మండుటెండలోనూ ముందడుగు

30 May, 2018 07:59 IST|Sakshi
మత్స్యపురిలో ముందుకు సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఉత్సాహంగాముందుకు కదులుతోంది. మంగళవారం 43 డిగ్రీల మండుటెండలోనూ భీమవరం, నరసాపురంనియోజకవర్గాల్లో జననేత పాదయాత్ర సాగింది. జగనన్న అడుగడుగునా పేదల కష్టాలు వింటూ..వారికి ధైర్యం చెబుతూ.. రాజన్న రాజ్యం ఎంతో దూరంలో లేదని భరోసా ఇస్తున్నారు. సర్కారు తీరును ఎండగడుతూ.. ముందడుగు వేస్తున్నారు.                             

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు ఊళ్లు కదిలివస్తున్నాయి. జగనన్న వెంటే మేమంటూ పల్లె ప్రజలు నినదిస్తున్నారు. రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు, యువకులు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలు జగనన్నను కలిసేందుకు అడుగులు వేస్తున్నారు. ఆయనతో మాట్లాడేందుకు.. కష్టాలు విన్నవించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. యువకులు ఆయన వెంటే కిలోమీటర్లు నడుస్తున్నారు. ఆయనతో కరచాలనం, సెల్ఫీ కోసం పోటీపడుతున్నారు. జయహో జగన్‌ అంటూ నినదిస్తున్నారు.

యాత్ర సాగిందిలా..
మంగళవారం పాదయాత్ర భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం, నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలంలో జరిగింది.  ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఉదయం వీరవాసరంలో ప్రారంభమైన యాత్ర  తలతాడితిçప్ప, మెంటేపూడి క్రాస్, బొబ్బనపల్లి, మత్స్యపురి మీదుగా నరసాపురం నియోజకవర్గం సీతారామపురం క్రాస్, కొప్పర్రు వరకూ సాగింది. నరసాపురం నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించగానే ప్రజలు, పార్టీ నాయకులు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి దారి పొడుగునా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాగునీటి కష్టాలపై మొరపెట్టుకున్నారు. ప్రతిచోటా రంగుమారిన నీరు వస్తోందని, దీనివల్ల తాము రోగాలబారిన పడుతున్నామని పల్లెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జననేత చలించిపోయారు. ప్రజలకు రక్షిత మంచినీరు అందించలేని సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు.

కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ..
యాత్రలో కొబ్బరి ఒలుపు కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, రైతులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సంభాషించారు. తమ కష్టాలు, ఇబ్బందులు జననేతకు వివరించారు. ఆరుగాలం కష్టపడుతున్నా తమకు న్యాయం జరగడం లేదంటూ రైతులు జగనన్నకు మొరపెట్టుకున్నారు.  మద్దతు ధర ఇవ్వకపోగా, కొన్న ధాన్యానికి రెండు, మూడు నెలలపాటు డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్‌ వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకు వద్దామనుకుంటే గల్ఫ్‌ ఏజెంట్లు చేస్తున్న మోసాల వల్ల అక్కడ నరకయాతన అనుభవిస్తున్నామని బొబ్బనపల్లికి చెందిన గుబ్బల సురేష్‌ జగనన్న వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఆరేళ్లపాటు అక్కడ వెట్టిచాకిరి చేసినా పైసా సంపాదించకపోగా కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని, భవిష్యత్తులో తనలా ఎవరూ ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. బంగారు తల్లి పథకాన్ని అమలు చేయడం లేదని, గత ప్రభుత్వాలు చట్టం తీసుకువచ్చినా చంద్రబాబునాయుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు లేవన్న పేరుతో  కొత్తగా ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోవడం లేదని పలువురు మహిళలు జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోగా పావలావడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదని భీమవరం పట్టణానికి చెందిన డ్వాక్రా మహిళలు జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు కాకపోవడం వల్ల తమ పిల్లలను అప్పు చేసి చదివించాల్సి వస్తోందని వివరించారు.  వీరవాసరం పంచాయతీలో తలతాడితిప్ప కాలనీ నిర్మించి మూడు దశాబ్దాలు అయినా ఇంతవరకూ రోడ్డు సదుపాయం లేదని  గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మెంటేపూడిలో కుళాయిలలో వస్తున్న నీరు పచ్చ రంగులో ఉందని, దీంతో కొనుక్కుని తాగాల్సి వస్తోందని జననేతకు వివరించారు. 13 ఏళ్లుగా ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్నా తమకు కనీస వేతనాలు అందడం లేదని వీరవాసరం గ్రామానికి చెందిన ఉన్నమట్ల బేబీ కుమారి జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మత్స్యపురికి చెందిన బుంగా మేరీ తన కుమారునికి జగన్‌ చేతుల మీదుగా అన్నప్రాశన జరిపించారు. పేదల కష్టాలు సావధానంగా విన్న జగనన్న వారి కన్నీళ్లు తుడిచి అండగా ఉంటానని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. 

పాల్గొన్న పార్టీశ్రేణులు
పాదయాత్రలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్, ఉంగుటూరు కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు, పామర్రు కన్వీనర్‌ అనీల్‌ కైలీ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, సినీ నటుడు పృధ్వీ,  రాష్ట్ర కార్యదర్శులు కవురు శ్రీనివాస్, బర్రె శంకరం,  కమ్మ శివరామకృష్ణ,  పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు పీడీ రాజు, పార్టీ నేతలు గాదిరాజు సుబ్బరాజు, ఏఎస్‌ రాజు, సాగిరాజు హరివర్మ, దిరిశాల కృష్ణ శ్రీనివాస్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, ఆకిన వీరాస్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు