ప్రభుత్వం పట్టించుకోవడంలేదు

21 Mar, 2018 07:08 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన డయేరియా బాధితులు

నష్టపరిహారం ఇవ్వడంలోనూ తాత్సారం చేస్తున్నారని ఆవేదన

అధికారులు, పాలకులు సమస్యపై దృష్టి సారించలేదని ఫిర్యాదు

సాక్షి, అమరావతి బ్యూరో: ‘మంచినీరు తాగాలంటేనే భయమేస్తోంది. డయేరియాతో ప్రాణాలు పోతున్నాయి. సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకొంటోంది. నష్టపరి హారం ఇస్తామని చెప్పి 8 మందికే సాయం చేశారు. కలుషిత నీటి వల్లే సమస్య ఉత్పన్నమైతే గుంతలు పూడ్చారు తప్ప పైపులైన్లు అలాగే ఉన్నాయి. ఇలాగే ఉంటే మరిన్ని ఇబ్బందులు పడాల్సివస్తుంది’ అంటూ గుంటూరు డయేరియా బాధితులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల సభ్యులు, బాధితులు ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఉప్పలపాడులో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరిం చారు.

పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యంతోనే డయేరియా ప్రబలి తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. మృతుల విషయంలో సైతం ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, డయేరియాతో మరణించిన వారందరినీ గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. స్పందించిన వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం క్షమించరాని నేరమని స్పష్టంచేశారు. మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి కాలంచెల్లే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి బాధితులు అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా ఉండి వారికి భరోసా కల్పించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు సూచించారు.

మరిన్ని వార్తలు