ఒక్కొక్కరిది ఒక్కో సమస్య..

11 Dec, 2018 07:40 IST|Sakshi

శ్రీకాకుళం :పంట నష్టం జరిగిందని ఒకరు.. పింఛన్‌ అందడం లేదని మరొకరు.. ఉద్యోగం తొలగించారని ఇంకొకరు.. ఇలా బాధితులంతా తమ ఆవేదనను వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద చెప్పుకున్నారు. ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేతను కలిసి కష్టాలు విన్నవించుకున్నారు.

తిత్లీతో పంట నష్టపోయాను..
తిత్లీ తుఫాన్‌ సమయంలో వీచిన ఈదురు గాలులకు వంగ పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేలు వరకు ఖర్చు చేశాను. కనీస దిగుబడి లేదు. ఉద్యావన శాఖ కార్యాలయంలో సంప్రదించినా పరిహారం మంజూరు చేయలేదు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులను అధికారులు పట్టించుకోవడం లేదు.  – పైడి రామారావు, రైతు, గట్టుమూడిపేట.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా..
అన్నా.. ఊరిలో ఎస్సీ రిజర్వు అంగన్‌వాడీ పోస్టు ఖాళీగా ఉంది. నాకు అన్ని అర్హతలు ఉన్నా అవకాశం ఇవ్వడం లేదు. నాలుగుసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదన్నా. వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా ఉన్నామని కక్ష సాధిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు భయపడి మాకు అన్యాయం చేస్తున్నారు.– మన్నేన అన్నపూర్ణ, నక్కలపేట, సరుబుజ్జిలి మండలం

ఆదుకోవాలన్నా..
నా భర్త ముకుందరావు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. మాది వంశధార ప్రాజెక్టు ప్రాంతం. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇల్లు, సర్వం కోల్పోయాం. వైద్యుల ను సంప్రదిస్తే డయాలసిస్‌కు కూడా అవకాశం లేదంటున్నారు. కనీసం మందులు కొనేందుకు అవకాశం లేదు. రూ.వెయ్యి పింఛను వస్తున్నా బతుకు భారంగా ఉందన్నా. మీరు ముఖ్య మంత్రి అయితే మాలాంటి పేదలను ఆదుకోవాలన్నా.             – సోమిరెడ్డి విమలకుమారి,పెద్ద సంకిలి, హిరమండలం.

అందని వితంతు పింఛన్‌
ఒంటరి మహిళలకు వితంతు పింఛను అందడం లేదు. రైతు కూలీగా పనులు చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. కష్టపడి ఇంజినీరింగ్‌ వరకు చదివించా. వారికి ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి కూడా అందడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అన్నా. ఈ ప్రభుత్వంలో కనీస న్యాయం జరగడం లేదు. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు వర్తించకుండా అడ్డుకుంటున్నారు.– పెడార నిర్మల,రాగోలు పేట, శ్రీకాకుళం

దివ్యాంగులకు భరోసా ఇవ్వాలి
పూర్తిగా పనిచేయటం సాధ్యం కాని, ఇంటికే పరిమితమైన దివ్యాంగులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలి. ఆరోగ్యం, వైద్యం, విద్యకు ప్రాధాన్యమివ్వాలి. దివ్యాంగుల ఉపాధికి కృషిచేయాలి.– పైడి తులసీదాస్, దివ్యాంగుడు, వంజంగి

మరిన్ని వార్తలు