హామీ కోరుతున్నాం.. అండగా ఉంటావా..!

7 Jun, 2018 07:03 IST|Sakshi
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ధైర్యం చెబుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పశ్చిమగోదావరి  : ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదంటూ రైతుల ఆవేదన.. కూలినాలీ చేసి మా కుమారుడ్ని ఎమ్మెస్సీ చదివించాం, కానీ ఉద్యోగం రాలేదంటూ ఓ తల్లి ఆందోళన.. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నాం.. అయినా పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ ఆశా వర్కర్ల విచారం.. ఇలా ఎందరో వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద తమ కష్టాలు చెప్పుకున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక మమ్మల్ని ఆదుకోవాలంటూ హామీ కోరారు. ఇలా ప్రజా సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ విరామ మెరుగక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన ప్రజా సంకల్పయాత్రను జిల్లాలో కొనసాగించారు.  

అద్దె ఇంటిలోనే..
ఉండ్రాజవరంలో నివాసం ఉంటున్న తనకు ఇల్లు లేక అద్దెంటిలోనే జీవనం సాగిస్తున్నామని తోట పోశమ్మ అనే మహిళ అదే గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన బాధ చెప్పారు. పని చేస్తేగాని పూట గడవని తమకు ఇంటి అద్దె భారమని తెలిపారు. మీరు అధికారంలోకి రాగానే ఇల్లు, పింఛను మంజూరు చేయాలని జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె విజ్ఞప్తి చేశారు.

నా భర్తకు పింఛను వచ్చేలా చేయండి
మేము వడ్రంగి పనిచేస్తూ జీవిస్తుంటాం. ఇటీవల నా భర్త పనిచేసే సమయంలో వేళ్లు నలగడంతో తొలగించారు. ఇళ్లు గడవడం కష్టంగా ఉంది. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఉండ్రాజవరానికి చెందిన కె.అంజలి అనే మహిళ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

నా కుమారుడ్ని ఎమ్మెస్సీ చదివించినా..
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. కూలి పనులు చేసుకుంటూ నా కుమారుడు నాగబాబును ఎమ్మెస్సీ వరకూ చదివించాను. చదువు పూర్తయినా ఉద్యోగ అవకాశం లేక మా కళ్లెదుటే ఖాళీగా తిరుగుతున్నాడంటూ పైడిపర్రుకు చెందిన సమితి లక్ష్మి అనే మహిళ వాపోయారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన బాధ చెప్పారు.

>
మరిన్ని వార్తలు