నిశ్చింతనిచ్చే నాయకుడివనీ..

18 Jul, 2018 06:59 IST|Sakshi

తూర్పుగోదావరి : ఆ చేయి.. ఎన్నో కన్నీళ్లను తుడిచే చేయి.. మరెందరో సమస్యలను పరిష్కరించే వరదాయిని.. ఆ అభయహస్తం చాలదూ.. నిశ్చింతగా, నిర్భయంగా బతకడానికి? ఆ భరోసానే  ఆయనా ఇస్తున్నారు.. ప్రజలూ కోరుకుంటున్నారు. అందుకే గ్రామగ్రామానా జననేత జగన్‌కు సాదర స్వాగతం పలుకుతూనే సమస్యలు, విన్నపాలు ఆయన చెవిన వేస్తున్నారు అశేష ప్రజానీకం. చెదరని చిరునవ్వుతో.. ముచ్చటగా పలకరిస్తూ.. చిన్నారులను ముద్దిస్తూ.. పెద్దవారికి తానున్నానని ధైర్యం పలుకుతూ సంకల్ప యాత్ర  పెదపూడి మండలం కరకుదురు నుంచి కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడకు చేరుకున్నారు జననేత జగన్‌.

పిల్లలకు దారి చూపయ్యా
‘ఇద్దరు ఆడపిల్లలను కష్టపడి చదివించాను వారికి ఉద్యోగావకాశాలు కల్పించి దారి చూపయ్యా’ అంటూ కరకుదురుకు చెందిన సానా సుబ్బయ్య పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కోరాడు. తన కుమార్తెలిద్దరితో జగన్‌ను కలిసి సమస్యలను చెప్పుకున్నాడు. తనకు స్థిరాస్తులేమీ లేవని వస్త్ర దుకాణం పెట్టుకుని జీవిస్తున్నానని తన గోడును విన్నవించాడు. చిన్న సంపాదనైనా పొదుపుగా ఉంటూ ఆడపిల్లలను పీజీ చదివించానన్నారు. సుబ్బయ్య కుమార్తెలు జగన్‌ వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు.

ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలి
జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ  ఏర్పాటు చేయాలని రామేశ్వరానికి చెందిన ఉండ్రు సత్యనారాయణ జగన్‌ను కోరారు. ప్రస్తుతం కడప, శ్రీకాకుళం, ఒంగోలు, కృష్ణా జిల్లాల్లోనే ఆ కళాశాలలున్నాయని, అవి దూరం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జగన్‌కు చెప్పానన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ రావడంలేదని చెప్పానన్నారు.

నా బిడ్డకు ఆసరా కల్పించయ్యా
‘నా కొడుకు పిల్లి బాలాజీ దివ్యాంగుడు. ఏ పనీ చేయలేక ఇంటి వద్దే ఉంటూ ఫొటోలు తీసే పని చేసుకుంటున్నాడు. వాడికేదన్నా దారి చూపించయ్యా’ అంటూ పాదయాత్రలో రామేశ్వరం వద్ద జగన్‌ను కోరారు పిల్లి నాగమణి. సమస్యను ఆయన ఓపిగ్గా విన్నారని, ఆయన  సీఎం అయితే తమ లాంటి కుటుంబాలను ఆదుకుంటాడన్న నమ్మకం ఉందని ధీమాగా చెప్పింది నాగమణి.

వికలాంగ పింఛనుఇవ్వడంలేదయ్యా!
తన రెండు చేతి వేళ్లు సక్రమంగా లేక పనిచేయలేని స్థితిలో ఉన్నానని, సదరమ్‌ సర్టిఫికెట్‌ ఉన్నా పింఛను మంజూరు చేయడంలేదని జగన్‌ ఎదుట వాపోయాడు కరకుదురుకు చెందిన బి.వీరనాగేంద్రకుమార్‌. సదరంలో వైకల్యం 54 శాతమే ఉందన్న సాకుతో పింఛను ఇవ్వడంలేదని వాపోయాడు.

మరిన్ని వార్తలు