఆనందించాం..ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తిరుగుతుంటే..
లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తారనుకున్నాం.  యువతకు ఉద్యోగాలు.. డ్వాక్రా మహిళలకురుణాల మాఫీ.. మహిళా సాధికారత..బీసీలకు పెద్దపీట వేస్తా.. స్వచ్ఛమైన అవినీతి రహితపాలన అందిస్తానంటుంటే.. ఎంతో సంతోషించాం..నాడు చంద్రబాబు మాటలు విని మురిసిపోయాం...ఆయనకు ఐదేళ్లు అధికారం ఇచ్చాం..మరి చంద్రబాబు ఈ ఐదేళ్ల పాలనలో ఏం చేశారు..ఆయన 40ఏళ్ల అనుభవం అక్కరకొచ్చిందా..?
రైతులకు రుణమాఫీ అమలు చేశారా..అన్నదాతలు సంతోషంగా ఉన్నారా...  ఢిల్లీని మించిన రాజధాని నిర్మించారా..

పోలవరం పూర్తిచేసి... పంట పొలాలకు నీళ్లిచ్చారా..  నాలుగేళ్లు బీజేపీతో అధికారం పంచుకొనిరాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా?ఆశ్రిత పక్షపతానికి పాల్పడనని ప్రమాణం చేసి..చంద్రబాబు గత ఐదేళ్లుగా చేస్తున్నదేమిటి..?  ఇప్పుడు 2019 ఎన్నికలు రాగానే.. మళ్లీ ప్రజలు గుర్తొచ్చారు..  ‘మళ్లీ నన్ను ఆశ్వీరదించండి’ అంటూ ముందుకొస్తున్నారు..  అసలు.. మిమ్మల్నెందుకు ఆశీర్వదించాలి చంద్రబాబు...  మీ ఐదేళ్ల పాలనలో ఆశీర్వదించేంతమంచి పని ఒక్కటైనా చేశారా బాబూ..  గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి..అని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రజలు.

సాక్షి, అమరావతి : ఓటు ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకున్న సగటు మనిషి.. ఒక్కసారి గత ఐదేళ్ల పొలిటికల్‌ డైరీని తిరగేస్తున్నాడు. ‘కొత్త రాష్ట్రం.. నన్ను ఆశ్వీరదించండి’’ అంటూ.. చంద్రబాబు పలికిన మాటలు మొదటి పేజీలోనే కనిపిస్తున్నాయి. ఐదేళ్ల తర్వాతా మళ్లీ ఆయన నోటి వెంట అవే మాటలు విని జనం విస్తుబోతున్నారు. మళ్లీ ఆశీర్వదించమంటున్న చంద్రబాబు వేడుకోలు విని.. ఓటరు ఐదేళ్ల డైరీలో ఒక్కో పేజీ తిరగేస్తే.. ఎన్నో వంచనలు.. మరెన్నో మోసాలు... ఇంకెన్నో అక్రమాలు సాక్షాత్కరిస్తున్నాయి.  

అనుభవం ఉందనుకున్నాం
కొత్త రాష్ట్రం. కోటి సమస్యలు. విభజన గాయాలు.. రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించాలి. ఇలాంటి పరిస్థితుల్లో తనలాంటి అనుభవజ్ఞుడైతేనే మేలన్నారు చంద్రబాబు. సీమాంధ్రను అభివృద్ధి చేస్తా. స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతా. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం..రాష్ట్రానికి వెలుగులిస్తుందని చెప్పారు. నిజమేనని నమ్మాం. అధికారం ఇచ్చాం. ఐదేళ్లుగా నమ్ముతూనే ఉన్నాం. ఆయన అనుభవం.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిందా..? 40 ఏళ్ల అనుభవం రాష్ట్ర అభివృద్ధికి ఇసుమంతైనా ఉపయోగపడిందా?  విఫల హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, రోజుకో యూటర్న్‌ తీసుకోవడానికి పనికొచ్చిందా?

విజన్‌ ఉందనుకున్నాం
విజన్‌ ఉంది.. నిజం చేస్తానన్నారు. విజన్‌తో వెళ్దామన్నారు. అలా ముందుకు తీసుకెళ్తానన్నారు. ఐదేళ్ల క్రితం చూపించిన ఆ కల ఇప్పటికీ అరచేతి వైకుంఠమే. చంద్రబాబు అనుభవం రంగరించి పెట్టుబడులు తెస్తారని.. కంపెనీలు వస్తాయని..  చదువుకున్న యువతకు ఉద్యోగాలొస్తాయనే ఆశ.  ఆ సదస్సులు, ఈ సదస్సులు,  పెట్టుబడి భాగస్వామ్య సదస్సులు.. అంటూ విదేశాలకు ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశించాం. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ పర్యటనలకు 100 కోట్లు ఖర్చు చేసి.. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు.. ఎన్ని కొత్త కంపెనీలు వచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి?. పెట్టుబడులన్నీ ప్రకటనల్లోనే... కంపెనీలన్నీ కాగితాల్లోనే..! ఇక ఉద్యోగాల ఊసేలేదన్నది వాస్తవం కాదా?! బాబు వస్తేనే జాబు అని చెప్పారు. బాబు వచ్చాక జాబు రాలేదు కాని.. ఉన్న ఉద్యోగాలెన్నో ఊడగొట్టింది నిజం కాదా?!

నిజమవుతుందని నమ్మాం
హైదరాబాద్‌ను... సైబరాబాద్‌ను... హైటెక్‌ సిటీని తానే నిర్మించానని.. తనకు అధికారం ఇస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు  ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని నమ్మకంగా చెబితే.. నాడు నమ్మక తప్పలేదు. వాస్తవంగా గత ఐదేళ్లుగా రాజధాని పేరిట ఏం జరుగుతుందో చూస్తే.. పొగిలి పొగిలి ఏడ్వాల్సిన పరిస్థితి. నాలుగేళ్లలో ప్రపంచాన్నే తలదన్నేలా రాజధాని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో ఒక్క శాశ్వత ఇటుకైనా వేసారా అంటే.. సమాధానంలేదు.  అంతేకాదు రాజధాని కోసం రైతుల పచ్చటి పంట భూములు లాక్కోవడం.. తన వాళ్లకు కట్టబెట్టడం.. అదిగో రాజదాని.. ఇదిగో సింగపూర్‌.. అంటూ.. బాహుబలి గ్రాఫిక్స్‌తో మాయ చేయడానికే చంద్రబాబు అనుభవం అక్కరకొచ్చిందా అనే సందేహం సహజం. మరోవైపు ఇప్పటివరకు రాజధాని శంకుస్థాపనలకు చేసిన ఖర్చు ఎంతో తెలుసా.. రూ.489 కోట్లు దాటింది.

అసంపూర్తిగా  మిగిలిన పోలవరం ప్రాజెక్టు
పోలవరం కలల్లో మునిగాం
ఐదేళ్ల నాడు ఓటుకోసమొచ్చిన చంద్రబాబు పోలవరంపై రంగుల కల చూపించారు. చివరి బీడు భూములకూ నీళ్లిచ్చేదాకా నిద్రే పోనన్నారు. అక్కడే కుర్చీవేసుకొని కూర్చుంటానన్నారు. పోలవరం పూర్తయ్యే వరకూ అక్కడ తిష్టేస్తానన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణాంధ్రగా మారుస్తానని ఇల్లిల్లూ తిరిగి చెప్పారు. తియ్యగా చెప్పిన ఆ మాటనూ నమ్మక తప్పలేదు. పోలవరం కట్టించి.. బీడు భూములకు సాగునీరు పారిస్తారేమోనని ఆశించాం. కాని ఐదేళ్ల తర్వాత చూస్తే గానీ తెలియలేదు. చంద్రబాబు ఓట్ల రాజకీయంలో పోలవరం ఓ పావు అని.. నమ్మినందుకు మోసపోవాల్సి వచ్చిందని! పోలవరం సాక్షిగా కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ ప్రభుత్వ పెద్దల బాగోతం వెలుగులోకొచ్చింది. కేంద్రానికి సాగిల పడి.. ఈ ప్రాజెక్టు తెచ్చుకోవడం వెనుక చంద్రబాబు దోపిడీ పర్వమేంటో జనసామాన్యంలో చర్చ జరిగింది.

హోదా వస్తుందనే ఆశ
బీజేపీ మతతత్వ పార్టీ అన్న చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో అదే బీజేపీతో జోడీ కట్టారు. ఇదేంటా అనుకుంటే.. దానికీ ఓ రీజన్‌ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే గీటురాయి అన్నారు. కేంద్రంలో తన వాళ్లను మంత్రులను చేసిందీ.. తన మంత్రివర్గంలో బీజేపీకి స్థానం ఇచ్చిందీ రాష్ట్రం కోసమేనన్నారు. అనుభవం ఉంది కదా... అవుననే నమ్మాం. రోజుకో రీతిగా రాజకీయ రంగు మార్చినా.. రాష్ట్రం కోసమే కదా అనుకున్నాం. బీజేపీతో కాపురం చేసిన్నంత కాలం ప్యాకేజీకి మించింది లేదు అన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు అంటుంటే.. రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు సరికొత్త వ్యూహం అనుకున్నాం. కొద్ది రోజుల తర్వాత బీజేపీతో చెడగానే.. మళ్లీ ప్రత్యేక హోదా కోసం దీక్షలు..  నవ నిర్మాణ దీక్షలు... ధర్మపోరాటాలంటూ కొత్త పల్లవి అందుకోవడం వింత రాజకీయం కాక మరేమిటి? రోజుకో కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుంటుంటే... రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా అనుకున్నాం.. కాని మీ పొత్తులు జిత్తులన్నీ స్వప్రయోజనం కోసం కాదని చెప్పగలరా?    

కుటుంబ వికాసం.. సమాజ వికాసం
కుటుంబ వికాసం.. సమాజం వికాసం అంటుంటే.. రాష్ట్రంలోని కుటుంబాలన్నీ బాగుపడతాయని.. మొత్తం సమాజం వికసిస్తుందని సంతోషపడ్డాం.. కాని బాగుపడ్డది మీ ఒక్క కుటుంబమేనని చాలా ఆలస్యంగా అర్థమైంది. మీరన్నది మొత్తం సమాజం వికాసం గురించి కాదని.. మీ కులం, మీ వర్గం వికాసం కోసం మీరు పాటుపడుతున్నారని... సీఎస్, డీజీపీ నుంచి పోలీస్‌ కానిస్టేబుల్‌ వరకూ.. అన్ని పోస్టుల్లో, అన్ని పదవుల్లో, చివరకు అన్ని పదోన్నతుల్లోనూ  మీ వాళ్లనే  నియమించుకుంటున్నారని తెలిసి అవాక్కయ్యాం.  

ఒకటా? రెండా? ఏం చెప్పినా విన్నాం
ఇలా ఒకటా, రెండా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయ్‌.. ముఖ్యంగా రైతన్న రుణాలన్నీ మాఫీ అంటే నమ్మాం. బ్యాంకుల్లో తాళి పుస్తెలొస్తాయంటే ఆశపడ్డాం. లక్షల ఉద్యోగాలు తెస్తానంటే యువత ఆరాటపడింది. అప్పులన్నీ తీరుస్తానంటే.. ఆ మాటలను నమ్మి డ్వాక్రా అక్కచెల్లెమ్మలూ సంబరపడ్డారు. సకల సౌకర్యాలు ఇస్తామంటే.. ఉద్యోగులు నిజమనుకున్నారు. కులానికో పేజీ పెట్టి అందమైన హామీలిస్తే అన్ని వర్గాలు నిజమనుకున్నాయి. ఏదో ఒక మేలు జరుగుతుందని ఐదేళ్లు ఆశలు ఇంకిపోయే దాకా ఎదురుచూశాం. బిక్కుబిక్కుమనే బక్క జీవులూ.. శ్రామిక, కార్మిక వర్గాలూ.. అది చేస్తా.. ఇది చేస్తా అంటుంటే.. అనుభవం ఉంది కదా ఏదో ఒకటిచేస్తారని ఆశపడ్డాం.  

 ఒరిగిందేమిటి.. జరిగిందేంటి..?!
కాని ఏం చేయలేదని తెలిసి ఇప్పుడు బాధపడుతున్నాం. సామాన్య ప్రజల ఆశలన్నీ అడియాసలయ్యాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అడుగడుగునా నయవంచనే! మోసకారి మాట లేని రోజంటూ లేదు. ఐదేళ్లూ ఎక్కడ చూసినా.. అడుగడుగునా అవినీతి రాజ్యమేలింది. జన్మభూమి కమిటీల దోపిడీ.. పల్లెబతుక్కి పాడె కట్టింది. ఏ సంక్షేమ పథకమైనా జన్మభూమి కమిటీ మాఫియా కబంద హస్తం దాటి జన సామాన్యంలోకి వెళ్లిన దాఖలాలు లేవు. ఏది కావాలన్నా లంచం. ఏం చెయ్యాలన్నా పచ్చ నేతలకు ఎంతోకొంత ముట్టచెప్పాల్సిందే! స్వచ్ఛమైన పాలన అందిస్తానన్న 40 ఏళ్ల అనుభవజ్ఞుడి ఐదేళ్ల యేలుబడిలో.. ఎక్కడ చూసినా... అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం కన్పించింది. ఇసుక దోచుకున్నారు. గనులు తవ్వుకున్నారు. మట్టిని అమ్ముకున్నారు. పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పిచేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏం గుండెను కదిపినా విన్పించేది ఇదే ఆవేదన.  

పాలనంటే... ప్రచారమేనా
చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తే.. చివరకు ఆయన పాలనంటే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, పాలనంటే ప్రచారం తప్ప మరేమీ కాదు అనే స్థాయికి దిగజార్చారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు, రాజధాని శంకుస్థాపనలు, పోలవరం, పట్టిసీమ ప్రారంభోత్సవాలు, విదేశీ పర్యటనలు, కరువుపై యుద్ధం, దోమలపై దండయాత్ర, ప్రాజెక్టుల నిద్ర, నవ నిర్మాణ దీక్ష, పెట్టుబడి భాగస్వామ్య సదస్సులు అంటూ.. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రభుత్వ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ.. పాలనంటే.. ప్రచారమే అన్నట్లుగా మార్చేసారు. ప్రచారం కోసం ఏడుసార్లు రాజధాని శంకుస్థాపనలు చేశారు. పదులసార్లు విదేశీ పర్యటనలు చేసి.. రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వచ్చేస్తున్నాయి..అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటూ అనుకూల మీడియాలో ఊదరగొట్టారు. గోదావరి, కృష్ణా పుష్కరాల కోసం రూ.3వేల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రముఖ దర్శకుల్ని పిలిచి భారీ సెట్టింగులు వేయించారు. టీవీ చానెళ్లల్లో ప్రచారం కోసం పాకులాడి..29 నిండు ప్రాణాలను బలిపెట్టారు. అంతేకాకుండా పుష్కర పనులను తన బినామీలకు, అస్మదీయులకు నామినేషన్‌ పద్ధతిలో కట్టుబెట్టి వందల కోట్ల అవినీతికి తెరదీశారు. పోలవరం పర్యటనలు, అమరావతి పర్యటనల పేరిట.. ప్రచారం కోసం వేల కోట్ల ప్రజాధనం దుబారా చేశారు. రెయిన్‌ గన్స్‌ కోసం రూ.117కోట్లు ఖర్చు చేసి... ఒక్క ఎకరంలో కూడా వేరుశనగ పంటను కాపాడలేకపోయారు. కాని 15లక్షల ఎకరాల్లో పంటను కాపాడినట్లు ప్రచారం చేసుకున్నారు.  

 పచ్చ అరాచకాలకు హద్దేలేదు
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అధికార టీడీపీ నాయకుల అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. టీడీపీ జెండా పట్టుకోకుంటే నిరుపేద ఇల్లయినా నిర్థాక్షిణ్యంగా గుంజేసుకున్నారు. నడివీధిలో బిచ్చమెత్తుకునే పరిస్థితి తెచ్చారు. అధికార పార్టీని అభిమానించరు, అనుసరించరు అనుకుంటే చాలు... పింఛన్లు ఆపేశారు.  
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రైతన్న బిక్కచచ్చిపోయాడు. రుణమాఫీ శాపమైంది. మాఫీ మాట దేవుడెరుగు... బ్యాంకులో అప్పే ఇవ్వమంటున్నారు.  
రక్షణలేని మహిళలు ఆక్రందన నవ్యాంధ్రలో అడుగడుగున విన్పిస్తోంది. అధికార పార్టీ నేతలే కాలసర్పాలై వెంటాడిన కాల్‌మనీ... ఇసుకను అడ్డుకన్న అధికారులకు వేధింపులు... మాట వినని ఉద్యోగులకు బెదిరింపులు, అరాచకం రాజ్యమేలిన రాక్షశ క్రీడ ఐదేళ్లుగా ప్రతీ ఒక్కరూ చూస్తున్నదే.
ఉరితాళ్లకు వేలాడుతున్న ఆగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోలేదు. ఆ సంస్థల ఆస్తులను ప్రభుత్వ పెద్దలే మింగేసిన దారుణాలు చూశాం. గుడికి, గుడి భూములకు... పేదల ఆస్తులకు దిక్కులేని దైన్య స్థితి... ఇదీ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కన్పించిన దృశ్యాలు.
హోదా ఒట్టి బూటకమైంది. మాట తప్పి ప్యాకేజీ తెచ్చుకున్న చంద్రబాబు యువతకు నిలువునా వెన్నుపోటు పొడిచారు. అన్యాయం అన్న యువతరంపై ఉక్కుపాదం మోపారు. ఉద్యమాలను అణిచివేశారు. లాఠీలతో కుళ్లబొడిచారు. జైళ్లల్లో పెట్టారు.  
ఈ ఐదేళ్లల్లో సంక్షేమం ఓ అందని ద్రాక్ష అయింది. పేదవాడికి వైద్యం కరవైంది. అనారోగ్యం ప్రాణాలు హరిస్తున్నా.. ఆలకించే ప్రభుత్వమే లేకుండా పోయింది.

మళ్లీ ఆశీర్వదించాలా?!
ఐదేళ్ల క్రితం చంద్రబాబు హామీలను నమ్మిన ప్రజలు... ఈ ఐదేళ్ల పాలన చూసి విసిగి వేసారిపోయారు. అవినీతి, అరాచకం. బంధుప్రీతి, తన కుటుంబం, తన వర్గం, తన కుల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య అవహేళన... ఇలా ఒక్కొక్కటీ సామాన్య ప్రజల ఆవేశాన్ని కట్టలు తెంచేలా చేస్తోంది. ఇంతగా మోసం చేసిన చంద్రబాబును ఇంకా నమ్మాలా? మళ్లీ  ఆశీర్వదించాలా?! నో ఛాన్స్‌.. అంటున్నారు యువత, నిరుద్యోగులు, మహిళలు, పేద ప్రజలు. ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కటైనా మంచి పని  చేయని చంద్రబాబును ఎందుకు ఆశీర్వదించాలనేది సగలు ఓటరు అభిమతం.

మరిన్ని వార్తలు