పర్చూరు టీడీపీకి షాక్‌

9 Apr, 2019 12:55 IST|Sakshi
​​​​​​​దగ్గుబాటి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ అసమ్మతి నేత కొల్లా సుభాష్‌ (ఫైల్‌)

‘దగ్గుబాటి’కే జై అంటున్న ఏలూరి అసమ్మతి నేతలు 

వైఎస్సార్‌ సీపీలో కొనసాగుతున్న చేరికలు

జగన్‌ మేనిఫెస్టోతో ప్రజల్లో మరింత నమ్మకం 

సాక్షి, కారంచేడు (ప్రకాశం): టీడీపీ నాయకులు భయపడుతున్నట్టుగానే జరిగింది. అసమ్మతి నాయకులు కీలక సమయంలో జలక్‌ ఇచ్చారు. మాకొద్దీ ఎమ్మెల్యే అని ఎంత మొత్తుకున్నా వినకుండా తెలుగుదేశం పార్టీ అధినేత బలవంతంగా తమపై రుద్దిన ఏలూరి అభ్యర్థిత్వానికి వ్యతిరేకించారు. తాము ప్రకటించినట్లుగానే ఏలూరిని ఓడించేందుకు దగ్గుబాటి కుటీరంలో చేరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 5500కి పైగా టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌ సీపీ కండువ కప్పుకున్నాయి. దగ్గుబాటి గతంలో చేసిన అభివృద్ధి, మాట తప్పని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీలు, మేనిఫెస్టోకు ఆకర్షితులై వైఎస్సార్‌ సీపీలోకి చేరుతున్నారు. ఈ చేరికల పరంపరతో పర్చూరులో దగ్గుబాటి విజయం నల్లేరుపై బండినకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాము టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో.. అక్కడి నేతల తీరుపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఓటమి ఎరుగని నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరావుకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఉన్న అసమ్మతి దగ్గుబాటి విజయాన్ని మరింత సులువు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పర్చూరు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. దగ్గుబాటి తనదైన శైలిలో తన ఎన్నికల ప్రచారంను నిర్వహిస్తున్నారు.

ఏలూరిని వీడుతున్న అసమ్మతి నేతలు..
స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అసమ్మతి నాయకులు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్న ఆయన అసమ్మతి నేతలు ఆయనకు సీటు ఇస్తే కచ్చితంగా ఓడించి తీరతామని తీర్మానించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో అసమ్మతి నేతలు ఎమ్మెల్యేతో కలిసి సాగుతామని ఆయనతో చెప్పి బైటకు వచ్చారు. కానీ తమ మనసుకు వ్యతిరేకంగా ఏలూరితో కలిసి పనిచేయలేక ఆపార్టీని వీడి బైటకు వచ్చి డాక్టర్‌ దగ్గుబాటి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరతున్నారు. 

వీరితో పాటు వారి అనుచర వర్గాలు కూడా దగ్గుబాటి కుటీరానికి క్యూ కడుతున్నారు. 25 నుంచి 30 సంవత్సరాలుగా పార్టీ విజయానికి కృషి చేసిన తమను విస్మరించడం జీర్ణించుకోలేకనే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారు. దీనికి తోడు గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి డాక్టర్‌ దగ్గుబాటి చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ çపథకాలు మళ్లీ ఆయనతో కలిసి పనిచేసేలా చేస్తున్నాయని వారంటున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేద ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండటం.. చేరికల పరంపరకు కారణమని స్థానిక ప్రజల్లో చర్చసాగుతోంది.

మండలాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన కుటుంబాలు..        

మండలం కుటుంబాలు (సుమారు)
కారంచేడు  850
పర్చూరు  1050
మార్టూరు  1150
చినగంజాం  1230
ఇంకొల్లు  890
యద్దనపూడి  370

ఐదేళ్లుగా మా మాటకు విలువ లేదు
373 ఓట్ల మెజార్టీతో గెలిచాను. నా ప్రాంత ప్రజలకు కనీస అసవరాలు తీర్చడంలో విఫలమయ్యాను. అధికారంలో ఉండీ కూడా ఏ ఒక్క పనీ చేయించుకోలేకపోయాను. మండల సర్వసభ్య సమావేశంలో కూడా నేను నా గొంతు వినిపించుకొనే యోగ్యం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయాను. టీడీపీలో ఉండి లాభం లేదనుకున్నాను. టీడీపీని వదిలి వైసీపీలో చేరాను.
– యార్లగడ్డ రజనీ, కారంచేడు–1 ఎంపీటీసీ సభ్యురాలు

గ్రామానికి కనీసం రోడ్డు వేయించుకోలేకపోయాం 
ఇడుపులపాడు–కోనంకి రోడ్డును ఆర్‌ అండ్‌ బీ కింద మార్చాలని ఎమ్మెల్యేను అనేక మార్లు కోరాం. అయినా ఆయన పట్టించుకోలేదు. గ్రామాభివృద్ధికి ఎలాంటి పని చేయించుకోలేక పోయాం. పార్టీలో సముచిత న్యాయం జరగనప్పుడు అక్కడ ఉండి ఏమి ప్రయోజనం. అందుకే టీడీపీని వదిలి వైఎస్సార్‌ సీపీలో ఉన్న నాయకులపై నమ్మకంతో చేరాం.
– పెంట్యాల సత్యన్నారాయణ, ఎంపీటీసీ సభ్యుడు, ద్రోణాదుల, మార్టూరు మండలం

దగ్గుబాటిపై నమ్మకంతోనే వైఎస్సార్‌ సీపీలో చేరాం 
టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నాం. పార్టీ కోసం పనిచేసాం. పార్టీ మాకేమీ ఇవ్వలేదు, అవమానాలు తప్ప. గ్రామానికి చెందిన డాక్టర్‌ మాకు అండగా ఉంటామన్నారు. ఆయనకు తెలుసు ఈ ప్రాంత  ప్రజలకు ఏమి కావాలో. ఆయన నాయకత్వంలో మాకు మేలు జరగుతుందనే నమ్మకం మాకుంది. పార్టీ అధినాయకత్వం పైనా మాకు నమ్మకం ఉంది. అందుకే టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరాం.
– యార్లగడ్డ శ్రీనివాసరావు, కారంచేడు

>
మరిన్ని వార్తలు