అదుపులోకి రాని డయేరియా

30 Mar, 2018 13:36 IST|Sakshi
బలిజిపేటలో ప్రైవేట్‌ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు

ఆందోళనలో పెదపెంకి వాసులు

ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న బాధితులు

బలిజిపేట:మండలంలోని పెదపెంకిలో డయేరియా వ్యాధి అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వైద్యసేవలు అందకపోవడంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్లే డయేరియా ప్రబలిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన 50 మంది డయేరియా భారిన పడ్డారు. ప్రస్తుతం ఐదు సంవత్సరాల చిన్నారి రామ్‌శెట్టి లక్ష్మణ్, పచ్చిపులుసు మోహనరావు, తదితరులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బలిజిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే చీకటి రమణమ్మతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్‌ హాస్పటల్‌లో వైద్యం పొంది ఇళ్లకు చేరుకున్నారు. ఆర్‌. లక్ష్మి అనే మహిళకు వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టకపోవడంతో విజయనగరంలోని ఆస్పత్రికి.. కె.అశ్విని అనే చిన్నారిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. వీరే కాకుండా కవ్వాడ మమత, సింగారపు శివ గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇంతమంది డయేరియా భారిన పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

క్షీణించిన పారిశుద్ధ్యం
గ్రామంలో ఏ వీధిలో చూసినా కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో పాటు ఎక్కడబడితే అక్కడే చెత్త,చెదారాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈగలు, దోమలు  వృద్ధి చెంది అంటురోగాలు ప్రబలుతున్నాయి. వీధి కుళాయిలు కూడా కాలువల పక్కనే ఉండడంతో తాగునీరు కలుషితమవుతోందని గ్రామస్తులు వాపోతున్నారు.

కానరాని వైద్యసేవలు
గ్రామంలో డయేరియా ప్రబలినా వైద్యసిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు