పోటెత్తిన జనాభిమానం

18 Jul, 2018 06:53 IST|Sakshi
కొవ్వాడలో ప్రజలకు అభివాదం చేస్తూ సాగుతున్న జగన్‌

కాకినాడ రూరల్‌లో ఘన స్వాగతం

కొవ్వాడలో జన ప్రభంజనం

ఆకట్టుకున్న  65 అడుగుల జగన్‌ కటౌట్‌

అనపర్తి నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర

కాకినాడ రూరల్, సిటీలో

సాగనున్న 215వ రోజు పాదయాత్ర

కాకినాడలో నేడు భారీ బహిరంగ సభ

సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి , కాకినాడ: ఒక్క నేతతో వేల అడుగులు.. కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ అభిమానం రెట్టింపు అవుతోంది. జనాభిమానం పోటెత్తుతోంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కొవ్వాడలో అడుగుపెట్టగానే అదే సాక్షాత్కరించింది. అన్న ఆశీర్వాదం పొందేందుకు అక్కాచెల్లెమ్మలు.. మనవడిని చూసేందుకు అవ్వాతాతలు.. కొడుకుగా అండగా నిలుస్తాడన్న ఆశతో తల్లులు.. తమ భవిష్యత్‌ కోసం పరితపిస్తున్న జననేతను చూడాలని యువకులు అశేషంగా తరలివచ్చారు. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి పూలబాటతో ఎదురేగి స్వాగతం పలికారు. ఆత్మీయ నేతను అక్కున చేర్చుకుని, అడుగులో అడుగేసి దారి పొడవునా నీరాజనం పలికారు. ఇంకేముంది ప్రజా సంకల్పయాత్ర జనజాతరను తలపించింది.  పాదయాత్ర జనసంద్రంగా మారింది. జనం జనం ప్రభంజనంగా ముందుకు సాగింది.

కొవ్వాడలో ఘన స్వాగతం
ఎక్కడా లేని విధంగా.. ఎప్పుడూ చూడని దృశ్యంగా 65 అడుగుల భారీ కటౌట్‌ మధ్య కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కొవ్వాడ వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైఎస్‌ జగన్‌ కటౌట్‌ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా దాని కింద పాదయాత్ర కొనసాగడం మధురస్మృతిగా నిలిచింది. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో అశేషంగా తరలివచ్చిన ప్రజలు నీరాజనం పలికారు. తమ నియోజకవర్గంలో అడుగుపెట్టిన జననేతతో అడుగేసి కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు. దీంతో కొవ్వాడలో సందడి నెలకొంది. కిక్కిరిసిన జనంతో పండగను తలపించింది. రోడ్డంతా జనంతో కిటకిటలాడింది.

‘సంకల్పం’ సాగిందిలా..
214వ రోజు ప్రజాసంకల్ప యాత్ర అనపర్తి నియోజకవర్గం కరకుదురు శివారు నుంచి ప్రారంభమై కరకుదురు, ఏపీ త్రయం, రామేశ్వరం మీదుగా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కొవ్వాడ వరకు సాగింది. మ«ధ్యాహ్నం వరకు అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం కొవ్వాడ వద్ద కాకినాడ రూరల్‌లోకి అడుగుపెట్టారు. మంగళవారం ఎండా, వాన మధ్య పాదయాత్ర సాగింది. కాకినాడ రూరల్‌లో వర్షంలోనే ప్రజా సంకల్పయాత్ర కొనసాగింది. మంగళవారం ఉదయం కరకుదురు శివారులోని శిబిరం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం మధ్య పాదయాత్ర ప్రారంభించగా,  సాయంత్రం అశేష జనవాహిని మధ్య కొవ్వాడలో పాదయాత్ర ముగించారు. ఇక పాదయాత్ర ఆద్యంతం జననేతకు జనం జేజేలు పలికి.. జగనన్న అడుగులో జనం అడుగేశారు. వికలాంగులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, ఇలా అన్ని వర్గాల వారు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. శ్రమజీవులకు అండగా, సామాన్యులకు తోడుగా, ఆపదలో ఉన్న వారికి భరోసాగా జననేత జగన్‌మోహన్‌రెడ్డి తనదైన శైలిలో పాదయాత్ర సాగించారు. ఓపిగ్గా సమస్యలు వింటుండటంతో  సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వద్దకు వచ్చి  బాధలు చెప్పుకున్నారు. వారికి భరోసా ఇచ్చి జగన్‌ ముందుకు సాగారు.

పాదయాత్రలో పార్టీ శ్రేణులు
పాదయాత్రలో ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, తలశిల రఘురాం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, సమన్వయకర్తలు సత్తి సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు,  అనంత ఉదయ భాస్కర్, కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ, పొన్నాడ సతీష్‌కుమార్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పార్టీ నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, లింగం రవి, కాలా లక్ష్మణరావు, మిండగుదిటి మోహన్, సత్తి సుబ్బిరెడ్డి, నల్లమిల్లి దుర్గా ప్రసాద్‌రెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, మోకా సూరిబాబు, సత్తి సుబ్బారెడ్డి, సబ్బిళ్ల కృష్ణారెడ్డి, కర్రి పాపారాయుడు, కొల్లి నిర్మలాకుమారి, మేడపాటి షర్మిలారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు వేనవేలు
పాదయాత్ర ఆద్యంతం వినతులు వెల్లువెత్తాయి, పలు సమస్యలు వైఎస్‌ జగన్‌ దృష్టికొచ్చాయి. తమ గ్రామంలో ఒకేసారి 40 మంది రేషన్‌ కార్డులు తీసేశారని అనపర్తి నియోజకవర్గం కొప్పవరానికి చెందిన పోతంశెట్టి ఆదిరెడ్డి వివరించగా, వైకల్యంతో బాధ పడుతున్న తనను ఆదుకోవాదలని శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన పుత్సా దివాకరరావు వేడుకున్నారు. బోధనేతర పనులు అప్పగించడంతో విద్యా బోధనలో నాణ్యత తగ్గిపోతోందంటూ కరకుదురు వద్ద ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నారు. కష్టపడి చదివించిన తన ఇద్దరు ఆడపిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించి, ఆదుకోవాలని కరకుదురుకు చెందిన సానా సుబ్బయ్య కోరారు. ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం పెంచాలని రామేశ్వరం వద్ద దళిత మహిళలు జగన్‌ను కలిసి తమ స్థితిగతులను చెప్పుకున్నారు. జన్మభూమి కమిటీలు పక్షపాతంగా వ్యవహరించి, వైఎస్సార్‌ సీపీలో తిరుగుతున్నానని ఉద్యోగం నుంచి తీసేశారని కరకుదురుకు చెందిన తోటకూర లోవరాజు మొరపెట్టుకున్నాడు.

కరకుదురు వద్ద వైఎస్‌ జగన్‌ను కాపునాడు జేఏసీ నేతలు కలిశారు. తమను ఓటు బ్యాంకుగానే పరిగణించిన చంద్రబాబు దారుణంగా మోసం చేశారని జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వారు చెప్పినదంతా విన్న జననేత  అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఏపీ త్రయం వద్ద జగ్గంపేట నియోజకవర్గం రంప యర్రంపాలేనికి చెందిన ముస్లింలు జగన్‌ను కలిశారు. మహానేత వైఎస్సార్‌ తమకు చేసిన మేలును గుర్తు చేశారు. తమను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే కాకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పించి ఆదుకున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, తమరు సీఎం అయితే అన్నివిధాలా న్యాయం జరుగుతుందని ముస్లింలు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా లేకపోవడం వల్ల తాము ఫీజులు చెల్లించాల్సి వస్తోందని గుండా మహేశ్వరి మొర పెట్టుకుంది.

తనకు ఉచిత సీటు వచ్చినా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని, ఏడాదికి రూ.8 వేలు చెల్లించి కాకినాడలో ఎంఎస్సీ బయో కెమిస్ట్రీ కోర్సు అభ్యసిస్తున్నారని వివరించారు. ఏపీ త్రయం వద్ద పాదయాత్రలో లావనార లక్ష్మి అనే మహిళ వైఎస్‌ జగన్‌ను కలిసి ఆదర్శ రైతుగా గుర్తింపు పొందిన తన భర్త ఫిట్స్‌ వచ్చి 10 నెలల క్రితం చనిపోయాడని, అయితే చంద్రన్న బీమా ప«థకంలో తమకు ఎలాంటి లబ్ధీ చేకూరలేదని తెలిపింది. ఎన్ని సార్లు తిరిగినా అధికారులు న్యాయం చేయాలని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. రామేశ్వరంలో ఆటో డ్రైవర్లు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. తమ సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు ఎంతో మేలు చేయనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నాగార్జున అనే ఆటోడ్రైవర్‌ ఖాకీ చొక్కాను కాసేపు జగన్‌ ధరించారు. దీంతో నాగార్జున ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక్కడే అంగన్‌ వాడీ కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.

సేవకు తగ్గ వేతనాలు చెల్లించడం లేదని, ఉద్యోగ భద్రత కూడా కరువైందని పేర్కొన్నారు. తమ సర్వీసు క్రమబద్ధీకరించడంతో పాటు హెల్త్‌కార్డులు ఇప్పించాలని వేడుకోగా, సానుకూలంగా స్పందించిన జననేత అధికారంలోకి రాగానే తప్పనిసరిగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇలా వినతుల స్వీకరణతో ముందుకు సాగిన ప్రజా సంకల్పయాత్ర కాకినాడ రూరల్‌లో ప్రవేశించేసరికి అభిమానంతో పులకరించిపోయింది. జననేతను స్వాగతిస్తూ రూరల్‌ నియోజకవర్గ అభిమానులు, కార్యకర్తలు కొవ్వాడ రైల్వే గేటు వద్ద ఏకంగా 65 అడుగుల కటౌట్‌ ఏర్పాటు చేశారు. పాదయాత్రలో ఈ కటౌట్‌ ప్రత్యేకంగా నిలవడమే కాకుండా అందరినీ ఆకట్టుకుంది. ఒకవైపు వర్షం కురుస్తున్నా ఆశేష జనవాహిని మధ్య కొవ్వాడలో అడుగు పెట్టిన జగన్‌ ప్రతీ ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జోరువానలో పాదయాత్ర కొనసాగించారు. కొవ్వాడ వద్ద వైఎస్‌ జగన్‌ను సినీ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కలిశారు. కాగా, బుధవారం కాకినాడ రూరల్, సిటీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగి, కాకినాడలో భారీ బహిరంగ సభ జరగనుంది.

మరిన్ని వార్తలు