కరెంట్ కోత-ఉక్కపోత

28 May, 2015 02:27 IST|Sakshi

రోజుకు 11లక్షల యూనిట్లు  పెరిగిన వినియోగం
తరచూ సరఫరాలో అంతరాయాలు
కొన్ని ప్రాంతాల్లో అనధికార కోతలు
విద్యుత్ లేక అల్లాడుతున జనం
ఫోన్లకు స్పందించని అధికారులు

 
 నెల్లూరు (రవాణా) : ఓవైపు ఠారెత్తిస్తున్న ఎండలు, మరోవైపు ఎడాపెడా కోతలు వెరసి సింహపురి ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. బయటకు అడుగుపెట్టాలంటే నిప్పులుగక్కుతున్న ఎండ, ఇంట్లో ఉందామంటే విపరీతమైన ఉక్కపోతతో జనం ఉడికిపోతున్నారు. ప్రధానంగా ఎండతీవ్రతకు వృద్ధులు, చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతకు విద్యుత్ సమస్యలు తోడవడంతో జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది.

రోహణి కార్తె రావడంతో జిల్లాలో వారంరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరగడంతో పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా తరచూ సరఫరాలో సమస్యలు ఏర్పడుతూ గంటల తరబడి కోతలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో అధికారులు అనధికార కోతలు విధిస్తున్నారు. బుధవారం నెల్లూరు రూరల్ ప్రాంతంలోని అల్లీపురం, పెద్దచెరుకూరపాడు, కాకుటూరు తదితర ప్రాంతాల్లో 5 నుంచి 6 గంటలకు పైగా సరఫరా నిలచిపోయింది.

 పెరిగిన వినియోగం
 గత వారంరోజులుగా జిల్లాలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా జిల్లాలో రోజూ కోటి యూనిట్లు వినియోగానికి మించదు. ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకోవడంతో వినియోగదారులు ఉదయం నుంచే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. రోజుకు అదనంగా లక్షా 30వేల యూనిట్లకుపైగా వినియోగం అవుతున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. గత 4రోజులుగా పెరిగిన వినియోగాన్ని ఒకసారి పరిశీలిస్తే...
 24వ తేదీ         - 10.9 మిలియన్ యూనిట్లు
 25వ తేదీ         - 11.3 మిలియన్ యూనిట్లు
 26వ తేదీ         - 11.3 మిలియన్ యూనిట్లు
 27వ తేదీ         - 11.4 మిలియన్ యూనిట్లు

 సరఫరాలో అంతరాయాలు...
 వినియోగం పెరగడంతో సరఫరాలో తరచూ అంతరాయాలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వినియోగం అధికంగా ఉండటంతో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో బ్రేకర్స్ ఫెయిల్ అయ్యి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. విద్యుత్ అధికారులు డిమాండ్ ఎక్కువగా సమయంలో మరమ్మతుల పేరుతో గంట నంచి రెండు గంటలపాటు అనధికార కోతలు విధిస్తున్నారు. ప్రధానంగా నిమ్మ, బత్తాయి తదితర పండ్లతోటలు ఉండటంతో రైతులు మోటార్లును విరివిగా వినియోగిస్తున్నారు. వ్యవసాయానికి 5 గంటలకు మించి సరఫరా ఇవ్వకపోవడంతో రైతులు అనధికారికంగా మరో రెండు మోటార్లు బిగించి విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి తదితర ప్రాంతాల్లో అనధికార కోతలు విపరీతంగా ఉన్నాయి.

 అల్లాడుతున్న జనం
 ఎండలు తీవ్రత, అనధికార కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉక్కపోతకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజు 2 నుంచి 3 గంటల పాటు కరెంటు పోతుండటంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.

 ఎండలు తీవ్రత వల్లే....
-నాగశయనరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
 ఎండ తీవ్రతతో సరఫరాలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు ఎండ తీవ్రతకు కాలిపోతున్నాయి. తీగలు, స్తంభాలు మరమ్మతులకు గురైనప్పుడు పైకి ఎక్కాలంటే అధికవేడిమితో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తాం.

మరిన్ని వార్తలు