-

ఆద్యంతం.. అవస్థలే

28 Jan, 2019 07:46 IST|Sakshi
కాలేజీ గోడ దూకి వెళ్లిపోయిన జనం

‘జయహో బీసీ’లో అపశృతులు

సభా ప్రాంగణానికి ఐదు కిలోమీటర్ల నడక

చతికిల పడిన వృద్ధ మహిళలు

కాలేజీ గోడ దూకి వెళ్లిపోయిన జనం

తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): నగరంలో ఆదివారం నిర్వహించిన జయహో బీసీ సభకు వచ్చిన పలువురు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు, సెల్‌ ఫోన్లు ఇస్తామంటూ.. మరి కొందరిని రూ.2 వందల చొప్పున ఇస్తామని ఈ సభకు ఆర్టీసీ బస్సులు, స్కూల్‌ బస్సుల్లో మహిళలను తరలించారు. వాహనాలు పార్కింగ్‌ చేసిన ప్రాంతాల్లో టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. జమ్మలమడుగు, బద్వేల్, పుటపర్తి, కర్నూలు, తాడిపత్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఉదయం 10 గంటలకే నగరానికి చేరుకున్నారు. శివారు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేయడంతో ఐదు కిలోమీటర్లకు పైగా సభా ప్రాంగణానికి వారు నడుచుకుంటూ చేరుకున్నారు. వృద్ధులను తరలించడంతో వారు అంత దూరం నడవలేక ఎక్కడికక్కడ కూర్చుండి పోయారు.

పార్టీ సభకు అధికారుల సేవ
టీడీపీ ఏర్పాటు చేసిన ఈ సభకు అధికారులు సేవలు అందించాల్సి వచ్చింది. రెవెన్యూ, వైద్య, నగర పాలక సంస్థ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఉదయం నుంచి సభా ప్రాంగణం వద్ద ఉండి ఏర్పాట్లకు సహకరించారు. ఉద్యోగులకు భోజనాలు ఇతర సౌకర్యాలు లేకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడ్డారు. మహిళా ఉద్యోగులకు తీవ్ర అవస్థలు తప్పలేదు. సభా ప్రాంగణంలో బారీకేడ్లు సక్రమంగా లేకపోవడంతో నం తాకిడికి కూలిపోయాయి. సభకు హాజరైన వారు తిరిగి ఎలా వెళ్లాలో తెలియక ప్రాంగణంలోని గోడలు దూకి రోడ్డుపైకి వచ్చారు.అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజీ గేట్లు తెరవకపోవడంతో సభ ప్రాంగణం నుంచి అటు వైపు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాశాల గేట్లు తెరవకపోవడం వల్ల గోడలు దూకి బయటపడ్డారు.

పోలీసులకూ ఇక్కట్లు
పోలీస్‌ ఉన్నతాధికారులతో పాటు నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 70 మంది ఎస్సైలు, 1,500 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు జయహో బీసీ సభ ఏర్పాట్లలో మునిగితేలారు.అయితే వారికి టీడీపీ వర్గాలు భోజనం ఏర్పాట్లు చేయలేదు. దీంతో వారిలో కొంతమంది చెట్ల కింద, అరుగుల పైనా భోజనాలు చేసి విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, కొంతమంది పార్టీ నాయకులు.. పోలీసులపై సభా స్థలం వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌లు ఉన్నవారికే సభా ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లకు పోలీసులతో వాగ్వివాదం తప్పలేదు.

ఎయిర్‌పోర్టులోనూ ఇంతే.
మధురపూడి (రాజానగరం): షెడ్యూల్‌కు భిన్నంగా సీఎం చంద్రబాబు పర్యటన ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టుకు వచ్చిన అధికారులు, పార్టీ వర్గాలు, అభిమానులు ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సివచ్చింది.

ఆహారంలో పడిన బల్లి
పోలీసులు, అధికారులు, ఉద్యోగుల కోసం ఎయిర్‌పోర్టు క్యాంటిన్‌ నిర్వాహకులు తయారుచేసిన ఆహారంలో ఆదివారం బల్లిపడింది. దీంతో క్యాంటిన్‌ నిర్వాహకులు మళ్లీ వంట చేశారు. ఈ ఆహారం తిని ఉంటే ప్రమాదమే వచ్చేదని పోలీసులు, భద్రతా బలగాలు అన్నారు.

వాహన చోదకులకు ఇబ్బందులు
జయహో బీసీ సభ కారణంగా నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం, కోరుకొండ, గోకవరం నుంచి నగరం రావాల్సిన వాహనాలను దారి మళ్లించారు.దీంతో బూరుగుపూడి గేటు మీదుగా రాజానగరం హైవే, గామన్‌ రోడ్డు మీదుగా వాహనాలు వెళ్లడంతో 40 కిలోమీటర్ల దూరభారమైందని వాపోయారు. నగరంలోకి వచ్చే వాహనాలను మధ్యలోనే పోలీసులు నిలిపేశారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను సీఎం సభ కేటాయించారు. దీంతో ప్రయాణికులకు బస్సులు లేక అవస్థలు పడ్డారు. అధిక మొత్తం చెల్లించి ఆటోలను ఆశ్రయించారు.  

ట్రాఫిక్‌ మళ్లింపుతో నగరం దిగ్బంధం
రాజమహేంద్రవరం క్రైం: జయహో బీసీ సభకు ట్రాఫిక్‌ దిగ్భంధనం చేయడం నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగర శివారు ప్రాంతాల్లోనే బస్సులను నిలిపివేయడంతో సభకు వచ్చిన వారు సభా ప్రాంగణానికి నడిచి వెళ్లారు. లాలా చెరువు వైపు నుంచి వచ్చే వాహనాలను నారాయణపురం వద్ద నిలిపివేశారు. పేపర్‌ మిల్లు వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, ధవళేశ్వరం వైపు నుంచి వచ్చే రోడ్లపై అడ్డుకుని రూట్‌ మళ్లించారు. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నగరంలో రోడ్లు దిగ్బంధం చేయడంతో పనుల కోసం వెళ్లిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

మరిన్ని వార్తలు