కొండచిలువను చంపితే జైలుశిక్ష! 

5 Nov, 2019 08:45 IST|Sakshi

సాక్షి,శ్రీకాకుళం : ‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా... కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.

వణ్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం షెడ్యూల్‌–1 కేటగిరీలో పెద్దపులి, నెమలి, జింక, ఫిషింగ్‌ క్యాట్, కొండ గొర్రె, ఏనుగు, చిరుత పులి, ఎలుగు బంటి తదితర జంతువులతోపాటు కొండ చిలువలను చంపితే చట్టప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు కఠిన జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తామని వివరించారు. జిల్లాలో 15 రోజుల్లోనే లావేరు, బూర్జ, గార, నందిగాం, పలాస, ఆమదాలవలస తదితర మండలాలతోపాటు ఏజెన్సీ మండలాల్లోనూ పది వరకు కొండచిలువలను చంపేసినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఇది నిజంగా దారుణమన్నారు. కొండచిలువలు ఎక్కడైనా తారసపడితే.. వెంటనే తమ అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన కలిగించుకోవాలన్నారు.  

సచివాలయాల్లో అటవీ శాఖ అధికారుల వివరాలు 
జిల్లాలో వణ్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లో భాగంగా అన్ని మండలాల్లోనూ సచివాలయాలతోపాటు పలు ప్రభుత్వ భవనాల వద్ద స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతామని డీఎఫ్‌వో సందీప్‌ కృపాకర్‌ తెలియజేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ చట్టంపై అవగాహన కలిగించేలా తమ అధికార బృందంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నామని వివరించారు. ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు.

అదేవిధంగా ఇదే చట్టం ప్రకారం షెడ్యూల్‌–3లో అడవి పందిని చంపినా కచ్చితంగా నేరంగానే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల పొందూరు మండలంలో ఓ కేసును నమోదు చేసినట్లు గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కూడా చట్టాలపై పూర్తి అవగాహనతో ఉండాలని, వణ్యప్రాణులను చంపిన వారిపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా, వెంటనే అప్రమత్తమై, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను గుర్తించి నిందితులపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇకమీదట వణ్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లుగా ప్రకటించారు.  

మరిన్ని వార్తలు