అనర్హులకే అందలం

19 Dec, 2018 07:39 IST|Sakshi
కస్తూరిపాడు జంక్షన్‌–కొబ్బరిచెట్ల పాలెం రోడ్డులో జగన్‌తో పాటు నడుస్తున్న ప్రజానీకం

ఏ మంత్రి అండదండలతో దౌర్జన్య పాలన ఏ ప్రతిపక్ష నేత ఎదుట వాపోయిన బాధితులు

శ్రీకాకుళం: అధికారం అండతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పలువురు బాధితులు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. లంచాలు ఇవ్వకపోతే పనులు జరగడం లేదని, మంత్రి అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేతను కలిసి పలువురు తమ సమస్యలు విన్నవించారు.– ప్రజాసంకల్పయాత్ర బృందం

టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు
మా ప్రాంతంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు అండదండలతో చెలరేగిపోతున్నారు. కేంద్రం ద్వారా వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులుగా చెప్పుకుంటున్నారు. ఆ నిధులతో మంత్రి కుటుంబీకులు, కాంట్రాక్టర్లు నాణ్యత లేని రహదారులు నిర్మించారు. లంచాలు దండుకుంటున్నారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారు.
– నేతింటి సింహాచలం, సౌడాం గ్రామం, టెక్కలి నియోజకవర్గం.

అదుపుతప్పిన శాంతిభద్రతలు
టీడీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. జన్మభూమి కమిటీల కారణంగా గ్రూప్‌–1 అధికారులకు పనిలేకుండా పోయింది. కమిటీ చెప్పిన వాడు అర్హుడు కాకపోయినా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. శాంత్రిభద్రతలు అదుపు తప్పాయి. టీడీపీకి ఓటు వేయలేదని కక్ష సాధిస్తున్నారు. అర్హులకు ఎటువంటి రాయితీ రాకుండా అడ్డుకుంటున్నారు.
– ఎం.రామారావు, విశ్రాంత పోలీస్‌ ఉద్యోగి, సౌడాం

విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు
కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. నా కుమారుడు అభిషేక్‌ చదువుల కోసం రూ.2లక్షలు పైబడి చెల్లించి నష్టపోయాను. రాజన్న హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తించటంతో మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులు సులభంగా చదివారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని మెరుగుపర్చండి. కేశవరెడ్డి బాధితులకు న్యాయం జరిగేలా చూడండి.– కొత్తకోట అప్పలనాయుడు, ఊడిగలపాడు, జలుమూరు మండలం

మహానేత చలువతో...
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు ఆనందంగా ఉండేవారు. ఆయన మరణంతో çఅన్నదాతలకు సమస్యలు ప్రారంభమయ్యాయి. జలుమూరు మండలం జోనంకిలో రాజన్న హయాంలోనే వెంకటాపురం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. అయితే శివారు ప్రాంతాలకు సాగునీరు లేక వందలాది ఎకరాలు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాలు పడకుంటే పంటలు లేక ఇక్కడి రైతులు వలసలు పోతున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తిపోతల పథకాన్ని మరింత మెరుగుపర్చి రైతులను ఆదుకోవాలి.– మామిడి గోపాలకృష్ణ, ఊడిగలపాడు, జలుమూరు మండలం

ఇళ్ల పట్టాలు రద్దు చేశారు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో మా గ్రామంలో నాలుగు వందల ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అప్పట్లో అర్హత పొందినవారు పునాదుల వరకు గృహాలను నిర్మించారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణాలు చేపట్టలేకపోయారు. దీనిని సాకుగా చూపి అధికార పార్టీ నాయకులు 2 వందల మంది పట్టాలను రద్దు చేయించారు. టీడీపీకి చెందిన వారికి ఆ స్థలాను కట్టబెట్టి పేదలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు అధికారంలో వచ్చిన వెంటనే మాకు న్యాయం జరిగేలా చూడాలి.–  దుక్క రామకృష్ణ, కొత్తపేట గ్రామం, కోటబొమ్మాళి

కుటుంబాన్ని ఆదుకోండి
అన్నా.. నా కుటుంబాన్ని ఆదుకోండి. నేను పుట్టుక నుంచి దివ్యాంగుడిని. దీనికి తోడు రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరిగిపోయింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. కుటుంబ పోషణ కష్టంగా ఉంది.
– కొర్ను రామకృష్ణ, దరివాడ గ్రామం, జలుమూరు మండలం

మరిన్ని వార్తలు