ఏడి‘పింఛెన్‌’

11 Jun, 2018 06:48 IST|Sakshi
పింఛన్లు సక్రమంగా అందడం లేదని మారేడుమిల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వై.రామవరం మండల ఎగువ ప్రాంత లబ్ధిదారులు

వేలిముద్రలు పడక లబ్ధిదారులకు ఇక్కట్లు

నెలనెలా తగ్గిపోతున్న సంఖ్య

పంపిణీ అధికారులకూ తప్పని తిప్పలు

వై.రామవరం (రంపచోడవరం): దట్టమైన అటవీప్రాంతం.. మారుమూల గ్రామాలు.. కమ్యూనికేషన్‌ చాలా కష్టం.. ఫోన్లు పనిచేయవు. వెళ్లే దార్లు బాగోవు.. విద్యుత్‌సరఫరా అంతంతమాత్రమే. అటువంటి ప్రాంతంలో ఎందరో పింఛనులబ్ధిదారులు.. వారికి నెలనెలా పింఛను ఇవ్వడం నిజంగా కత్తిమీద సామే. వై.రామవరం మండలంతోపాటు తూర్పు, సరిహద్దు ప్రాంతమైన విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వేలిముద్రలు పడక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నెలనెలా పింఛన్లు రద్దయ్యి, లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతోంది. సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా లోతట్టు ఏజెన్సీ ప్రాంతంలో అయితే అధికార యంత్రాంగం బహుదూరంలో ఉండడం వల్ల సగానికిపైగా పింఛన్లు రద్దయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు.

వై.రామవరం మండలంలో..
మండలంలో ఆరు నెలల క్రితం సుమారు 3100 మంది పింఛన్లు అందుకునేవారు. వరుసగా మూడేసి నెలలు పింఛన్లు సక్రమంగా తీసుకోకపోవడంతో అవి రద్దయ్యి ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 2806కు చేరింది. మండల ఎగువ ప్రాంతంలో పాతకోట, కానివాడ, బొడ్డగండి, చింతలపూడి, దారగడ్డ, గుర్తేడు, పంచాయతీల పరిధిలో సుమారు వంద గ్రామాలున్నాయి. ఎక్కువ శాతం దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలపై ఉన్నాయి.

అక్కడ కమ్యూనికేషన్‌ ఉండదు. మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవు. ట్యాబ్‌లు పనిచేయవు. విద్యుత్‌ సరఫరా లేక చార్జింగ్‌ పడిపోయి, మరోపక్క వ్యవసాయ పనులు చేసుకునే గిరిజనుల వేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు పడక ప్రతినెలా సక్రమంగా పింఛన్లు అందడం లేదు. ఎంపీడీఓ కె.బాపన్న దొర స్వయంగా వాహనాలు పెట్టుకుని పింఛన్ల పంపిణీ సిబ్బందిని ఆయా గ్రామాలకు తీసుకువెళ్లినా ఫలితం లేదన్న ఆరోపణలున్నాయి.

ట్యాబ్‌లు అక్కడ పనిచేయక ఆయా పంచాయతీల్లోని లబ్ధిదారులు రానుపోను సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం మారేడుమిల్లి రావల్సిన దుస్థితి నెలకొంది. ట్యాబ్‌లు మొరాయిస్తుండడంతో అధికారులు కూడా తిరిగిన గ్రామాలకే పదిసార్లు తిరగాల్సి వస్తోంది. ప్రతి నెలా ఐదోతేదీలోపు నూటికి నూరు శాతం పింఛన్లు పంపిణీ కావలసి ఉండగా ఈ నెల తొమ్మిదో తేదీ వచ్చినా మండలంలో ఇంత వరకు 1345 పింఛన్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. 50 శాతం కూడా పూర్తికాకపోవడం దురదృష్టకరం. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసినా ప్రయోజనం శూన్యం.

పాత పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేయాలి
ఏజెన్సీ ప్రాంతంలో ఆన్‌లైన్‌ విధానానికి స్వస్తి పలికి పాతపద్ధతిలోనే సిబ్బంది ద్వారా లబ్ధిదారుడి చేతికి పింఛను సొమ్ము అందించాలని మండల ఎగువప్రాంత లబ్ధిదారులు కోరుతున్నారు. శనివారం పింఛన్ల కోసం మారేడుమిల్లి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారులు వేలి ముద్రలు పడక నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంపిణీ అధికారులు, సిబ్బందిని నిలదీశారు. ఏజన్సీ ప్రాంతంలో సక్రమంగా పింఛన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు