బాబూ.. ఇది ధర్మమా?

30 Jun, 2018 06:09 IST|Sakshi
భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌ ఖాళీగా ఉన్న దృశ్యం

కాకినాడలో ధర్మపోరాట దీక్షకు జిల్లా నుంచి బస్సులు

బస్సులు లేక అధిక చార్టీలు చెల్లించి ఆటోల్లో ప్రయాణం

భీమవరం(పకాశం చౌక్‌): బాబు గారు ఎప్పుడు ఎక్కడ దీక్ష చేసినా లేదా ఏ సభైనా చేపట్టినా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు. ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఫుల్‌గా వాడుకోవడంతో ప్రయాణికులు పాట్లు పడతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఇదే తంతు. తాజాగా శుక్రవారం ఆయన కాకినాడలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు పార్టీ నాయకులను, కార్యకర్తలను తీసుకెళ్లడానికి మరోసారి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడరాని పాట్లు పడ్డారు.

ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అధిక చార్జీలు చెల్లించి ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించారు. బస్సులు లేవు అని తెలియక చాలా మంది ప్రయాణికులు ఆయా బస్టాండుల్లో పడిగాపులు కాసి నరకం చూశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేల మంది వచ్చేలా చూడాలని బాబుగారు ఆర్డర్‌ వేస్తే కనీసం వెయ్యిమందినైనా తరలించాలని నాయకులు జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను అధిక సంఖ్యలో ఉపయోగించుకున్నారు.

జిల్లా నుంచి 200 బస్సులు
జిల్లా నుంచి జనాన్ని కాకినాడ తరలించడానికి సుమారు 200 ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఒకరోజు ఆర్టీసీ నష్టం సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంటే మరో పక్క సీఎం చంద్రబాబు దీక్షల వల్ల బస్సు సర్వీసులు లేకుండా పోవడంతో ప్రతి డిపోకు లక్షల్లో నష్టం వస్తోంది. దీంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రే దీక్షల పేరుతో అథోగతి పాలు చేయడం ఏంటని ప్రజలు, ప్రయాణికులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు