కదిలించిన కథనం.. స్పందించిన హృదయం

14 May, 2019 07:10 IST|Sakshi

రామక్కను ఓదారుస్తున్న మానవత్వం

ఫోన్‌లో పలువురు  ప్రముఖుల పరామర్శ

కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా

‘సాక్షి’కి రుణపడి ఉంటానన్న బాధితురాలు

ఈ ఫొటోలో రామక్కకు రూ.10వేల నగదును అందజేస్తున్న వ్యక్తి ఓ రైతు. పేరు జూగప్ప గారి శివకుమార్‌. గుమ్మఘట్ట మండలం కేపీ.దొడ్డి గ్రామానికి చెందిన ఇతను ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి చలించిపోయారు. కరువు జిల్లాలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది తనకు ఉన్నదాంట్లో ఆ తల్లికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తన కుమారుడు సంతోష్‌తో కలిసి పరుగున కలుగోడు గ్రామానికి చేరుకున్నాడు. ఓ అన్నగా ఆమెకు ధైర్యం చెప్పి చిరు సహాయం ఆమె చేతికందించాడు. అంతటితో ఆయన మనసు కుదుట పడలేదు.. తన పొలంలో పండిన ధాన్యం గింజలతో పిల్లల ఆకలి తీరుస్తానంటూ కొండంత భరోసానివ్వడం విశేషం.  ఈ రైతన్నకు ‘సాక్షి’ సలాం.

రామక్క వేదనాభరిత జీవనం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.     చిన్న వయస్సులో సంసార సాగరాన్ని ఒంటి చేత్తో ఈదుతున్న ఒంటరి మహిళకు మానవత్వం అండగా నిలుస్తోంది. భర్తను పోగొట్టుకొని.. ఆరుగురు ఆడపిల్లలతో పాటు అత్త పోషణ భారాన్ని భుజానికెత్తుకున్న ఆ తల్లికి జగమంత కుటుంబం భరోసానిస్తోంది. ‘సాక్షి’లో ఈనెల 13న ‘రామా.. కనవేమిరా!’ శీర్షికన ప్రచురితమైన కథనం మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపింది. ఓ అక్కగా.. చెల్లిగా.. కుటుంబ సభ్యురాలిగా ఓదార్చడంతో పాటు ఆమెను కష్టాల సాగరం నుంచి బయటపడేసేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.

గుమ్మఘట్ట: భర్త చాటున పదమూడేళ్లు క్షణాల్లా గడిచిపోయాయి. ‘ఆయన’ అడిగిన ఒకే ఒక్క కోరిక తీర్చడంలో భాగంగా ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మగబిడ్డ కావాలనే ఆశ తీరకుండానే ఆ ఇంటి పెద్దదిక్కు కష్టాల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరై కాలం చేశాడు. ఏడాది కాలంగా ఆమె ఎదుర్కొంటున్న కష్టాలను చూస్తే కన్నీళ్లకే కన్నీళ్లొస్తాయి. గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన హనుమంతు భార్య రామక్క దీనగాథను ‘సాక్షి’ అక్షరీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్‌ చేసి ఆమె వివరాలు సేకరించారు. కొందరు పత్రికలో ప్రచురితమైన ఆమె బ్యాంకు ఖాతా వివరాలు చూసి రూ. 40వేల నగదు సహాయం చేశారు. మరికొందరు స్వయంగా పరామర్శించి సాయమందించారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి తలారి పీడీ రంగయ్య.. రాయదుర్గం, శింగనమల నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఎస్‌ఆర్‌ఐటీ అధినేత ఆలూరి సాంబశివారెడ్డి.. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పూల నాగరాజు, రాయదుర్గం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గౌని ఉపేంద్రరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, మునిరత్నం ట్రావెల్స్‌ యజమాని శ్రీనివాసులు తదితరులు రామక్క కష్టాలపై ఆరా తీశారు. ఒకటి రెండు రోజుల్లో స్వయంగా కలిసి కష్టాల నుంచి గట్టెక్కిస్తామని భరోసానిచ్చారు.  

‘సాక్షి’ రుణం తీర్చుకోలేనిది..
ఏడాది కాలంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నా. కూలి దొరికితే తప్ప పిల్లల కడుపు నింపలేని పరిస్థితి. ఎవరినీ నోరు తెరిచి అడగలేక నాలో నేను కుమిలిపోయేదాన్ని. ‘సాక్షి’ కథనం నాకు కొండంత అండగా నిలుస్తోంది. బంధుత్వం లేకపోయినా, ఎంతో మంది నాకు ధైర్యం చెబుతుండటం చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ‘సాక్షి’ రుణం తీర్చుకోలేనిది.    – రామక్క

బ్యాంకు ఖాతా వివరాలు
పేరు: రామక్క మాదిగ
ఊరు: కలుగోడు గ్రామం, గుమ్మఘట్ట మండలం
బ్యాంక్‌ అకౌంట్‌ నెం. : 91029588843, ఏపీజీబీ గుమ్మఘట్ట బ్రాంచ్‌
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ :ఏపీజీబీ 0001018 

మరిన్ని వార్తలు