అప్రకటిత కోత!

7 Mar, 2018 13:14 IST|Sakshi

విద్యుత్‌ కోతలతో జనం కటకట

ముందస్తు సమాచారం లేక వినియోగదారుల అవస్థలు

సర్‌ప్లస్‌ అని చెబుతూనే విద్యుత్తు సంస్థ సర్దుబాట్లు

మరమ్మతుల పేరిట గంటల కొద్దీ సరఫరా నిలిపివేత

రోజుకు సగటున 50 లక్షల యూనిట్లు వినియోగం

రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ డిమాండు

వేసవి ప్రారంభం నుంచే జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. నిరంతర సరఫరాతో రాష్ట్రం చరిత్ర సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనల మాటేమో కానీ అప్పుడే వినియోగదారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. సాక్షాత్తూ విద్యుత్‌ శాఖ మంత్రి కళావెంకటరావు సొంత జిల్లాలోనే ప్రజలకు విద్యుత్‌ కష్టాలు తప్పట్లేదు. విద్యుత్‌ సర్‌ప్లస్‌లో ఉన్నామని పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) అధికారులు చెబుతున్నా మరమ్మతులు సాకుతో గంటలకొద్దీ సరఫరా నిలిపేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గత ఏడాదితో పోల్చితే ఈ వేసవి ప్రారంభంలోనే  వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వేసవి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు పెరిగేకొద్దీ అంటే ఏప్రిల్, మే నెలల్లో డిమాండు అనూహ్యంగా ఉంటుందని విద్యుత్‌ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.  అందుకుతగినట్లు సరఫరా ఎలా ఉంటుందనేదే సమస్య.

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:  జిల్లాలో మొత్తం 7.53 లక్షల గృహావసర (డొమెస్టిక్‌) కనెక్షన్లతో పాటు వాణిజ్య అవసర ఇతరత్రా కనెక్షన్లు కలిపి మొత్తం 7.90 లక్షలు ఉన్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచి జిల్లాలో విద్యుత్‌ వినియోగం రోజుకు 50 లక్షల యూనిట్లు (5 ఎంయూ) ఉంటోంది. గత ఏడాది వేసవి కాలం ఏప్రిల్‌ నెల మొత్తం 127 ఎంయూ విద్యుత్‌ వినియోగం కాగా, మే నెలలో అది 136 ఎంయూకి చేరింది. సగటున రోజుకు దాదాపు 44 లక్షల యూనిట్లు ఉండేది. కానీ ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలు మార్చి ప్రారంభం నుంచే ఎక్కువయ్యాయి. రాత్రిపూట చల్లని వాతావరణం ఉన్నప్పటికీ పగటిపూట అధిక ఉష్ణోగ్రత వల్ల ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉక్కపోత పెరుగుతోంది. మరోవైపు జిల్లాలో ఏసీల వినియోగం కూడా ఏటా అధికమవుతోంది. దీంతో విద్యుత్‌కు డిమాండు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అంటే సగటున రోజుకు 50 లక్షల యూనిట్లకు మించి విద్యుత్‌ అవసరం ఉంటుంది. ఈలెక్కన నెలకు 150 ఎంయూల వరకు వినియోగానికి అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ అంచనాలు వేస్తోంది. ఈమేరకు డిమాండ్‌కు తగినట్లు సరఫరా ఇవ్వగలమని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే భిన్నంగా ఉన్నాయి.

కోతలకు కారణాలేమిటో...
విద్యుత్‌ శాఖ పరిధిలో ప్రస్తుతం పలుచోట్ల మరమ్మతులతో పాటు కొన్నిచోట్ల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో విద్యుత్‌ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎల్‌ఈడీల ఏర్పాటు లక్ష్యంగా థర్డ్‌ వైర్‌ను ఇంకా 31 మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 310 పంచాయతీల్లోనూ, టెక్కలి డివిజన్‌లో 171 పంచాయతీల్లో థర్డ్‌ వైర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రం శ్రీకాకుళంతో పాటు పలుచోట్ల స్తంభాలు, కొత్తగా కండక్టర్ల మార్పు పనులు చేస్తున్నారు. ఈ పేరుతో ఆయా ప్రాంతాల్లో గంటల తరబడి సరఫరాను నిలిపివేస్తున్నారు. వాస్తవానికి ఎలాంటి మరమ్మతు పనులైనా శుక్రవారం, ఆదివారాల్లోనే చేయాలని సీఎండీ కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి. అయినా స్థానిక అధికారులు వాటిని అమలు చేయట్లేదనే చెప్పాలి. అసలే పరీక్షల సమయంలో రోజంతా విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో విద్యార్థులు, వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రైతులు కూడా వ్యవసాయ పంపుసెట్లు పనిచేయక పొలానికి నీరు అందట్లేదని ఆవేదన చెందుతున్నారు. పైడిభీమవరం, నవభారత్‌ వంటి ప్రారిశ్రామిక వాడల్లోనూ విద్యుత్తు అప్రకటిత కోతలతో ఇబ్బందులు తప్పట్లేదు.

ఇప్పట్లో విద్యుత్‌ కోతలు లేవు
జిల్లాలో సర్‌ప్లస్‌లోనే విద్యుత్‌ సరఫరా ఉంది. కావాల్సిన డిమాండ్‌ కంటేæఅధికంగానే డిస్కం నుంచి సరఫరా ఉంటోంది. అందుకే ఎటువంటి విద్యుత్‌ కోతలను విధించడం లేదు. అయితే పలు అభివృద్ధి, మరమ్మతు పనుల సమయాల్లో కొంత సమయం సరఫరా నిలిపివేతలు తప్పవు. అయితే విద్యుత్‌ సరఫరా నిలిపివేసే ప్రాంతాల్లో వినియోగదారుల సెల్‌ఫోన్లకు ఊర్జా మిత్ర యాప్‌ ద్వారా సమాచారం అందిస్తున్నాం.– బి.దేవవరప్రసాద్, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌

మరమ్మతులు సకాలంలో జరగట్లేదు
విద్యుత్‌ మరమ్మతుల్లో జాప్యం జరుగుతోంది. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో పోలాల్లో రైతులమంతా ఎదురుచూపులు చూస్తూ ఇబ్బంది పడుతున్నాం. నిరవధికంగా విద్యుత్‌ సరఫరా జరిగితేనే ఉపయోగం. – కింతలి శ్రీనివాసరావు, రైతు, ఎస్‌ఎం పురం, ఎచ్చెర్ల మండలం

మరిన్ని వార్తలు