మనసున్న మారాజులు

16 May, 2019 12:17 IST|Sakshi
నిత్యవసర సరుకులు, టీవీ, నగదును అందజేస్తున్న మునిరత్నం శ్రీనివాసులు సోదరులు

రామక్క కుటుంబాన్ని ఆదుకుంటున్న దాతలు

కుటుంబ పరిస్థితిపై విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు

స్పందిస్తున్న హృదయాలకు ‘సాక్షి’ సలామ్‌

గుమ్మఘట్ట: రామక్క వేదనాభరిత జీవనం చూసి చలించిన దాతలు ఆదుకునేందుకు ఆమె స్వగ్రామం కలుగోడుకు క్యూ కడుతున్నారు. మేమున్నామంటూ ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. బుధవారం అనంతపురం మునిరత్నం ట్రావెల్స్‌ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌ నేత ఉమాపతి, సోమశేఖర్‌రెడ్డి, వీరయ్య, వీరాస్వామిలతో పాటు వాణి ట్రావెల్స్‌ శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, మహాలక్ష్మి టెక్స్‌టైల్స్, కేసరి ఎలక్ట్రికల్స్‌కు చెందిన వారంతా కలుగోడుకు చేరుకుని రామక్క కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.20 వేల నగదుతో పాటు ఓ టీవీ, రూ. 30 వేలు విలువ చేసే కిరాణ సరుకులు, దుస్తులు, రెండు క్వింటాళ్ల బియ్యం, చీరలు, ప్లాస్టిక్‌ సామాన్లు, పిల్లలకు ఉపయోగపడే బ్యాగులు, పెన్నులు, షూ అందించారు.

‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని చూసి చలించి పోయామని.. అవసరమైన ప్రతి సారీ తమకు ఫోన్‌ చేస్తే సహాయం చేసేందుకు ముందుంటామని భరోసా కల్పించారు. నగదును మునిరత్నం ట్రావెల్స్‌ శ్రీనివాసులు మిత్రుడైన ఓ తహసీల్దార్‌ అందించారు. మారుమూల గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న ఈ పేద కుటుంబాన్ని వెలుగులోకి తెచ్చి.. వారికి అండగా నిలిచిన ‘సాక్షి’ యాజమాన్యం, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రామక్కకు అందుతున్న సహాయాన్ని చూసి గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.హిమశైల, రాయదుర్గం మార్కెట్‌యార్డ్‌ అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున, కార్యాలయ సిబ్బంది గంగాదేవి, కె.రామ్‌ప్రసాద్‌రావ్, రాయదుర్గం సెక్రెటరీ ఎం.ఆనంద్, రాయదుర్గం కార్యాలయ సిబ్బంది కలుగోడుకు చేరుకుని రామక్క కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూ. 10 వేల నగదు, క్వింటా బియ్యం, చీరలు, రాగులు, జొన్నలు, చక్కెర ఇతర నిత్యవసర సరుకులు అందజేశారు.

నగదు, దుస్తులు ఇతర సరుకులు అందజేస్తున్న మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగులు
విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు..
రామక్క దీనస్థితిని తెలుసుకునేందుకు కలెక్టర్‌ వీరపాండియన్, కళ్యాణదుర్గం ఆర్డీఓ ఆదేశాల మేరకు బుధవారం గుమ్మఘట్ట ఆర్‌ఐ విజయ్‌కుమార్, వీఆర్వోలు అనుమేష్, నాగరాజులు విచారణ చేపట్టారు. ఎలాంటి సాయం కావాలో చెప్పాలని రామక్కను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకునేలా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. రామక్క పడుతున్న కష్టాలను గ్రామస్తులు.. అధికారులకు వివరించారు. 

ఫోన్‌లో ధైర్యం చెప్పిన ఎన్‌ఆర్‌ఐలు..
రామక్క దీనస్థితిని ‘సాక్షి’ కథనంతో తెలుసుకున్న మన రాష్ట్రానికి చెందిన కొందరు ఎన్‌ఆర్‌ఐలు నేరుగా రామక్కకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ఖాతాలో నగదు జమచేస్తామని.. పిల్లల కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రామక్క సంతోషం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు