రెండు కిడ్నీలు పోవాలంట సార్‌...

15 Nov, 2018 08:01 IST|Sakshi
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న మణి

తన భర్త పరిస్థితి చెప్పుకుని కన్నీటిపర్యంతమైన మణి

సానుకూలంగా స్పందించిన జననేత జగన్‌మోహన్‌రెడ్డి

విజయనగరం : కిడ్నీ బాధితులను ఆదుకుంటాం.. అర్హులకు పింఛన్లు ఇస్తాం.. అని ప్రభుత్వం, అధికారులు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నాయి. కాని ఆచరణలో మాత్రం లేనిపోని నిబంధనలు పెడుతున్నారు. సీతానగరం మండలం చినభోగిలి గ్రామానికి చెందిన చుక్క అప్పలనాయుడుకు కిడ్నీ పోయింది. ఇతని కుమారుడు కూడా పోలియో బాధితుడు. దీంతో అప్పలనాయుడు భార్య మణి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.  తన భర్తకు పింఛన్‌ మంజూరు చేయాలంటూ పలుమార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా ఏ ఒక్కరూ కనికరించలేదు.

పైగా రెండు కిడ్నీలు పోతే పింఛన్‌ మంజూరు చేస్తామని ఓ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో మణి కుటుంబాన్ని నెట్టుకురావడానికి పడరాని పాట్లు పడుతోంది. రెండు కిడ్నీలు పోతే మనిషి ఎలా బతికుంటాడని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంకల్పయాత్ర పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలంలోని చినభోగిలి మీదుగా సాగుతున్న తరుణంలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మణి కలిసి తన గోడు వెల్లబోసుకుంది. రెండు కిడ్నీలు పోతే పింఛన్‌ ఇస్తామని అధికారులు చెబుతున్నారని.. కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నానని వాపోయింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మాలాంటి కుటుంబాలను ఆదుకోవాలని కోరగా జననేత సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు