సామాన్యుడి గుండెకోత

10 Feb, 2014 03:31 IST|Sakshi

ఉదయాన్నే అల్పాహారం తయారు చేయాలంటే మిక్సీ ఆడదు.. వచ్చే పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలని పుస్తకం పట్టుకొని స్విచ్‌వేస్తే బల్బు వెలగదు.. ఆర్డర్లమీద ఆర్డర్లు వచ్చాయి.. ఇక వ్యాపారం పుంజుకుంటుంది అనుకున్న తరుణంలో మిషన్ పరుగెత్తదు.. అర్జెంట్ ఫైల్ ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌కు పంపాలంటే కంప్యూటర్ పనిచేయదు.. ఇలా ఎన్నో సమస్యలు.. తాజాగా ప్రకటించిన విద్యుత్ కోతల కారణంగా జనం పడుతున్న అవస్థలు.

పంట చేతికొస్తే అప్పులు తీరుద్దామని కలలుగన్న అన్నదాత పరిస్థితి మరీ దయనీయం. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పైరు కళ్లముందే ఎండుతోంది. కోట్ల రూపాయలు రుణాలు తెచ్చి స్థాపించిన పరిశ్రమ నష్టాలను మూటగడుతోంది. ఉపాధి లేక వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇవేకాదు.. మరెన్నో గాథలు.. కరెంట్ కోతల కారణంగా సామాన్యుడి గుండెను నలిపే బాధలు.. న్యూస్‌లైన్ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు మీకోసం..
 
 - న్యూస్‌లైన్  నెట్‌వర్క్
 
 వ్యవసాయానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ అస్తవ్యస్తంగా మారింది. మొదట్లో ఏడు గంటలు ఇస్తామని చెప్పారు. రబీలో పంటలు సాగు చేసిన తరువాత దానిని ఆరు గంటలకు కుదించారు. అదన్నా ఇస్తున్నారంటే మళ్లీ కోతలు విధిస్తున్నారు.  కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితిలో అన్నదాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రాత్రీ, పగలు అని తేడా లేకుండా పొలాల దగ్గర నిరీక్షించాల్సి వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ సక్రమంగా సరఫరా అయ్యేదని, ఇపుడు కరె ంటు కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు చొప్పున కరెంటు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా..అందులో సగం కూడా సరఫరా కావడం లేదని ఆరోపిస్తున్నారు.  
 
 వ్యవసాయానికి చీ‘కట్’లే!
 చాగలమర్రి మండలంలో వ్యవసాయానికి రాత్రి 2 గంటలు, పగలు 2గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. గతంలో ఆరు గంటల వరుకు విద్యుత్ సరఫరా అమ్యేదని, రెండు వారాల నుంచి కోత ఎక్కువైందని రైతులు తెలుపుతున్నారు. మళ్లీ విద్యుత్ కోతలు విధించడంతో మూడు గంటలు కూడా సరఫరా చేయరేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 గూడూరు మండలంలో 586 విద్యుత్ కనెక్షన్ల కింద 2650 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. కోడుమూరులో 2000 విద్యుత్ కనెక్షన్ల కింద 7508 ఎకరాలు, సి.బెళగల్‌లో 2786 కనెక్షన్ల కింద 8675 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్ కోత కారణంగా పంటలు ఎండిపోతుంటే ఆయిల్ మోటర్లు పెట్టుకొని పైర్లను రైతులు కాపాడుకుంటున్నారు.
 
 గోనెగండ్ల మండల పరిధిలో 2709 వ్యవసాయ బోర్లు, బావుల కింద వేరుశెనగ, పత్తి, ఉల్లి, మిరప తదితర పంటలను సాగు చేశారు. ఈనెల 3వ తేదీ నుంచి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో ఓక గంట కుదించి 6 గంటలు సరఫరా చేస్తున్నారు. అది కూడా పగటి పూట సక్రమంగా సరఫరా కాక  రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మెయిన్‌లైన్ లాస్ పేరుతో ప్రతి రోజు నాలుగైదు గంటలకంటే ఎక్కువ సరఫరా కావడంలేదని రైతులంటున్నారు.

 ఉయ్యాలవాడ మండలంలో బోరు బావుల కింద, కుందూ నది తీరం వెంట వరి 350 హెక్టార్లు, మిరప 450 హెక్టార్లు, మొక్కజొన్న 110 హెక్టార్లలో సాగు చేశారు.
 
 విద్యుత్ కోతలతో తమ పొలాలకు నీరు పారించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి 4 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
 
 ఎమ్మిగనూరు మండలంలో 3700 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఏ గ్రేడ్ కింద ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 9 నుంచి ఆర్థరాత్రి 12 వరకు సరఫరా ఇస్తున్నారు. అలాగే బి గ్రేడ్ కింద  ఆర్థరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, 3 నుంచి ఉదయం 6 వరకు పంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే అనధికార కోతలతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి.     
              
 నందవరం మండలంలో 1649 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.  మిరప, వరి, వేరుశనగ తదితర పంటలను రైతులు సాగు చేశారు. నందవరం, నాగలదిన్నె, మంత్రాలయం విద్యుత్ సబ్‌స్టేషన్లు ద్వారా కరెంట్ సరఫరా చేస్తున్నారు. సరఫరా సరిగా లేదంటూ రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. అయినా మార్పు లేదని రైతులు సుబ్బారావు, దత్తాత్రేయగౌడ్, నరసప్పలు పేర్కొన్నారు. అప్రకటిత కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వారు తెలిపారు.
 
 దొర్నిపాడు మండలంలో కుందూనది, బోర్ల కింద వరి, మొక్కజొన్న. ఉల్లి తదితర పంటలను 4వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఈ గ్రామాల్లో 301 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. పగలు మూడు గంటలే కరెంట్ వస్తోంది. రాత్రి వేళల్లో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
 
 పరిశ్రమలకు వాత
 వేసవి రాకముందే విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు కుదేలవుతున్నాయి. జిరాక్స్, వెల్డింగ్, కూల్‌డ్రింక్ షాపులు నిర్వహించే వారు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోత లేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నప్పటికీ అనధికారికంగా రోజూ సరఫరా నిలిపివేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కోతలు విధిస్తున్నారు. అనధికారిక విద్యుత్ కోతలతో  ఉత్పత్తులు నిలిచి ఫ్యాక్టరీ యజమానులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది.
 
 
 విద్యుత్ కోతల ప్రభావం నాపరాతి పాలీస్ ప్యాక్టరీలపై పడింది. జిల్లాలో బనగానపల్లె, డోన్ సబ్ డివిజన్ పరిధిలో సుమారు రెండువేల ప్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో 30-40 వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. గత సంవత్సరం పెంచిన సర్‌చార్జీల ప్రభావంతో ఎక్కువ శాతం పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టడుతున్నాయి. నేడు విద్యుత్ కోతలతో అవి మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగర పంచాయతీ, మండల కేంద్రాల్లో రోజుకు 6 గంటల విద్యుత్ కోతను అమలుపరుస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే అనధికారికంగా మరో 2-3 గంటల అదనపు  విద్యుత్ కోతను అమలు పరుస్తున్నట్లు ఫ్యాక్టరీల యజమానులు, కార్మికులు తెలుపుతున్నారు.
 
 తగ్గిన రవాణా
 ఇక్కడ తయారైన పాలీస్ రాయిని లారీల ద్వారా బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్, నాగపూర్, విజయవాడ.. తదితర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. అయితే విద్యుత్ కోతలతో పాలీస్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గింది. దీంతో కార్మికులకూ జీవనోపాధి కరువైంది.
 
 డోన్ పట్టణంలో 150 గ్రానైట్, 20 ప్లాస్టిక్, మరో 300 ఇతర ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమలకు దాదాపు 10 గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి.. కోట్ల రూపాయల్లో నష్టం వస్తోందని వ్యాపారులు తెలుపుతున్నారు.
 
 బేతంచెర్ల మండలంలో 550 పరిశ్రమలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడువేల కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో కార్మికుల వేతనాల్లో కోత పడుతోంది. రోజంతా పనిచేస్తే రూ. 100 కూడా రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు