పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి

10 Nov, 2018 08:14 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ వద్ద చినకొండేపూడివాసుల బైఠాయింపు

నిందితులను  అరెస్టు చేయాలని డిమాండ్‌  

తూర్పుగోదావరి, సీతానగరం (రాజానగరం) : మండలంలోని చినకొండేపూడికి చెందిన సుమారు 300 మంది శుక్రవారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించి, రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, ఆందోళనకారుల కథనం ప్రకారం.. రఘుదేవపురం పంచాయతీ పరిధి శ్రీరామనగరం హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్దకు చినకొండేపూడికి చెందిన ఆకుల వీర వెంకట సత్యనారాయణను గురువారం రాత్రి 9 గంటలకు చంటి, దుర్గాప్రసాద్, నవీన్, హేమప్రసాద్, మేడిశెట్టి వెంకటేష్‌ తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను కవచం అంబులెన్సులో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ దాడిలో అతడి ఎడమ కంటికి తీవ్ర గాయమైంది. ఈ దాడికి సంబంధించి శుక్రవారం కొంతమందినే అరెస్ట్‌ చేశారని, మిగిలినవారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని నిలదీస్తూ 300 మందికి పైగా ప్రజలు స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సుమారు రెండు గంటలపాటు నిరసన తెలిపారు. వారితో హెడ్‌ కానిస్టేబుల్‌ మునికుమార్, పోలీసు సిబ్బంది చర్చించారు. మిగిలినవారిని అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాత్రి 9 గంటలకు వెనుతిరిగారు. ఈ దాడికి సంబంధించి చంటి, దుర్గాప్రసాద్, హేమప్రసాద్, నవీన్‌లను అరెస్ట్‌ చేశామని, మేడిశెట్టి వెంకటేష్‌ను అరెస్ట్‌ చేయాల్సి ఉందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌ కానిస్టేబుల్‌ మునికుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు