జగన్‌మోహన్‌రెడ్డి అంటే మాకు ప్రాణం....

21 Oct, 2018 10:55 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతున్న ప్రసాద్, తదితరులు 

దివంగత మహానేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నుంచి ఆ కుటుంబం అంటే మాకు ఎంతో ఇష్టం. వైఎస్సార్‌ అకాల మరణం వార్త టీవీలో చూస్తూ నా భర్త శ్రీరామ్మూర్తి హఠాత్తుగా కన్నుమూశాడు. కష్టాల్లో ఉన్న నా కుటుంబాన్ని జగన్‌బాబు పరామర్శించి ఓదార్చారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది.           – శిష్టు లక్ష్మి, శిష్టుసీతారాంపురం గ్రామం, రామభద్రపురం మండలం

రోడ్డు వేయలేదు...
మంత్రి ఆర్‌వీఎస్‌కే రంగారావు ఎన్నికల సమయంలో మా గ్రామానికి తారురోడ్డు వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిపించాం. కానీ రోడ్డు వేయలేదు. ఎన్నో సార్లు కోటకు వెళ్లాం. అదిగో ఇదిగో అన్నారు. ఇటీవల గ్రామంలోకి ఇంటింటికీ తెలుగు దేశం అంటూ ర్యాలీ నిర్వహించారు. మా గ్రామంలోకి మీరు రావద్దని అడ్డుకున్నాం. మంత్రిని ఘెరావ్‌ చేశాం. దీంతో రెండు రోజులయ్యాక రోడ్డు మంజూరయిందన్నారు. కానీ నేటికీ పనులు చేపట్టలేదు. మీరైనా మా గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలి.        –  బెవర ప్రసాద్, తిరుపతి, కామినాయుడు, కొండకెంగువ, రామభద్రపురం మండలం

చదువు సాగడం లేదు..
పాఠశాలలో ఉన్న సమస్యల వల్ల చదువులు సాగడం లేదు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే విద్యారంగ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉంది. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం.   – పి. గంగాదేవి, ఎస్‌.పద్మ, ఎస్‌. అశ్విని, పి. చిన్నమాంబ, పి. నవీన్, పారాది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 

గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరా..
మా గ్రామంలో గ్రంథాలయం లేకపోవడంతో యువతీ, యువకులు పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కాలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా బొబ్బిలి, విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నాం. గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఎంతోమందిని వేడుకున్నా ఫలితం లేకపోయింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి.           –  పి.అఖిల, గొర్లి సీతారాంపురం, బొబ్బిలి మండలం

కారుచౌకగా తీసుకున్నారు..
బొబ్బిలి మండలంలోని మెట్టవలస, పారాది, గొర్లె సీతారామపురం, కొత్తపెంట, పనుకువలస, గున్నతోట, తదితర గ్రామాల్లో 1990–91లో టీడీపీ హాయంలో గ్రోత్‌ సెంటర్‌ ఏర్పాటుకు 1150 ఎకరాలు కారుచౌకగా తీసుకున్నారు. భూములిచ్చిన వారికి కంపెనీల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నారు. దీంతో మా గ్రామాలకు చెందిన యువతీ, యువకులందరూ ఐటీఐ, డిప్లమో, తదితర టెక్నికల్‌ కోర్సులను పూర్తి చేశారు. అగ్రిమెంట్‌ ప్రకారం 650 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. పైగా పక్క రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మాలాంటి వారికి న్యాయం జరుగుతుంది.    –  అరసాడ రమేష్‌నాయుడు, మెట్టవలస, బొబ్బిలి మండలం 

మరిన్ని వార్తలు