ప్రశ్నిస్తే పోలీసు కేసులే

12 Nov, 2018 08:07 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులు

మంత్రి సోమిరెడ్డి ప్రవర్తనపై మండిపాటు

ఎస్సీ, ఎస్టీ చట్టాల దుర్వినియోగంపై చర్చ

నెల్లూరు, పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లినా, మంత్రి సోమిరెడ్డిపై ఎదురు తిరిగి ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారనే వాదన బలంగా ఉంది. ఇందుకు పోలీసు అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. పార్టీలు మారే హక్కు ఎవరికైనా ఉంటుంది. సిద్ధాంతాలు, పద్ధతులు నచ్చని నాయకులను హద్దులు మీరకుండా విమర్శలు చేయడం ఎక్కడైనా జరుగుతున్న వ్యవహారమే. అయితే మంత్రి సోమిరెడ్డి ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినా, విమర్శించినా అదును చూసి పోలీసు కేసులు పెట్టిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ గ్రామ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ వర్గాలను పెంచిపోషిస్తున్నట్టు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పొదలకూరు మండలం వైఎస్సార్‌ సీపీకి కంచుకోట కావడంతో ఇక్కడ మంత్రి తన హవాను కొనసాగించేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవకాశం దొరికితే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై పోలీసు కేసులు బనాయిస్తున్నారనే అపవాదు మంత్రిపై ఉంది. గ్రామాల్లో సర్దుకుపోయే వ్యవహారాలను సైతం పోలీసు స్టేషన్‌ వరకు తీసుకు వెళ్లి గ్రామాల్లో రాజకీయాలను రావణకాష్టంలా తయారు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

చట్టాల దుర్వినియోగం
ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా, కార్యకర్త అయినా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కేసులను ఎదుర్కోవాలంటే చట్టానికి ఉన్న ప్రాధాన్యత వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చట్టాలను పరిరక్షించాల్సిన మంత్రే వాటిని దుర్వినియోగం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ కల్యాణపురం, ముత్యాలపేటలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు అక్కెం బుజ్జిరెడ్డి, చేవూరు వెంకటకృష్ణయ్య బిరదవోలు గిరిజనకాలనీకి చెందిన శెనగల చెంచయ్యను కులంపేరుతో దూషించి, వెట్టిచాకిరి చేయించినట్టు వారిపై గతనెల 13న ఫిర్యాదు అందడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందులో స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో మంత్రే ఇద్దరిపై కేసును పెట్టించారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో చెంచయ్య రాజకీయ బలిపశువుగా మారి వాస్తవాలను గ్రహించి ఈనెల 9న నేరుగా హైకోర్టు జడ్జి వద్దకు వెళ్లి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అంతేకాక తనను బుజ్జిరెడ్డి, వెంకటకృష్ణయ్య తిట్టలేదని, వేధించలేదని వాగ్మూలం ఇచ్చాడు. దీంతో జడ్జి బుజ్జిరెడ్డి, వెంకటకృష్ణయ్యలపై పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పరిణామాలతో అధికార పార్టీ నాయకులు మంత్రి ప్రోద్బలంతో రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీల సంఘాల నాయకులు సైతం ఇలాంటి ఘటనలను ఖండిస్తున్నారు.   

గ్రామాల్లో రాజకీయ కక్షలకు ఆజ్యం   
సాధారణంగా రాజకీయ నాయకులు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలను ఆకట్టుకుంటారు. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ కక్షలను ప్రోత్సహించి ఆజ్యం పోసి వర్గాలను ఏర్పాటు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇందుకు మంత్రి సోమిరెడ్డి కృషి చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసును ఎదుర్కొన్న కల్యాణపురం, ముత్యాలపేట గ్రామస్తులు ఇదేవిషయాన్ని విలేకర్ల సమక్షంలో వెల్లడించారు. అక్కెం బుజ్జిరెడ్డి మంత్రి వద్ద పాతికేళ్లకు పైగా ఉన్నారు. ఆయన అండదండలతో బిరదవోలు పంచాయతీలో రావుల అంకయ్యగౌడ్‌ను కూడా ఎదుర్కొని కేసు మోసిన సందర్భాలు ఉన్నాయి. అయితే బుజ్జిరెడ్డిని మంత్రి ఒక సందర్భంలో దుర్భాషలాడడంతో తీవ్రంగా మనస్తాపం చెంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. అనంతరం బుజ్జిరెడ్డి తనకు మంత్రి చేసిన అన్యాయాన్ని సభల్లో వెల్లడిస్తూ వచ్చారు. ఫలితంగానే బుజ్జిరెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కోవాల్సి వచ్చిందని పంచాయతీ ప్రజలు వెల్లడిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గ్రామాల్లో చాలానే ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్లు సైతం అవమానాలు ఎదుర్కొంటున్నారని, సమయం చూసి దెబ్బకొడతామని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతున్నందున ఈ ఘటనలు ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదని, అక్రమ కేసులు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు