చివరి మజిలీకీ తిప్పలే!

30 Aug, 2018 10:08 IST|Sakshi

శవాన్ని తరలించేందుకు రోడ్డులేక ‘నడక’యాతన

శ్రీకాకుళం జిల్లాలో ఘటన

ఆమదాలవలస రూరల్‌ : రాష్ట్రంలో అడుగడుగునా సిమెంటు రోడ్లంటూ ప్రభుత్వ ప్రచారాలు ఓ వైపు.. శ్మశానానికి వెళ్లేందుకు కనీసం రోడ్డు లేక పొలాల మధ్యనే శవాన్ని తరలించాల్సిన ‘నడక’యాతన మరోవైపు. మనిషి చివరి మజిలీ అంతిమయాత్రకు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి బుధవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటలో దాపురించింది. గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన కలివరపు సరోజనమ్మ (60) అనారోగ్యంతో చనిపోయింది. ఈమె మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు చేరుకునేందుకు రహదారి సదుపాయం లేకపోవడంతో సుమారు కిలో మీటర్‌ దూరం పంటపొలాల్లో నుంచి శవాన్ని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. శ్మశానవాటికకు రహదారి ఏర్పాటు చేయాలని పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు