జన్మభూమికి నిరసన సెగ

5 Jan, 2019 13:24 IST|Sakshi
పింఛన్లు ఇవ్వడం లేదని నందవరం మండలం పూలచింతలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తుడు

ఇల్లు మంజూరు కాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సమస్యల పరిష్కారం కోసం అధికారులను నిలదీసిన ప్రజలు

కర్నూలు(అగ్రికల్చర్‌): నిరసనలు..నిలదీతల మధ్య మూడో రోజు శుక్రవారం జన్మభూమి–మా ఊరు కార్యక్రమం కొనసాగింది. సమస్యలు పరిష్కరించని సభలు తమకొద్దని కొన్ని గ్రామాల్లో ప్రజలు అడ్డుకున్నారు. ఎన్ని సార్లు తిరిగినా పక్కా ఇల్లు మంజారు చేయడం లేదని ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో రైతు జలపతి   పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని 98 గ్రామ పంచాయతీలు, 28 వార్డుల్లో మొత్తంగా 126 జన్మభూమి గ్రామసభలను శుక్రవారం నిర్వహించారు. కొత్త పింఛన్లు వస్తాయని ఆశతో వచ్చిన వృద్ధులకు, వితంతువులకు నిరాశే మిగులుతోంది. ఇదిలా ఉండగా..కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు హల్‌చల్‌ చేశారు. వివిధ సమస్యలపై అర్జీలు వీరే స్వీకరించారు. ఇక్కడ అధికారుల పాత్ర నామమాత్రమే కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

పక్కా ఇంటి కోసం నాలుగేళ్లుగా తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో జలపతి అనే రైతు జన్మభూమి గ్రామసభలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యాత్నానికి పాల్పడ్డాడు. వంద శాతం వికలత్వం ఉన్నా తన కుమార్తెలకు పింఛన్‌ ఇవ్వడం లేదని.. తాను మరణించిన తర్వాతైనా పక్కా ఇల్లు, పింఛన్‌  ఇవ్వండని అక్కడే పురుగుల మందు తాగాడు. దీంతో గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.  
వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి  తీవ్రంగా ధ్వజమెత్తారు.  ధనవంతులకు రేషన్‌ కార్డులు ఉన్నాయి.. పేదలకు లేవా అంటూ నిలదీశారు.   
ఆలూరు మండలం పెద్దహోతూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. ‘‘వీధిలైట్లు వెలుగడం లేదు.. విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటోంది.. తాగడానికి నీళ్లు లేవు’’ అంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. సమస్యలు పరిష్కరించని గ్రామసభ ఎందుకని అడ్డుకున్నారు. అధికారులు ప్రజలకు సర్దిచెప్పి తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించారు.
కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. పాఠశాల విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న బోజనంలో ఎటువంటి నాణ్యత లేదని  గ్రామసభలో ఆందోళన చేపట్టారు. రోడ్డెక్కి ధర్నా చేశారు. నీటి సరఫరా అద్వానంగా ఉందని, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని గ్రామస్థులు తీవ్రంగా ధ్వజమెత్తారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
డోన్‌ మండలం ఎద్దుపెంట గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, పక్కా ఇళ్ల బిల్లులు మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, అంతేగాక కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు.  తమకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలని మదాసి, మదారి కురువలు జన్మభూమిని అడ్డుకున్నారు.
వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో పింఛన్‌ ఎందుకు మంజూరు చేయడం లేదని అధికారులను రామంజనమ్మ అనే మహిళ  నిలదీశారు. నాలుగేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా మంజూరు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాని  హెచ్చరించారు. చెరువు మట్టిని పొలాలకు తరలించిన బిల్లులు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని.. వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయడం లేదని... జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు