కోడి కూర గొడవ.. రాళ్లతో కొట్టుకున్న ఇరు వర్గాలు

13 Feb, 2020 09:52 IST|Sakshi

సాక్షి, సారవకోట : స్థానిక రెల్లివీధిలో బుధవారం జరిగిన వివాహ వేడుక రాసాభాసగా మారింది. భోజనాల దగ్గర ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు..  రెల్లివీధికి చెందిన కూన సురేష్‌కు బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందిని(ఉష)తో వివాహం జరిగింది. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనాల దగ్గర చికెన్‌ వడ్డింపులో పెళ్లి కుమార్తె ,పెళ్లి కుమారుడి వర్గాలు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. దీంట్లో పెళ్లి కుమార్తె వర్గానికి చెందిన కలింగపట్నం ప్రకాశ్‌ చికెన్‌ వడ్డిస్తుండగా.. పెళ్లి కుమారుడి వర్గం వారు భోజనం ప్లేట్లను ముఖంపై కొట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక పోలీసులకు సమాచారం అందించి ఇరువర్గాలను శాంతింపజేశారు.

ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడి వర్గానికి చెందిన కలింగపట్నం గణేష్‌ మెడలోని బంగారు గొలుసు వధువు వర్గం వారు తీసుకున్నట్లు ఆరోపించారు. ఇరువర్గాల వారు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపైకి వచ్చి మరలా ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కబెట్టారు. దీంట్లో సవలాపురం యర్రయ్య, శోభన్, అప్పన్న, సిరిపురం గనిరాజ్‌ తదితరులు గాయాలపాలయ్యారు. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ఇరువర్గాలవారు దగ్గరుండి వివాహం జరిపించారు.  ఈ ఘర్షణకు సంబంధించి సారవకోట గ్రామానికి చెందిన కలింగపట్నం ప్రకాశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెళ్లి కుమార్తె వర్గానికి చెందిన నలుగురిపై..  నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెళ్లి కుమారుడికి సంబంధించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. గాయపడిన వారిని  పాతపట్నం ఆస్పత్రికి తరలించామన్నారు.   

మరిన్ని వార్తలు