మళ్లీ థర్మల్ సెగ

21 Jun, 2016 00:10 IST|Sakshi

పోలాకి: మళ్లీ థర్మల్ సెగ రాజుకుంది. జపాన్‌కు చెందిన సుమితొమో సంస్థ ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ధర్మల్ పవర్ ప్లాంట్  భూములసర్వే పోలాకి మండలంలో సెగలు పుట్టిస్తోంది. ప్లాంటు నిర్మాణ విషయమై ఆదినుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్లడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రతిపాదిత భూముల్లో సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందాన్ని అడ్డుకోవాలని అక్కడి ప్రజలు నిర్ణయంచటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
 
 థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కూడా మద్దతు తెలపటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తహసీల్దార్ జెన్ని రామారావు స్పందించి సిబ్బంది, పోలీసులతో ప్రతిపాదిత గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ ప్రజలు, థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, రైతులతో మాట్లాడారు. ఇది కేవలం భౌగోళిక సర్వే మాత్రమేనని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయటంతో సర్వే నిలిపి వేస్తున్నట్టు తహసీల్దార్ ప్రకటించారు.
 
 ప్లాంటే వద్దంటే.. భూముల సర్వే ఎందుకు?
 అనంతరం సీపీఎం నాయకుడు చౌదరి తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తుంటే భూముల సర్వే ఎందుకని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సర్వే పేరుతో ఒక్క అడుగు ముందుకు వేసినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తరువాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయనకు మద్దతుగా థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, కింజరాపు మల్లేశ్వరరావు, సురేష్‌బాబు, రైతు సంఘం నాయకుడు మోహనరావు తదితరులు అధికారులకు ప్రశించారు.
 
 నేటినుంచి గ్రామాల్లో అవగాహన సదస్సులు
 సర్వే నిలిపి వేసిన అనంతరం తహసీల్దార్ ధర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, రైతులతో మాట్లాడారు. మంగళవారం నుంచి ధర్మల్ ప్రతిపాదిత గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ముందుగా చీడివలస, ఓదిపాడు, గవరంపేట గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అనిల్‌కుమార్‌తోపాటు సిబ్బంది కృష్ణమోహన్, వెంకటరమణ పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు