డేంజర్‌ డెంగీ..

26 Jan, 2019 08:54 IST|Sakshi
విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సావిత్రి

పెద్దాపురంలో 17వ వార్డు కౌన్సిలర్‌   

తాళాబత్తుల కుమార్తెకు సోకిన వ్యాధి

విశాఖ ఆసుపత్రిలో చికిత్స

అపారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేసినా

పట్టించుకోవడం లేదని కౌన్సిలర్‌ ఆవేదన

సాక్షాత్తూ అది రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప నియోజకవర్గంలోని పెద్దాపురం మున్సిపాలిటీ. మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో డెంగీ మహమ్మారి జడలు విప్పుతోంది. పారిశుద్ధ్య నిర్వహణను ఆ మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డుల కౌన్సిలర్లే చెబుతున్నారంటే అక్కడి అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల మాటకే విలువ ఇవ్వని అధికారులు ఇక ప్రజల మాట ఎందుకు వింటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పలువురు డెంగీ వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు.

తూర్పుగోదావరి, పెద్దాపురం: డెంగీ మహమ్మారీ జడలు విప్పుతోంది. గతంలో మండలంలోని  గోరింట, చదలాడ గ్రామాల్లోని పలువురితో పాటు పెద్దాపురం పట్టణంలోని ఒకటో వార్డు కౌన్సిలర్‌కు ఈ వ్యాధి సోకింది. అపారిశుద్ధ్యంపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించని మున్సిపల్, వైద్య శాఖాధికారుల వైఫల్యానికి తాజాగా 17వ వార్డు కౌన్సిలర్‌ తాళాబత్తుల కామేశ్వరి కుమార్తె సావిత్రి (22) ఈ డెంగీ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య విభాగ అధికారుల పనితీరు అసంతప్తిగా ఉందనడానికి నిదర్శనం ఈ డెంగీ కేసులు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గతంలో డయేరియా మహమ్మారి పట్టణాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంఘటనలు మరచిపోయి కనీసం శానిటేషన్‌ పనులు పూర్తిగా చేయకపోవడం పట్ల పాలనా యంత్రాంగానికి ప్రజారోగ్యంపై ఎంత బాధ్యత ఉందో అర్థమవుతూనే ఉందని పలువురు వాపోతున్నారు. 

రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఇళ్ల వద్ద పరిశుభ్ర వాతావరణం కల్పించాలని వైద్యాధికారులు కరపత్రాల ద్వారా బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అది కాస్తా తూతూ మంత్రంగానే చేయడంతో చాలా చోట్ల అపరిశుభ్ర వాతావరణ మధ్యనే ప్రజలు జీవిస్తున్నారు. సంబంధిత వార్డు కౌన్సిలర్‌ కామేశ్వరి భర్త సాయి పలుమార్లు ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద పేరుకుపోయిన పూడిక తీయాలని ఐదు నెలలుగా అధికారులకు చెబుతున్నా వారు పట్టించుకోలేదు. ఫలితంగా తన కుమార్తెకు డెంగీ ప్రబలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిపినా కనీసం డ్రెయిన్లో పూడిక చేపట్టకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్, వైద్య శాఖల ఉన్నతాధికారులు స్పందించి డెంగీ కారణాలపై ప్రజలకు అవగాహనతో పాటు పారిశుద్ధ్య పనులు మెరుగు పర్చాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు